వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి
యూఎఫ్బీయూ
వరంగల్ కన్వీనర్ సత్యనారాయణ
సుబేదారి : పదో వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) వరంగల్ కన్వీనర్ లంకిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు హన్మకొండలో మంగళవారం భారీ ర్యాలీ తీసి, ధర్నా చేపట్టారు. హన్మకొండ నుంచి పెట్రోల్ పంపు, అంబేద్కర్ విగ్రహం, ఎల్ఐసీ భవన్, కాళోజీ జంక్షన్, అదాలత్, తెలంగాణ అమరవీరుల స్తూపం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వెయ్యికిపైగా ఉద్యోగులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ తీశారు. మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) మొండి వైఖరిని వీడాలని, ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను వీడాలని, బ్యాంక్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా చేశారు.
ధర్నానుద్దేశించి యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) వరంగల్ కన్వీనర్ లంకిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు 12 గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలన్నారు. అనంతరం కలెక్టర్ కిషన్ వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీజీవీబీ రీజినల్ సెక్రటరీ టి.రాజయ్య, జనరల్ సెక్రటరీ కె.బిక్షమయ్య, ఎస్బీఐ వేలేరు రీజినల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, ఎస్బీహెచ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎం.సామ్యుల్, కెనరా బ్యాంక్ యూనియన్ చైర్మన్ ఎం.వెంకటేశ్వర్లు, స్టేట్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, జి.బుచ్చయ్య, జిల్లా సెక్రటరీ కె.వెంగ య్య, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధి సుబ్బా రావు, ఐఓబీ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ డి.వెంకటేశ్వర్లు, ఐఎన్జీ బ్యాంక్ కాజీపేట బ్రాంచి అసిస్టెంట్ సెక్రటరీ బి.కృష్ణమోహన్ పాల్గొన్నారు.