
న్యూయార్క్ లో ఒమర్ అబ్దుల్లాకు చేదు అనుభవం
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు న్యూయార్క్ విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది.
న్యూయార్క్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు న్యూయార్క్ విమానాశ్రయంలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. చెకింగ్ పేరుతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటల పాటు విమానాశ్రయంలో వేచి ఉండేలా చేశారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా వెళ్లిన ప్రతిసారి ఈ అనుభవం ఎదురవుతోందని ఆయన తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒమర్ అమెరికా వెళ్లారు. అయితే మొదటిసారి తనిఖీలు పూర్తయినా, మరోసారి ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు చేయటంపై అభ్యంతరం తెలుపుతూ ఈ మేరకు ఒమర్ విమానాశ్రయం నుంచే తన ట్విటర్ ఖాతా ద్వారా వరుసగా ప్రశ్నలు సంధించారు.
తనిఖీల పేరుతో పదే పదే ఇలా జరగడం బాగోలేదని పేర్కొన్నారు. ఎక్కడైనా భద్రత నియమాలను తాను గౌరవిస్తానని.. కానీ అమెరికాలో ప్రతిసారి ఇలా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుచెప్పడం ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేశారు. రెండు గంటలపాటు ఖాళీగా విమానాశ్రయంలో గడపాల్సి వచ్చిందని ఒమర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టైమ్ పాస్ చేసేందుకు ఆ సమయంలో పోకీమన్ ను కూడా అందుకోలేకపోయానంటూ ఆయన చమత్కరించారు. కాగా గతంలోనూ బాలీవుడు నటులు షారూఖ్, అక్షయ్ కుమార్లకూ తనిఖీల పేరుతో ఇమిగ్రేషన్ అధికారులు గంటలపాటు నిర్భందించిన విషయం తెలిసిందే.
Another "random" secondary immigration check upon landing in the US. Thrice in three visits, the randomness is growing tiresome now.
— Omar Abdullah (@abdullah_omar) 16 October 2016