ఇందర్జీత్ దోషే
‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్
నాలుగేళ్లు నిషేధం పడే అవకాశం
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కథ సుఖాంతమైన మరుసటి రోజే భారత క్రీడారంగానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న షాట్‌పుటర్ ఇందర్జీత్ ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతను రియో ఒలింపిక్స్‌కు దాదాపు దూరమైనట్టే. ప్రస్తుతానికి నాడా అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించి రెండో నోటీసును జారీ చేసింది. అయితే నాడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై మరోసారి తన కేసుపై వాదనలు చేసే అవకాశం ఇందర్జీత్కు ఉంది.
ఇక నూతన వాడా నిబంధనల మేరకు ఈ హరియాణా అథ్లెట్‌పై నాలుగేళ్లు వేటు పడే అవకాశాలున్నాయి. జూన్ 22న తీసుకున్న ‘ఎ’ శాంపిల్ ఫలితాన్ని గత నెల 25న వెల్లడించారు. దీంట్లో ఇందర్జిత్ నిషేధిత ఆండ్రోస్టెరాన్, ఎటియోకొలనొలోన్ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలింది. తాజాగా ‘బి’ శాంపిల్ ఫలితం కూడా పాజిటివ్‌గా రావడంతో... తను రియో ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.