ఇష్టపడి చదివి.. విజయం సాధించా! | Engineering Institute Indian School of Mines | Sakshi
Sakshi News home page

ఇష్టపడి చదివి.. విజయం సాధించా!

Published Thu, Jun 5 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

ఇష్టపడి చదివి.. విజయం సాధించా!

ఇష్టపడి చదివి.. విజయం సాధించా!

దేశంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం) యునివర్సిటీ-ధన్‌బాద్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు రంగారెడ్డిజిల్లాకు చెందిన ఏడ్ల అభిలాష్ రెడ్డి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉన్నత విద్య లక్ష్యమే ఈ విజయానికి కారణమంటున్నారు అభిలాష్ రెడ్డి. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను అభిలాష్ సాక్షి ‘భవిత’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
 
 అమ్మానాన్న సమక్షంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అంతేకాకుండా ఎస్‌బీఐ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వరించింది. చివరి సంవత్సరం చదువుతుండగానే నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికకావడం ద్వారా న్యూఢిల్లీలోని మారుతి సుజుకి కంపెనీలో మెకానికల్ డిజైనర్‌గా విధులు నిర్వహిస్తున్నాను.
 
 నేపథ్యం:
 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడ నా స్వస్థలం. నాన్న రాంరెడ్డి, అమ్మ లక్ష్మి. నిరుపేద వ్యవసాయ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా చదువుకు ఆటంకం కలగకూడదని అమ్మ, నాన్న కష్టపడ్డారు. వారి ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. నాన్న ఓ తండ్రిలా కాకుండా స్నేహితునిలా తన వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాన్న ఆశయాన్ని నెరవేర్చాను. ఈ విజయం వారికే అంకితమిస్తున్నాను.
 
 మొదటి నుంచి టాపర్‌నే:
 చిన్నప్పటి నుంచి చదువులో ముందే. పాఠశాల స్థాయి నుంచి ఇప్పటి వరకు అన్ని తరగతుల్లో నేనే టాపర్‌ని. 10వ తరగతిలో 96 శాతం మార్కులు వచ్చాయి. అంతేకాకుండా రాష్ర్ట స్థాయిలో 10వ ర్యాంకు దక్కింది. ఇంటర్మీడియెట్‌లో 96.8 శాతం, బీటెక్‌లో 92.3 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్, ఏఐఈఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చినా.. ఐఐటీ-జేఈఈ కి ప్రాధాన్యమిచ్చి ఐఎస్‌ఎంలో చేరాను. మొదటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉన్న మక్కువతో ఆ బ్రాంచ్ ఎంచుకున్నా.
 
 ఆ ప్రోత్సాహంతోనే:
 కోర్సులో చేరిన మొదట్లో కొత్త ప్రదేశం, ఇతర రాష్ట్రం కావడంతో ఇంజనీరింగ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ సమయంలో నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు నన్ను ముందుకు నడిపించాయి. కోర్సు విషయానికొస్తే.. మెకానికల్ ఇంజనీరింగ్‌లోని అన్ని సబ్జెక్ట్‌లు ముఖ్యమైనవే అని చెప్పాలి. మెకానికల్ డిజైన్, ధర్మోడైనమిక్స్, ఈ-ట్రాన్స్‌ఫర్, ఏయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ ఇలా అన్ని అంశాలు ఎంతో కీలకమైనవి. అయితే ఇష్టపడి చదవడంతో పెద్దగా కష్టమనిపించలేదు.
 
 ప్రణాళికతో ప్రిపరేషన్:
 వారానికి ఐదు రోజులు తరగతులు ఉండేవి. మిగిలిన రెండు రోజులను మాత్రం ఆ వారంలో చెప్పిన సబ్జెక్టులను క్షుణ్నంగా చదివేందుకు కేటాయించే వాణ్ని. సాధ్యమైనంత వరకు ఏ రోజు సబ్జెక్టును ఆ రోజే పూర్తి చేసే వాణ్ని. దాంతో నాలుగేళ్ల కోర్సులో ప్రతి సెమిస్టర్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం లభించింది. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా కాలేజీలో ఏ ఈవెంట్‌ను నిర్వహించినా ముందుండి అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేవాణ్ని. తద్వారా కెరీర్ ఎదుగుదలకు కీలకమైన నైపుణ్యాలు అలవడ్డాయి. ఇది కూడా నా విజయానికి ఒక రకంగా దోహదం చేసింది.
 
 ఉన్నత విద్య లక్ష్యం:
 బీటెక్‌తోనే నా చదువును ముగించాలని అనుకోవటంలేదు. భవిష్యత్‌లో ఉన్నత కోర్సులను చదవాలనే లక్ష్యంతో ఉన్నా. దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అంతేకాకుండా అనుభవం కోసం ప్రస్తుతానికి మారుతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా.
 -ఎస్. రాకేశ్,
 న్యూస్‌లైన్, చేవెళ్లగ్రామీణం.
 
 అకడెమిక్ ప్రొఫైల్
 పదో తరగతి:    576 మార్కులతో ఉత్తీర్ణత
 (2007)
 ఇంటర్మీడియెట్:    96 శాతం మార్కులతో
 ఉత్తీర్ణత
 బీటెక్ :    92.3 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఐఎస్‌ఎం-ధన్‌బాద్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement