జీఎస్టీ: ఈ కామర్స్ సంస్థలకు భారీ ఊరట
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు నేపథ్యంలో ఇ-కామర్స్ సంస్థలకు భారీ ఉపశమనం లభించనుంది. టిడిఎస్, టిసిఎస్ నిబంధనల అమలును ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ చట్టం అమలుకు ఇంక నాలుగు రోజులు సమయం ఉండగా ఈ కామర్స్ సంస్థలకు ఊరట కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ కామర్స్ సంస్థలు 1 శాతం పన్ను టీసీఎస్ ను వసూలు చేయాల్సిన అవసరం లేదు. దీంతో 1 శాతం పన్నును మూలంలోనే మినహాయించాల్సిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఇ-కామర్స్ సంస్థలకు ఊరటనందించింది.
వాణిజ్యం మరియు పరిశ్రమల నుంచి పొందిన అభిప్రాయాల ఆధారంగా, సీజీఎస్టీ/ స్టేట్ జిఎస్టి చట్టం 2017 యొక్క టీడీఎస్ (సెక్షన్ 51), టీసీఎస్ (సెక్షన్ 52) కు సంబంధించిన నిబంధనల అమలును ప్రభుత్వం ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చారిత్రక పన్ను సంస్కరణ జీఎస్టీ కోసం ఇకామర్స్ కంపెనీలు, వారి పంపిణీదారులకు మరింత ఎక్కువ సమయం ఇవ్వడానికే ఈ చర్య తీసుకున్నామని పేర్కొంది.
జూలై 1 నుంచి అమలు చేయనున్న జీఎస్టీ చట్టం ప్రకారం దీన్ని ఈ కామర్స్ సంస్థలు అమలు చేయాల్సి ఉంది. సెంట్రల్ జిఎస్టి (సిజిఎస్టి) చట్టం ప్రకారం టిటిఎస్ (మూలధనం నుండి పన్ను తగ్గింపు) 1 శాతం పన్నును అమలును పెండింగ్లో పెట్టింది. నోటిఫై చేయబడిన సంస్థలు రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సరకులకు లేదా సేవలకు సరఫరాదారులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఈ నిబంధన అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది.
అలాగే రూ.20 లక్షల లోపు చిన్న వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరంలేదు. మరోమాటలో చెప్పాలంటే ఇ-వ్యాపారం నిర్వహించే వ్యక్తులు తక్షణమే జీఎస్టీఎన్ లో రిజిస్టర్ కావల్సిన అవసరం లేదు.