ఏం చూసి ఎంపిక చేస్తారు?
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో కనిపించకపోయినా ఏడాది కాలంగా వార్తల్లో మాత్రం కచ్చితంగా ఉంటున్నాడు. అతను తనంతట తానుగా ఏమీ చెప్పకపోయినా, సెలక్టర్ల ఉద్దేశం బయటకు తెలియకపోయినా అతని రిటైర్మెంట్పై చర్చ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అతని మాజీ సహచరుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బాగా ఆడితే ధోని భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం ఉందంటూ కోచ్ రవిశాస్త్రి సహా పలువురు చెప్పిన నేపథ్యంలో గంభీర్ ఈ మాటలు అన్నాడు. ధోని 2019 జూలైలో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ఇప్పటి వరకు మరో మ్యాచ్ ఆడలేదు. ‘ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే మళ్లీ జట్టులోకి చోటు దక్కించుకోవడం ధోనికి చాలా చాలా కష్టమవుతుంది.
భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలంటే ఒక ఆటగాడు తన సత్తాతో జట్టును గెలిపించగలిగే స్థితిలో ఉండాలి. రిటైర్మెంట్ అన్నది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. కానీ ధోని మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరం అవుతోంది. మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతాడో తెలీదు. ఇలాంటప్పుడు అసలు ఏ ప్రదర్శన ఆధారంగా అతడిని జట్టులోకి ఎంపిక చేస్తారు’ అని గంభీర్ సూటిగా ప్రశ్నించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తీసుకుంటే తన దృష్టిలో లోకేశ్ రాహుల్ మాజీ కెప్టెన్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం కాగలడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ చక్కటి బ్యాట్స్‌మన్ కావడంతో పాటు సమర్థంగా కీపింగ్ చేస్తూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలగడం జట్టుకు మేలు చేస్తుందని అతను సూచించాడు. ధోనితో పోలిస్తే అద్భుతమైన కీపర్ కాకపోయినా, టి20 ఫార్మాట్లో రాహుల్ సరిగ్గా సరిపోతాడని భారత మాజీ ఓపెనర్ ప్రశంసించాడు.
ఐపీఎల్లో మరో రెండేళ్లు..
ధోని మళ్లీ భారత్‌కు ఆడతాడో లేదో చెప్పలేకపోయినా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీలో అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు వచ్చే రెండేళ్లు కూడా ఆడే అవకాశం ఉందని మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా చెన్నై జట్టును నడిపించడాన్ని ధోని ఆస్వాదిస్తాడని లక్ష్మణ్ అన్నాడు. ‘చెన్నైకి ఆడటం ధోనికి ఎప్పుడైనా ఉత్సాహానిస్తుంది. అతని ఫిట్నెస్ అద్భుతంగా ఉండటమే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉంటాడు. వయసనేది అసలు సమస్యే కాదు. సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని అతను బాగా ఇష్టపడతాడు. మనందరం కూడా ఐపీఎల్లో ధోనిని చూడాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరమే కాదు, కనీసం మరో రెండేళ్లు ఐపీఎల్ ఆడిన తర్వాతే అతను తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడు. ఇక భారత జట్టుకు ఆడటం గురించి అతను ఈపాటికే తన మనసులో మాటను కెప్టెన్, కోచ్‌కు చెప్పేసి ఉంటాడనేది నా భావన’ అని హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ అభిప్రాయపడ్డాడు.
మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయంపై స్పందిస్తూ... ‘నాకు తెలిసి ధోని ఇప్పటికే భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడేశాడు. అతను అనధికారికంగా రిటైర్ అయినట్లే. ఏదైనా హడావుడి లేకుండా చేయడమే ధోని శైలి. కాబట్టి వీడ్కోలు మ్యాచ్ కావాలని, ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించాలని అతను కోరుకోడు. తాను ఇకపై టీమిండియాకు ఆడబోనని నిర్ణయించేసుకొని ఉంటాడు. ఈ ఒక్కసారి టి20 ప్రపంచకప్ కోసం నీ సేవలు కావాలని ఏ గంగూలీయో, కోహ్లినో, రవిశాస్త్రి స్థాయివారో మాట్లాడి ఒప్పిస్తే తప్ప అతను మళ్లీ బరిలోకి దిగకపోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు.