పశువుల పోషణలో ఖనిజ లవణాల పాత్ర కీలకం
కర్నూలు(అగ్రికల్చర్): పశువుల పెరుగుదలలో ఖనిజ లవణాలు కీలకమని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ విజయుడు (8790997493) తెలిపారు. ఇవి జీవ రసాయన చర్యలకు మూలమైన జీవరసాల(హార్మోన్స్) పనితీరును ప్రభావితం చేసి తద్వారా శరీరం లో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయన్నారు. వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పనిచేయడానికి ఇవి అవసరమవుతాయన్నారు. ఖనిజ లవణ మిశ్రమాలు - వాటి ప్రాధాన్యతను ఆయన వివరించారు.
పశువులు ఆరోగ్యం పెరగడానికి, పునరుత్పత్తికి, పాల ఉత్పత్తికి ఖనిజ లవణాలు ఎంతో తోడ్పడతాయి. ప్రధానంగా కాల్షియం, పాస్పరస్, సోడియం, పొటాషియం, కాపర్, కోబాల్ట్, మెగ్నీషియం, క్లోరిన్, ఐరన్ వంటి ఖనిజ లవణాలు అవసరం. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణ ప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియల్లో సమస్యలు ఏర్పడతాయి.
ఖనిజ లవణాల మిశ్రమంతో లాభాలు ఇవి..
దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి. పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది.
పాల దిగుబడి పెరుగుతుంది. చూడి పశువులలో మెయ్య దిగడం, (పొలాప్స్) వంటి సమస్యలు ఉండవు.
పశువులలో ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాలజ్వరం లాంటి సమస్యలను నివారించుకోవచ్చు.
పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి అనవసర ఆహార పదార్థాలు తినడం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోను కావు.
పశువుల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
ఇవ్వాల్సిన మోతాదు...
దూడలకు 5 నుంచి 20 గ్రాములు, పెయ్య దూడలకు 20 నుంచి 30 గ్రాములు, పాడి పశువులకు 50 నుంచి 60 గ్రాములు రోజుకు ఒక పర్యాయం ఇవ్వాలి. ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువులకు అందించాలి. ఇవి పశువైద్య కేంద్రాల్లో లభిస్తాయి.