Indian School of Mines
-
మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్ఎం
ప్రత్యేకంగా మైన్స్ (ఖనిజాలు, గనులు) రంగంలో నిష్ణాతులైన నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) - ధన్‌బాద్. జార్ఖండ్‌లో కొలువైన ఈ ఇన్స్టిట్యూట్ దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న తిరుపతి కార్తీక్ రాజ్ తన క్యాంపస్ కబుర్లను వివరిస్తున్నాడిలా.. అంతా తెలుగుమయం 400 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని 450 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తర్వాత బెంగాల్, బీహార్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఇండస్ట్రీ విజిట్స్ సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి తరగతులు ఉంటాయి. వారానికి 30 గంటలు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టుపరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి ఇతర విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి కూడా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. నేను ఫస్టియర్‌లో మేనేజ్మెంట్ ఇంటర్న్‌షిప్ కోసం ఇండోనేషియా వెళ్లాను. అక్కడ 45 రోజులపాటు వివిధ కంపెనీలకు వె ళ్లి బిజినెస్‌కు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకున్నాను. ఆసియాలోనే పెద్ద లైబ్రరీ ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల వారీగా హాస్టల్స్ ఉంటాయి. ర్యాగింగ్‌ను నిరోధించాలనే ఉద్దేశంతో ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేకంగా హాస్టల్స్ కేటాయించారు. ఇండోర్ గేమ్స్ (బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్) ఆడుకోవడానికి హాస్టల్లో సదుపాయాలున్నాయి. పూర్తిగా ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఇక్కడ ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఐఐటీ స్థాయి గుర్తింపు దక్కలే దు. వచ్చే ఏడాది మార్చిలో ఐఎస్‌ఎంకు ఐఐటీల స్థాయి గుర్తిం పు లభించే అవకాశం ఉంది. ప్రతిభావంతులకు మెరిట్ కమ్ మీ న్స్ స్కాలర్షిప్స్ ఉంటాయి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.4.5 లక్షలకు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెడిషనల్ సబ్జెక్టులు కూడా సెమిస్టర్‌కు ఐదు సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఇంగ్లిష్, మేనేజ్మెంట్ ఎకనామిక్స్ వంటివాటిని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ సెమిస్టర్‌కు 30 శాతం వెయిటేజ్, ఎండ్ సెమిస్టర్‌కు 60 శాతం వెయిటేజ్ ఉంటాయి. మరో 10 శాతం ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మైనింగ్ సంబంధిత కోర్సుల కోసం ప్రత్యేకంగా ఏర్పడింది ఈ ఇన్స్టిట్యూట్. మైనింగ్, పెట్రోలియం, మినరల్ ఇంజనీరింగ్ కంటే సీఎస్ఈ విద్యార్థులే అత్యధిక పే ప్యాకేజీలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థులను కోల్ ఇండియా వంటి కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే నియమించుకుంటున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కు సంబంధించిన కంపెనీలు కూడా పెద్దగా రావడం లేదు. పూర్వ విద్యార్థుల సమ్మేళనమే బసంత్ ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ ఉంటాయి. ఒక్కోటి మూడు రోజులపాటు జరుగుతుంది. బసంత్ పేరుతో పూర్వ విద్యార్థుల ఫెస్ట్ కూడా ఏటా ఉంటుంది. దీనికి పూర్వ విద్యార్థులంతా హాజరవుతారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కెరీర్ గెడైన్స్, స్టార్టప్స్‌కు సంబంధించి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, క్రికెట్ క్లబ్ ఇలా ఎన్నో క్లబ్‌లు ఉంటాయి. వీటి ల్లో చేరడం ద్వారా సంబంధిత అంశాలపై పట్టు సాధించవచ్చు. ఈ-సెల్ అందించే సేవలెన్నో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. దీని ఆధ్వర్యంలో బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. ఇంకా స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా. -
మే 24న జేఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్
జూన్ 8న కీ, 13న మార్కులు జూన్ 18న ర్యాంకుల ప్రకటన హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీ), ధన్‌బాద్‌లోని ఇండియ న్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం), ఇతర ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ (అడ్వాన్స్డ్)-2015 పరీక్ష షెడ్యూలును ముంబై ఐఐటీ శని వారం ప్రకటించింది. వచ్చే ఏడాది మే 24న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఇదీ అర్హత విధానం.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు వచ్చేఏడాది ఏప్రిల్‌లోనే నిర్వహించే జేఈఈ మెయిన్ -2015 పేపరు-1 పరీక్ష రాసిన వారినే జే ఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్‌కు అనుమతిస్తారు. అదీ జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు సాధించిన టాప్ 1.50 లక్షల మంది విద్యార్థుల్లో ఉండాల్సిందే. ఇక ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు సంబంధిత 12వ తరగతి/ ఇంటర్మీడియట్ బోర్డులలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. దీని నిర్ధారణకు ఇంటర్ రెండేళ్ల మార్కులను పరిగణనలోకి తీ సుకుంటారు. 75 శాతం(జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెం డింటిలో ఏ ఒక్కదానిలో ఏ నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఒకవేళ సంబంధిత బోర్డు టాప్-20 పర్సంటైల్‌ను ప్రకటించకపోతే దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను అభ్యర్థి అందజేయాలి. ఒకవేళ బోర్డు మార్కులు ఇవ్వకుండా గ్రేడ్లు ఇస్తే.. ఆ గ్రేడ్లు ఎన్ని మార్కులకు సమానం అనే అంశాన్ని పేర్కొంటూ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలి. దా నిపై ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఐఐటీ ముంబయి ఆధ్వర్యంలో.. జేఈఈ అడ్వాన్స్డ్-2014 పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించగా, జేఈఈ అడ్వాన్స్డ్-2015 ఐఐటీ ముంబయి నిర్వహిస్తోంది. ఏడు ఐఐటీ భాగస్వామ్యంతో ముంబయి ఐఐటీ నేతృత్వంలో పరీక్ష నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ)-15 నిర్ణయించింది. జేఈఈ అడ్వాన్స్డ్ కో సం మే 2వ తేదీ నుంచి 7 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇందుకవసరమైన ఏర్పాట్లు చేస్తూ, షెడ్యూలును జారీ చేసింది. ఇవీ పరీక్ష కేంద్రాలు... తెలంగాణ, ఏపీల్లో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోని విశాఖపట్నం, ఐఐటీ మద్రాసు పరిధిలోని నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇవీ ప్రవేశాలు చేపట్టే కోర్సులు.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీటెక్, ఎంటెక్ ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డ్యుయల్ డిగ్రీ, బీటెక్ అండ్ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డ్యుయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఇంటిగ్రెటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ (టెక్నాలజీ). ఇదీ జేఈఈ అడ్వాన్స్డ్-2015 షెడ్యూల్.. ►2015 మే 2 నుంచి 7 వరకు: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ హా మే 9 నుంచి 12 వరకు: హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ హా 9వ తేదీ నుంచి 14 వరకు: హాల్ టికెట్ల పొరపాట్లు ఉంటే సవరించుకునే అవకాశం హా మే 24న : రాత పరీక్ష (ఉదయం 9 నుంచి 12 గం. వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గం. వరకు పేపరు-2 పరీక్ష.) హా జూన్ 3 నుంచి 5 వరకు: ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన. హా 3 నుంచి 6వ తేదీ వరకు: జవాబు పత్రాలపై అభ్యంతరాలు స్వీకరణ. హా 8వ తేదీన: ఆన్లైన్లో జవాబుల కీ. హా 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు: జవాబు కీలపై అభ్యంతరాలు స్వీకరణ. హా 13వ తేదీన: మార్కులు విడుదల హా 18వ తేదీన: ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటన బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ షెడ్యూలు.. ► జూన్ 18 నుంచి 19 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్జిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. హా 21వ తేదీన: ఏఏటీ రాత పరీక్ష (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు). హా 25వ తేదీన: ఏఏటీ ఫలితాలు విడుదల. ► జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు: ఆన్లైన్లో ఆప్షన్లకు (ఛాయిస్) అవకాశం. ► జులై 2న: మొదటి దశ సీట్లు కేటాయింపు. హా 2 నుంచి 8వ తేదీ వరకు ప్రవేశాలకు ఆమోదం, కాలేజీల్లో చేరికలు.హా 10వ తేదీన రెండో దశ సీట్లు కేటాయింపు. ► 11 నుంచి 15వ తేదీ వరకు ప్రవేశాల ఆమోదం, కాలేజీల్లో చేరి కలు. హా జులై 16 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం. -
ఇష్టపడి చదివి.. విజయం సాధించా!
దేశంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) యునివర్సిటీ-ధన్‌బాద్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు రంగారెడ్డిజిల్లాకు చెందిన ఏడ్ల అభిలాష్ రెడ్డి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉన్నత విద్య లక్ష్యమే ఈ విజయానికి కారణమంటున్నారు అభిలాష్ రెడ్డి. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను అభిలాష్ సాక్షి ‘భవిత’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. అమ్మానాన్న సమక్షంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అంతేకాకుండా ఎస్బీఐ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వరించింది. చివరి సంవత్సరం చదువుతుండగానే నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికకావడం ద్వారా న్యూఢిల్లీలోని మారుతి సుజుకి కంపెనీలో మెకానికల్ డిజైనర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. నేపథ్యం: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడ నా స్వస్థలం. నాన్న రాంరెడ్డి, అమ్మ లక్ష్మి. నిరుపేద వ్యవసాయ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా చదువుకు ఆటంకం కలగకూడదని అమ్మ, నాన్న కష్టపడ్డారు. వారి ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. నాన్న ఓ తండ్రిలా కాకుండా స్నేహితునిలా తన వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాన్న ఆశయాన్ని నెరవేర్చాను. ఈ విజయం వారికే అంకితమిస్తున్నాను. మొదటి నుంచి టాపర్నే: చిన్నప్పటి నుంచి చదువులో ముందే. పాఠశాల స్థాయి నుంచి ఇప్పటి వరకు అన్ని తరగతుల్లో నేనే టాపర్‌ని. 10వ తరగతిలో 96 శాతం మార్కులు వచ్చాయి. అంతేకాకుండా రాష్ర్ట స్థాయిలో 10వ ర్యాంకు దక్కింది. ఇంటర్మీడియెట్‌లో 96.8 శాతం, బీటెక్‌లో 92.3 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్, ఏఐఈఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చినా.. ఐఐటీ-జేఈఈ కి ప్రాధాన్యమిచ్చి ఐఎస్‌ఎంలో చేరాను. మొదటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉన్న మక్కువతో ఆ బ్రాంచ్ ఎంచుకున్నా. ఆ ప్రోత్సాహంతోనే: కోర్సులో చేరిన మొదట్లో కొత్త ప్రదేశం, ఇతర రాష్ట్రం కావడంతో ఇంజనీరింగ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ సమయంలో నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు నన్ను ముందుకు నడిపించాయి. కోర్సు విషయానికొస్తే.. మెకానికల్ ఇంజనీరింగ్‌లోని అన్ని సబ్జెక్ట్‌లు ముఖ్యమైనవే అని చెప్పాలి. మెకానికల్ డిజైన్, ధర్మోడైనమిక్స్, ఈ-ట్రాన్స్ఫర్, ఏయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ ఇలా అన్ని అంశాలు ఎంతో కీలకమైనవి. అయితే ఇష్టపడి చదవడంతో పెద్దగా కష్టమనిపించలేదు. ప్రణాళికతో ప్రిపరేషన్: వారానికి ఐదు రోజులు తరగతులు ఉండేవి. మిగిలిన రెండు రోజులను మాత్రం ఆ వారంలో చెప్పిన సబ్జెక్టులను క్షుణ్నంగా చదివేందుకు కేటాయించే వాణ్ని. సాధ్యమైనంత వరకు ఏ రోజు సబ్జెక్టును ఆ రోజే పూర్తి చేసే వాణ్ని. దాంతో నాలుగేళ్ల కోర్సులో ప్రతి సెమిస్టర్లో టాపర్‌గా నిలిచే అవకాశం లభించింది. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా కాలేజీలో ఏ ఈవెంట్‌ను నిర్వహించినా ముందుండి అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేవాణ్ని. తద్వారా కెరీర్ ఎదుగుదలకు కీలకమైన నైపుణ్యాలు అలవడ్డాయి. ఇది కూడా నా విజయానికి ఒక రకంగా దోహదం చేసింది. ఉన్నత విద్య లక్ష్యం: బీటెక్‌తోనే నా చదువును ముగించాలని అనుకోవటంలేదు. భవిష్యత్‌లో ఉన్నత కోర్సులను చదవాలనే లక్ష్యంతో ఉన్నా. దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అంతేకాకుండా అనుభవం కోసం ప్రస్తుతానికి మారుతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. -ఎస్. రాకేశ్, న్యూస్‌లైన్, చేవెళ్లగ్రామీణం. అకడెమిక్ ప్రొఫైల్ పదో తరగతి: 576 మార్కులతో ఉత్తీర్ణత (2007) ఇంటర్మీడియెట్: 96 శాతం మార్కులతో ఉత్తీర్ణత బీటెక్ : 92.3 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఐఎస్ఎం-ధన్‌బాద్)