పాక్ ఆర్మీ పోస్టుల ధ్వంసం
ఎల్ఓసీలో భారత సైన్యం దాడులు
► సంబంధిత వీడియో విడుదల
► సైన్యం ఆపరేషన్‌ను సమర్థించిన భారత్
► అంతా అబద్ధం: పాకిస్తాన్
న్యూఢిల్లీ: సరిహద్దుల వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్‌కు భారత్ దీటైన బదులిచ్చింది. ఇద్దరు భారత సైనికుల తలలు నరికిన ఆ దేశ సైన్యాన్ని గట్టి దెబ్బ కొట్టింది. భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు సహకరిస్తున్న పలు పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది. ఉగ్ర వ్యతిరేక చర్యల్లో భాగంగా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట చేపట్టిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం కలిగిందని భారత సైన్యం ప్రకటించింది.
నౌషేరా సెక్టార్లో ఈ దాడులను ఇటీవలే నిర్వహించినట్లు ప్రజా సమాచార విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకే నారులా మంగళవారం మీడియాకు వెల్లడిం చారు. తమ శిబిరాలను ధ్వంసం చేశారన్న భారత సైన్యం ప్రకటనను పాక్ కొట్టిపా రేసింది. సైన్యం చర్యను భారత ప్రభుత్వం సమర్థించింది. జమ్మూ–కశ్మీర్లో శాంతి స్థాపన కోసమే దాడులు చేసినట్లు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, చొరబాట్లకు మద్దతిస్తున్న పాక్ శిబిరాలను నిర్వీర్యం చేయడానికి సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోందని అన్నారు.
జరిగింది మే 9న!
దాడులకు సంబంధించిన వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. అయితే అందులో దాడులు జరిగిన ప్రాంతం, సమయం స్పష్టంగా కనిపించలేదు. అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేయగా , పేలుళ్ల తరువాత మంటలు, పొగ వెలువడంతో పాటు, కొన్ని నిర్మాణాలు మూకుమ్మడిగా కుప్పకూలుతున్నట్లు ఆ 22 సెకన్ల వీడియోలో కనిపించింది.
ఈ ఆపరేషన్‌కు సంబంధించి భారత సైన్యం పూర్తి వివరాలు వెల్లడించకున్నా, ఇద్దరు భారత సైనికుల తలలు నరికిన తొమ్మిది రోజుల తరువాత అంటే, మే 9న ఈ దాడి జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడుల ద్వారా... సీమాంతర చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలకు వెనకాడబోమనే సందేశాన్ని భారత్ , పాక్‌కు ఇస్తోందని తెలిపాయి. రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, ఆటోమేటిక్ గ్రెనేడ్లు తదితర అత్యాధునిక ఆయుధాలను ఈ అపరేషన్‌లో వినియోగించినట్లు చెప్పాయి.
కొట్టిపారేసిన పాక్: పాక్ శిబిరాలను ధ్వంసం చేశామన్న భారత ప్రకటన అవాస్తవమంటూ పాక్ కొట్టిపారేసింది. పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందన్న వార్తలు కూడా పూర్తిగా అబద్ధమని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. తాజా దాడుల్లో తమకు జరిగిన నష్టం గురించి పాక్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కమాండర్ల సమావేశం: బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్ల మధ్య మంగళవారం అంతర్జాతీయ సరిహద్దులో కమాండర్ల స్థాయి సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో శాంతి, భద్రతలను పరిరక్షిస్తామని ఇరు వర్గాలు ప్రతినబూనాయి. సరిహద్దుల్లో పరిస్థితులు, ఆమియా సెక్టార్లో ఇటీవల చోటుచేసుకున్న కాల్పులపై చర్చలు జరిపారు.
ఉగ్రవాదుల సంఖ్య తగ్గుతుంది
‘ఉగ్రవ్యతిరేక చర్యల్లో భాగంగానే ఎల్వోసీ వెంట ప్రతీకార దాడులు జరిపాం. చొరబాట్లకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్నే లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. పాక్ సైన్యం సాయుధ చొరబాటుదారులకు సాయం చేస్తోంది. కొన్నిసార్లయితే ఎల్ఓసీ సమీ పంలోని గ్రామాల్లో దాడులకు వారు వెనుకాడటం లేదు. భారత సైన్యం తాజాగా చేపట్టిన ఆపరేషన్ ఫలితంగా కశ్మీర్లో ఉగ్రవా దుల సంఖ్య తగ్గుతుంది.
కశ్మీర్ యువత చెడు మార్గం పట్టే పరిస్థితి తొలగిపో తుంది’ అని ఆర్మీ అధికారి నారులా అన్నారు. మంచు కరగడం ప్రారంభం కావడంతో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు పెరుగుతాయని, ఎల్ఓసీ వెం ట భారత సైన్యం ఆధిపత్యం కొనసాగి స్తోందని పేర్కొన్నారు. జమ్మూ–కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే ఎల్ఓసీ వెంట చొరబాట్లకు అడ్డుకట్ట పడాలి అని తెలిపారు.