indian hackers
-
పాక్ ప్రభుత్వ సైట్లపై భారత హ్యాకర్ల సైబర్ స్ట్రైక్స్
భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడితే.. తాము సైబర్ స్ట్రైక్స్‌తో విధ్వంసం సృష్టిస్తామంటున్నారు భారత హ్యాకర్లు. పాకిస్థానీ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థంగా ప్రవేశించిన హ్యాకర్లు వాళ్ల కంప్యూటర్లు, డేటా మొత్తాన్ని లాక్ చేసేస్తున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక పాక్ సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. చివరకు తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని భారత హ్యాకర్లకు వాళ్లు ఆఫర్లు ఇచ్చినా.. దేశభక్తి మెండుగా ఉన్న ఈ హ్యాకర్లు ససేమిరా అంటూ వాళ్ల ఆఫర్లను తిరస్కరించారు. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇటీవల పాకిస్థానీ హ్యాకర్లు కొందరు భారతీయ సైట్లలో కొన్నింటిని హ్యాక్ చేసి, వాటిలో తమ దేశభక్తి గీతాలను పోస్ట్ చేయడంతో భారతీయ హ్యాకర్లకు ఒళ్లు మండింది. పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు.. పాక్ ప్రభుత్వ సైట్లేవీ అసలు పనిచేయకుండా చేసేశారు. వాళ్ల నెట్వర్క్ మొత్తాన్ని ఆపేసేందుకు రాన్సమ్వేర్ను చొప్పించారు. 'తెలంగాణ సైబర్ వారియర్' అనే పేరుతో ఉన్న ఒక హ్యాకర్ కూడా ఇలా పాకిస్థానీ ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసినవారిలో ఉన్నట్లు తెలిసింది. అసలు పాకిస్థాన్ సైబర్ స్పేస్ మొత్తాన్నే సర్వనాశనం చేసే శక్తి కూడా భారతీయ హ్యాకర్లకు ఉందని కొందరు అంటున్నారు. -
ఫేస్బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?
న్యూయార్క్: ఫేస్బుక్లో బగ్స్‌ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాదు తాము ఇప్పటి వరకు నగదు రూపంలో చెల్లించిన మొత్తాల్లో ఇండియన్స్ కే అధిక వాటా ఉందని కూడా తెలిపింది. 'బగ్స్‌ను ఏరివేసే కార్యక్రమంలో మొత్తం 127 దేశాలకు చెందిన టెక్నాలజీ రీసెర్చర్స్, హ్యాకర్స్ పాల్గొంటుండగా అందులో భారత్ మాత్రమే టాప్ స్థానంలో ఉంది. అంతేకాకుండా పెద్దమొత్తాల్లో చెల్లింపులు పొందుతున్న దేశాల్లో కూడా భారత్ దే అగ్రస్థానం' అని ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్‌లోని ఫేస్ బుక్ బగ్ హంటర్స్‌కు ఇప్పటి వరకు రూ.4.84 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. ఈ కార్యక్రమం తాము 2011లో ప్రారంభించినట్లు వెల్లడించింది. -
ధోనీని అవమానిస్తారా.. మీ సైట్లు హ్యాక్!
భారతీయులకు కోపం వచ్చింది. టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ తలను బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ తీసుకెళ్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటో ఒకదాన్ని ప్రచారం చేయడంతో పలు బంగ్లాదేశీ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. మూడు ప్రభుత్వ సైట్లు సహా సుమారు 20 వరకు సైట్లను భారతీయులు హ్యాక్ చేసి, ఆ విషయాన్ని ఆ సైట్ల హోం పేజిలో తెలిపారు. కేరళ సైబర్ వారియర్స్‌కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ''బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే. మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు'' అన్న సందేశంతో పాటు ప్రతి సైట్లోనూ ధోనీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' అని ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. తామంతా భారతీయులైనందుకు గర్వపడుతున్నామని, దేశాన్ని అవమానించే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఈ బృందానికి చెందిన ఓవ్యక్తి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ధోనీ మార్ఫింగ్ ఫొటోతో అతడిని అవమానించారని, దానికి ధోనీ మైదానంలో సమాధానం చెబితే తాము సైబర్ స్పేస్‌లో సమాధానం చెబుతున్నామని అన్నారు. మరిన్ని వెబ్సైట్లను హ్యాక్ చేయడం ఖాయమని, మరేదైనా సైట్లో ధోనీ మార్ఫింగ్ ఫొటో కనిపిస్తే అది హ్యాక్ అయి తీరుతుందని హెచ్చరించారు. వెబ్సైట్లను హ్యాక్ చేయడం అక్రమమేనని తమకు తెలుసని చెప్పారు. ఇంతకుముందు అమాయకులైన అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటితో సెక్స్ చాట్లు చేస్తున్న పలు ఫేస్బుక్ పేజీలను, ప్రొఫైళ్లను కూడా తాము హ్యాక్ చేశామని అంటున్నారు. ప్రతియేటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సహా 26/11 రోజున కూడా పలు పాకిస్థానీ వెబ్సైట్ల మీద కూడా కేరళ సైబర్ వారియర్స్ దాడి చేస్తారు.