ఏదో ఒక రూపంలో ఇంకా పాటిస్తున్నాం!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ప్రగతి పథంలో దూసుకుపోతున్న నవనాగరీకులు దురాచారాలు, మూఢనమ్మకాల విషయంలో నేలచూపులే చూస్తున్నారు. భారతవని దాస్యశృంఖాలు తెంచుకుని ఆరున్నర దశాబద్దాలు గడుస్తున్నా నేటికి కొన్ని దురాచారాలు కొనసాగుతుండడం తలదించుకోవాల్సిన విషయం. అక్కడక్కడా వెలుగు చూస్తున్న అనాగరిక ఆనవాళ్లే ఇందుకు రుజువు. అంటరానితనాన్ని పూర్తిగా పారద్రోలామన్న దాంట్లో వాస్తవం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. ఇప్పటికీ అంటరానితనం పాటించే వారు ఉన్నారన్న నిజం నిశ్చేష్టపరుస్తోంది. ఏదో ఒక రూపంలో అన్ టచ్ బిలిటీ అనుసరిస్తున్నామని ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు తెలపడం అవాక్కయ్యేలా చేస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అఫ్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(ఎన్ సీఏఈఆర్), అమెరికాకు చెందిన మేరీలాండ్ యూనివర్సిటీ జరిపిన భారత మానవ అభివృద్ధి సర్వే(ఐహెచ్డీఎస్-2)లో ఈ నిజాలు వెలుగు చూశాయి.
అన్ని మతాలు, కులాలకు చెందినవారు అంటరానితనాన్ని పాటిస్తున్నారనే నిజం.. దురాచారాల విషయంలో సమాజం పెద్దగా మారలేదన్న విషయాన్ని కళ్లకు కడుతోంది. త్వరలో విడుదల కానున్న సర్వే నివేదికలో ఇంకా ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయోనని బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కులం పేరు అడిగి ఇళ్లు అద్దెకు ఇచ్చే వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. 'కులం కూడు పెట్టదు, మతం మంచి నీళ్లు పోయదు' అన్న ఎవరికీ పట్టడం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిఖరస్థాయిలో ఉన్నామని చెప్పుకుంటున్న వర్తమానంలో దురాచారాల ఆనవాళ్లు అగుపడడం విడ్డూరం. కులాభిమానంలో కొట్టుకుపోతున్న వారిలో పెద్ద చదువు చదవిన వారు సైతం ఉండడం ప్రమాదకర సంకేతం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటరానితనం అమానుషమన్న గతకాలపు ఘోషలు మళ్లీ గుర్తుచేయాల్సి ఉంటుంది. సగటు మనిషిని గౌరవించని విజ్ఞానం వేస్ట్ అని ఛీత్కరించాల్సి వస్తుంది. వివేకం నేర్పని విద్యకు విలువ ఉండదని నినదించాల్సి రావొచ్చు. మానవత్వమే మతమని, సహనమే ఆభరణమని పాఠం వినిపించాల్సి ఉంటుంది. స్వయం విచక్షణతోనే అంతరానితనాన్ని తరిమికొడితే అంతకంటే మంచిపని మరోటి ఉండదు. మనుషులందరినీ సమదృష్టితో ఆదరిస్తే అన్ టచ్ బిలిటీ పూర్తిగా అంతర్థానమవుతుంది. మహాత్ముని కల సాకారమవుతుంది.
-పి. నాగశ్రీనివాసరావు