మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్‌ఎం | Special courses in mining .. ISM | Sakshi
Sakshi News home page

మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్‌ఎం

Published Sun, Nov 30 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్‌ఎం

మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్‌ఎం

ప్రత్యేకంగా మైన్స్ (ఖనిజాలు, గనులు) రంగంలో నిష్ణాతులైన నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం) - ధన్‌బాద్. జార్ఖండ్‌లో కొలువైన ఈ ఇన్‌స్టిట్యూట్ దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్  అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో సెకండియర్  చదువుతున్న తిరుపతి కార్తీక్ రాజ్ తన క్యాంపస్   కబుర్లను వివరిస్తున్నాడిలా..

అంతా తెలుగుమయం

400 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని 450 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తర్వాత బెంగాల్, బీహార్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు.
 
ఇండస్ట్రీ విజిట్స్

 సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి తరగతులు ఉంటాయి. వారానికి 30 గంటలు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టుపరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి ఇతర విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి కూడా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. నేను ఫస్టియర్‌లో మేనేజ్‌మెంట్ ఇంటర్న్‌షిప్ కోసం ఇండోనేషియా వెళ్లాను. అక్కడ 45 రోజులపాటు వివిధ కంపెనీలకు వె ళ్లి బిజినెస్‌కు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకున్నాను.
 
ఆసియాలోనే పెద్ద లైబ్రరీ

ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌ల వారీగా హాస్టల్స్ ఉంటాయి. ర్యాగింగ్‌ను నిరోధించాలనే ఉద్దేశంతో ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేకంగా హాస్టల్స్ కేటాయించారు. ఇండోర్ గేమ్స్ (బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్) ఆడుకోవడానికి హాస్టల్‌లో సదుపాయాలున్నాయి. పూర్తిగా ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి.
 
ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్

ఇక్కడ ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఐఐటీ స్థాయి గుర్తింపు దక్కలే దు. వచ్చే ఏడాది మార్చిలో ఐఎస్‌ఎంకు ఐఐటీల స్థాయి గుర్తిం పు లభించే అవకాశం ఉంది. ప్రతిభావంతులకు మెరిట్ కమ్ మీ న్స్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.4.5 లక్షలకు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ట్రెడిషనల్ సబ్జెక్టులు కూడా

 సెమిస్టర్‌కు ఐదు సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్ ఎకనామిక్స్ వంటివాటిని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రతి సెమిస్టర్‌లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ సెమిస్టర్‌కు 30 శాతం వెయిటేజ్, ఎండ్ సెమిస్టర్‌కు 60 శాతం వెయిటేజ్ ఉంటాయి. మరో 10 శాతం ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను.
 
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్

మైనింగ్ సంబంధిత కోర్సుల కోసం ప్రత్యేకంగా ఏర్పడింది ఈ ఇన్‌స్టిట్యూట్. మైనింగ్, పెట్రోలియం, మినరల్ ఇంజనీరింగ్ కంటే సీఎస్‌ఈ విద్యార్థులే అత్యధిక పే ప్యాకేజీలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థులను కోల్ ఇండియా వంటి కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే నియమించుకుంటున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కు సంబంధించిన కంపెనీలు కూడా పెద్దగా రావడం లేదు.
 
పూర్వ విద్యార్థుల సమ్మేళనమే బసంత్

 ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ ఉంటాయి. ఒక్కోటి మూడు రోజులపాటు జరుగుతుంది. బసంత్ పేరుతో పూర్వ విద్యార్థుల ఫెస్ట్ కూడా ఏటా ఉంటుంది. దీనికి పూర్వ విద్యార్థులంతా హాజరవుతారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కెరీర్ గెడైన్స్, స్టార్టప్స్‌కు సంబంధించి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, క్రికెట్ క్లబ్ ఇలా ఎన్నో క్లబ్‌లు ఉంటాయి. వీటి ల్లో చేరడం ద్వారా సంబంధిత అంశాలపై పట్టు సాధించవచ్చు.
 
ఈ-సెల్ అందించే సేవలెన్నో

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. దీని ఆధ్వర్యంలో బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. ఇంకా స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement