indiramma house constructs
-
‘ఇందిరమ్మ’ అవినీతిని నిర్భయంగా చెప్పాలి
ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలతోపాటు దళారీ వ్యవస్థను ఉపేక్షించేది లేదని సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ బి.రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటి సర్వే అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, హౌసింగ్ అధికారుల సిబ్బందితో ఐదు టీంలుగా పర్యటించి 500 వరకు ఇళ్లపై విచారణ చేశామన్నారు. ఇళ్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతోపాటు పాత ఇళ్లపై బిల్లులు తీసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాజేశ్వర్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండానే బిల్లు కాజేయడంతోపాటు అదే ఇల్లును కొనుగోలు చేసిన వ్యక్తిపై కూడా పాత యజమానే బిల్లు కాజేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. ఓ మహిళా వర్క్ఇన్స్పెక్టర్ తాను విధులు నిర్వర్తించిన సమయంలో బొప్పారపు రాజేశ్వర్ అనే వ్యక్తి ఇల్లుపై శాంత అనే మహిళ పేరుపై బినామీ బ్యాంకు ఖాతా తెరిచి ఖాతాదారురాలికి రూ.2 వేలు చెల్లించి.. రూ.38 వేలు స్వాహా చేసినట్లు గుర్తించామన్నారు. వీవో గ్రూపుల ద్వారా చెల్లించిన ఇందిరమ్మ ఇళ్లలో రూ.50 లక్షలకుపైగా భారీ అవినీతి చోటుచేసుకుందన్నారు. ఇందులో రూ.25 లక్షలకుపైగా చెల్లింపులు జరిగినట్లు నిర్దారణకు వచ్చామని తెలిపారు. వీవో చెల్లింపుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంటి దొంగల వివరాలను 9440700920 నంబర్‌కు ఫోన్ చేసి ప్రజలు నిర్భయంగా తెలియజేయవచ్చని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో... తవ్వినకొద్దీ అక్రమాలు
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అంతులేని అవినీతి, అవకతవకలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఇళ్లను పరిశీలించడానికి వెళ్లిన సీఐడీ అధికారులకు సిమెంటు దిమ్మెలు తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో ఖంగుతింటున్నారు. గత రెండుమూడు రోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో సీఐడీ అధికారులు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. తాజాగా మంగళవారం బషీరాబాద్, గండేడ్ మండలాల్లో పర్యటించిన అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు అందచేశారు. బషీరాబాద్ మండలంలో 21 ఇళ్ల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మండల కేంద్రంలోని గోసాయి కాలనీలో పేదలకు స్థలాలు కేటాయించి 21 ఇళ్లు నిర్మించామని చెబుతున్న ప్రదేశానికి సీఐ డీ విభాగం డీఎస్పీ జితేందర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అయితే అక్కడ మోకాళ్ల లోతు సిమెంటు దిమ్మెలు మినహాయించి ఇంకేమీ కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికిలోనయ్యారు. లబ్ధిదారులు, మ ద్యవర్తులు, అధికారులు కుమ్మకై ఈ 21 ఇళ్లకు సంబంధిం చి రూ.2.82 లక్షలు స్వాహా చేసినట్లు తేల్చారు. మధ్యవర్తులు తమ పేర్లపై వచ్చిన బిల్లులు కాజేసి మోసం చేశారని పలువురు లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు.