ఖాళీ చేయండి
ఇరిగేషన్ ఉద్యోగులకు ఆదేశాలు
ప్రైవేటు బిల్డింగ్‌లోకి వెళ్లాలని సూచనతీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
మంత్రి ఉమాను కలవనున్న ఉద్యోగ సంఘాల నేతలు
విజయవాడ : స్వరాజ్య మైదానాన్ని కాపాడుకునేందుకు ఒకవైపు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. మరోవైపు ఆ స్థలాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లోనే ఉన్న ఇరిగేషన్ కేసీ, కేఈ, స్పెషల్ తదితర డివిజన్లను తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు మూడు రోజుల్లో ఈ స్థలంలోని కార్యాలయాలను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇరిగేషన్ శాఖలోని వివిధ విభాగాల అధికారులకు జిల్లా ముఖ్య అధికారి ద్వారా సమాచారం వచ్చిందని తెలిసింది.
ప్రైవేటు బిల్డింగ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు
విజేత హాస్పిటల్ భవనం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నందున దానిని లీజుకు తీసుకుంటామని, ఇరిగేషన్ కార్యాలయాలన్నీ అక్కడకు తరలించాలని జిల్లా అధికారయంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనను ఇరిగేషన్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 1932 నాటి నుంచి ఇరిగేషన్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయని, వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఆ రికార్డులను ప్రైవేటు భవనాల్లో ఉంచడం సమంజసం కాదని వారు చెబుతున్నారు. రికార్డులు ఏవైనా పాడైపోతే రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మూడు నెలలు గడువు కోరాలని యోచన
జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి కూతవేటు దూరంలో సుమారు ఒక ఎకరా స్థలం ఖాళీగా ఉంది. ఇటీవల ఇరిగేషన్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను కలిసి అక్కడ తమకు భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి ఐదంతస్తుల భవన నిర్మాణానికి అంచనాలు రూపొం దించి, పంపితే తక్షణం ఆమోదిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న చోటే తమను కొనసాగించాలని ఇరిగేషన్ ఉద్యోగులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే....
కార్యాలయాలను తక్షణం తొలగించవద్దంటూ కింది స్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రమే పట్టుబడుతున్నారు. కృష్ణాడెల్టాకు చెందిన ఒకరిద్దరు కీలక అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం వద్ద నోరు మెదపడం లేదని సమాచారం. దీంతో జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు తమకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. కచ్చితంగా ప్రస్తుతం ఉన్నచోటనే మూడు నెలలు కొనసాగించాలని ఇరిగేషన్ శాఖకు చెందిన ముఖ్య అధికారులు కూడా పట్టుబడితే ఫలితం ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
మంత్రి దేవినేనిని కలిసేందుకు సిద్ధం
తక్షణం కార్యాలయాలను ఖాళీ చేయాలంటూ వచ్చిన తాఖీదులపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సోమవారం కలిసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. తమకు నూతన భవనం నిర్మించే వరకు ఇప్పుడు ఉన్న క్వార్టర్స్ కార్యాలయాల్లోనే కొనసాగించాలని కోరనున్నారు. తమకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించుకునేందుకు తక్షణం అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు.