► ఇప్పటికే కబ్జాకు గురైన భూములపై చర్యలు తీసుకోండి
► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
► అడుసుమిల్లి జయప్రకాశ్ పిటిషన్ విచారణకు స్వీకరణ
హైదరాబాద్: విజయవాడలోని స్వరాజ్య మైదానం స్థలాలు కబ్జాకు గురవుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ మునిసిపల్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. స్వరాజ్ మైదాన్‌కు చెందిన స్థలాలు కబ్జాకు గురికాకుండా చూడాలని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటికే ఏవైనా స్థలాలు కబ్జాకు గురై ఉంటే వాటి విషయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వరాజ్ మైదాన్ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అడుసుమిల్లి జయప్రకాశ్ గతేడాది పిల్ దాఖలు చేశారు. సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, స్వరాజ్ మైదాన్ భూముల్లో భారీ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని, దీనిపై సర్కారు దృష్టి సారించడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు లేవని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసి విచారణ వాయిదా వేసింది.
స్వరాజ్య మైదానాన్ని కాపాడండి
Published Tue, Jul 5 2016 8:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement