సాయంతో మనసు గెలిచే యత్నం!
జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరొకటి. శ్రీలంక ప్రస్తుత సంక్షోభం, ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో రూపొందించిన ‘సాగర్’, ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. ఇది పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా, వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది.
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇటీవలే భారత్‌కు వచ్చిపోయారు. బోలెడన్ని ఒప్పందాలు కుదిరాయి. చాలావరకూ ఆర్థిక వ్యవహారాలే. రణిల్ మనకు మిత్రుడే అన్నది చాలాకాలంగా ఉన్న గట్టి అభిప్రాయం. గత ఏడాది జూలైలో అధ్య క్షుడు గొటబయ రాజకపక్స దేశం నుంచి పారిపోవడం, ప్రజాగ్రహం నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి రావడం మనకు తెలిసిన విషయమే. అలాంటి అనూహ్యమైన, మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో రణిల్ గద్దెనెక్కారు. దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టు మిట్టాడుతోంది ఆ దేశం అప్పుడు. సాధారణంగా పదవి చేపట్టిన కొద్ది కాలానికి శ్రీలంక నేతలు భారత్ పర్యటనకు రావడం కద్దు. కానీ ఈసారి రణిల్ ముందు దేశంలో పరిస్థితులు కొంతైనా చక్కబెట్టుకున్న తరువాతే, విదేశీ పర్యటనల గురించి ఆలోచించాల్సిన వచ్చింది. అటు ఆర్థిక, ఇటు రాజకీయాలూ సర్దుకున్న తరువాత ఆహ్వానం పంపు దామని భారత్ కూడా వేచి చూసింది.
75 ఏళ్ల దౌత్య బంధం
జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరో విషయం. దేశవాళీ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన సాయం అందిస్తున్నందుకూ విక్రమసింఘే కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటారు. ఈ సాయం భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు భారత్‌తో సమావేశాలు ఉపయో గపడి ఉంటాయి. ఎందుకంటే భారత్‌తో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల సాయంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో కొంత స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. సబ్సిడీల తగ్గింపు, పన్నుల పెంపు వంటి సంస్కరణలకు ఐఎంఎఫ్ షరతులు విధించిన విషయమూ చెప్పుకోవాలిక్కడ. ఈ సంస్కరణల భారం మోయడం సామాన్యుడికి కష్టమైతే, ఆ అసంతృప్తిని వాడుకుని తిరగబడేందుకు శ్రీలంకలోని కొన్ని నియోజకవర్గ నేతలు కాచుకుకూర్చున్నారు.
శ్రీలంకకే చెందిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సీపీ చంద్రశేఖర్, అహిల్ కదిర్గమర్ వంటి వారు ఐఎంఎఫ్ పథకం సమస్య పరిష్కా రానికి అస్సలు ఉపయోగపడదనీ, పరిస్థితిని మరింత దిగజారుస్తుందనీ అభిప్రాయపడుతున్నారు. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం శ్రీలంక 2031 వరకూ సంస్కరణలు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ఇంకో ఎనిమిదేళ్లు. చాలా సమయం. విక్రమసింఘేకు ఈ విషయమే కాకుండా, భవిష్యత్తులో ఎదురుకాగల సవాళ్ల గురించి కూడా తెలుసు. విదేశీ అప్పులు ప్రస్తుతం 40 బిలియ¯Œ డాలర్ల వరకూ ఉంటే, అందులో 30 శాతం అయినా తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాగే తొమ్మిదేళ్లపాటు రుణాల చెల్లింపులను నిలిపివేయడం అప్పులిచ్చే వారి ఆగ్రహానికి కారణమవుతోంది.
పొరుగుకు ప్రాధాన్యత
శ్రీలంక ప్రస్తుత సంక్షోభం ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవహా రాల్లో భారత్ జోక్యం పెరగాలని లంక ఆశిస్తోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో భారత్ రూపొందించిన ‘సాగర్’(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్), ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. వీటి ప్రకారం, పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా... వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు, ఆర్థిక సమృద్ధికి ఉపయోగపడే కొన్ని చర్యలకు ప్రధాని మోదీ, విక్రమసింఘే తమ దార్శనిక పత్రం ద్వారా శ్రీకారం చుట్టారు.
దీని ప్రకారం ఇరుదేశాల మధ్య అటు సముద్ర మార్గం ఇటు విమాన, భూతల మార్గాల ద్వారా కూడా కనెక్టివిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే తెగల పోరు నేపథ్యంలో 1980లో నిలిపివేసిన పడవల సేవలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ ద్వారా శ్రీలంకలో రూపాయి ద్వారా చెల్లింపులు జరపాలన్నది వీటిల్లో ఒకటి. ఇంధన రంగంతోపాటు ట్రింకోమలై ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అదాని వంటి భారతీయ వ్యాపారవేత్తలకు సరికొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత పర్యటనలో విక్రమసింఘేను గౌతమ్ అదాని కూడా కలిసిన విషయం గమనార్హం.
శ్రీలంక తమిళుల సమస్య సున్నితత్వాన్ని గుర్తించిన విక్రమసింఘే ఆ విషయంలో తాను తీసుకోబోయే చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. 13వ రాజ్యాంగ సవరణ ప్రకారం, దక్షిణాఫ్రికా తరహాలో తమిళుల కోసం ఓ నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇందులో ఉంది. ప్రాంతాల వారీగా అధికార పంపిణీ జరగాలని 13వ సవరణ చెబుతోంది. అయితే దీని అమల్లో ఉన్న సాధకబాధకాల గురించి కూడా శ్రీలంక అధ్యక్షుడు భారత ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు అనుమతి లేకుండా పోలీసు తదితర సున్నితమైన వ్యవస్థల అధికారాలను పంపిణీ చేయడం కష్టమని వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ విక్రమసింఘే వర్గానికి ప్రతినిధి ఈయనొక్కరే.
పార్లమెంటులో మద్దతు లభిస్తున్నది కూడా రాజపక్సే పార్టీ నుంచి మాత్రమే. రాజపక్సే పార్టీకి అధికార పంపిణీ సుతరామూ ఇష్టం లేకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకునే ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ అమలును మరోసారి గుర్తు చేశారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కౌన్సిల్ ఎన్నికలు తొందరగా జరిపించడం గురించి ప్రస్తావించారు. తమ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదనీ, విక్రమసింఘే అధికార పంపిణీ ప్రణాళిక తమకు సమ్మతం కాదనీ తమిళ వర్గాలు ఇప్పటికే మోదీకి వేరుగా లేఖలు రాశాయి. తమిళ సామాజిక వర్గపు ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేలా లంకను ఒప్పించాలని వీరు కోరుతున్నారు.
కలిసి పనిచేయాలి
విక్రమసింఘే పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై చర్చలు జరక్కపోయినా, చైనా అంశం కచ్చితంగా ఇద్దరు నేతల మనసుల్లో ఉండి ఉంటుంది. విక్రమసింఘే కొన్ని రోజుల క్రితమే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా శ్రీలంకలో చైనా భద్రతా వ్యవహారాలు లేవని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా, భారత్‌కు ముప్పు కాగలఎలాంటి విషయానికైనా శ్రీలంక వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. ఇది చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఫలితం లభించినట్లే భావించాలి. భారత ప్రధాని మాట్లా డుతూ, ‘భారత్ భద్రత, శ్రీలంక అభివృద్ధి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇరు దేశాలు భద్రత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని కలిసి పని చేయాలి’ అన్నారు. అభివృద్ధి పనులతో భద్రతను పొందాలనుకోవడం భారత్ ఎంత సమర్థంగా, సకాలంలో తన ఆర్థిక హామీలు నెరవేర్చగలదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.
ఎస్.డి.ముని, వ్యాసకర్త మాజీ దౌత్యవేత్త, శ్రీలంక రత్న అవార్డు గ్రహీత- (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)