విసుగెత్తించడమే పరిష్కారం
బైలైన్
భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడమే అందరికీ కావాలి. అయితే క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంతటి ప్రమాదానికి సిద్ధపడాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప, యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ విషయంలో నెలకొన్న బాధా కరమైన ప్రతిష్టంభనకు పరి ష్కారం ఒక్కటే. ఎవరూ పట్టించుకోనంత మహా విసుగెత్తించేదిగా దాన్ని మార్చేయడం. హాకీ ఆ పని ముందే చేసి చూపింది. ఒకానొకప్పడు ఎప్పుడో గతంలో ఒలింపిక్ లేదా ఆసియా హాకీ స్వర్ణం కోసం భారత్, పాక్ జట్లు తలపడుతుంటే ఉపఖండమంతా ఆ క్రీడకు దాసోహమనేది.
రెండు జట్లు మొదటి స్థానం కోసం గాక, చివరి స్థానం కోసం పోటీ పడటం మొదలు కావడంతోనే ఆ ఉత్సాహోద్వేగాలన్నీ తుస్సుమని పోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ గురించిన చర్చ నత్తనడక నడుస్తోంది. అసలు అలాంటి చర్చే సంఘ వ్యతిరేకమైనదన్నట్టుగా సోషల్ మీడియా ఉద్రేకపడుతోంది. భారత్, పాక్‌లు హాకీ ఆడుతుంటే గుసగుసైనా వినిపించదు. అదే క్రికెట్ అయితే కల్లోలం రేగుతుంది.
కాబట్టి సమస్య క్రీడ కాదు, దానికి లభించే ప్రతిస్పందన. ఆసక్తిని చంపేస్తే, వివా దమూసమసిపోతుంది. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ జట్లూ విసుగెత్తించ నిరాకరిస్తుండటమే సమస్య. రెండు జట్లూ ఏ శుభ దినానైనా ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలిగేవే. సహజంగానే, ఏదీ నిలకడగా ఆడే బాపతు కాదు. ఉపఖండం స్వభావానికే అది విరుద్ధం. రెండు జట్ల ఆట తీరూ ఊహింపశక్యం కానిదే. అదే ఉద్విగ్నతకు కారణం.
భారత్-పాక్ టెస్ట్ సిరీస్ విషయంలోని ఆచర ణాత్మక సమస్యలను గురించి ఆలోచించండి. హాకీ అయితే ఓ రెండు గంటల్లో ఆట ముగిసిపోతుంది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులుంటుంది. సిరీస్ మన దేశంలో జరుగుతుంటే మన మైదానాల అధికారులు ఆట మూడు రోజుల కంటే ముందే ముగిసిపోయేలా చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్త వ్యాన్ని నిర్వర్తిస్తారు. భారత్, పాక్‌తో ఆడుతున్న ప్పుడు ఆ పద్దెనిమిది గంటల క్రీడా సమయం సైతం అనంతంలా అనిపిస్తుంది. శాంతికాముకులైన పౌరుల ఉద్వేగాలను నియంత్రించడం నిజానికి అతి చిన్న సమస్య.
కానీ క్రీడాకారుల భద్రతకు ఎవరూ హామీని కల్పించలేరు. కాబట్టి పాకిస్తాన్ జట్టు పాక్‌లో ఆడలేదు. ఆ దేశం తన ‘సొంత మైదానాల’ను యునెటైడ్ ఎమిరేట్స్‌కు ఔట్‌సోర్స్ చేసింది. పాక్‌లో క్రికెట్‌ను అసాధ్యం చేసిన ఉగ్రవాదులు, మరెక్కడైనా పాక్, భారత్‌తో తలపడుతుంటే చూస్తూ ఊరుకుం టారా? ఆట జరిగేచోట కాకున్నా మరెక్కడైనా దాడి జరిగితే ఏం చేయాలి? మీడియా ఉన్మాదాన్ని రేకె త్తిస్తుంది కాబట్టి, ప్రభుత్వాలు సంతృప్తిపరచే విధా నాన్ని అవలంబిస్తున్నాయని విమర్శలను ఎదుర్కో వాల్సి ఉంటుంది. కాబట్టి ఆటను పూర్తిగా కట్టిపెట్టే యాలా? ఇటీవల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో ఏర్పాటు చేయాలనే మాట వినిపిస్తోంది. పారిస్ ఉగ్రదాడి తదుపరి లార్డ్స్‌లో ఈ ప్రదర్శన జరగడానికి ఆ మైదానం యజమాని ఎమ్సీసీగానీ, బ్రిటన్ గూఢచార సంస్థ ఎమ్16గానీ సుముఖత చూపితే ఆశ్చర్య పోవాల్సిందే.
భారత్-పాక్ క్రికెట్లో ఏ మూల చూసినా, ఏదో ఒక ఊహించని సమస్య పొంచి ఉంటుంది. ఉదాహ రణకు, గత టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరిగిన ప్పుడు భారత టీవీ చానళ్లలో చూపిన పలు ప్రకటనలు రెచ్చగొట్టేవిగా, ప్రమాదకరమైనవిగా, వివేకరహిత మైనవిగా, జాతీయోన్మాద పూరితమైనవిగా ఉన్నాయి. అవి లెక్కలేనంతమంది వీక్షకులను భారత్‌కు వ్యతి రేకంగా మార్చాయి. నాడు జరిగిన నష్టం ఇంకా కనిపిస్తూనే ఉంది. భారత క్రికెట్‌కు బాధ్యత వహిం చాల్సిన బీసీసీఐ అప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే అవకాశమూ తక్కువే. దానికి పట్టేది ఒక్కటే, కాసుల గలగలలు.
ఇక చారిత్రకంగా అత్యంత వివాదాస్పద అంశమైన అంపైరింగ్‌ను చూద్దాం. అంపైరింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో భారత్‌ది... తప్పంటూ జరిగితే అది మానవ తప్పిదమే కానిద్ధామనే యంత్ర విధ్వంసకుల(లుడ్డైట్ల) వైఖరే. ఇది మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ వారసత్వంలో భాగం. జనం యంత్రాలను క్షమిస్తారే తప్ప, మనిషిని క్షమించలేరనే చిన్న విషయం పెద్దపెద్ద క్రికెట్ బుర్రలకు ఎందుకు బోధపడదు? యంత్రానికి లంచం ఇవ్వలేం.
క్రికెట్ భారీగా డబ్బుతో ముడిపడినదిగా మారడం, దాన్ని అనుసరించి వచ్చిన బెట్టింగ్ తమాషా నేపథ్యంలో ప్రతిచోటా అవినీతి వాసనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అలా అని అంపైర్లు అవినీతి పరులని ఆరోపిస్తున్నట్టు కానే కాదు. వాళ్లు తమపైన తామే నిరంతర నిఘాను ఉంచుకుంటారు. అయితే పుకార్లకు, ఊసుపోని కబుర్లకు వాస్తవాలలో ఆసక్తి ఉండదు. పాక్‌తో మనం క్రికెట్ ఆడటం అంటూ జరిగితే అది, మనం కూడా మిగతా ప్రపంచంలాగా అనుమానం వస్తే కెమెరాను సంప్రదించడం మొదలు పెట్టాకనే.
విసుగెత్తించేటప్పుడైనా నాకు క్రికెట్ అంటే ప్రేమే. అదీ, ఇంగ్లిష్ ప్రీమియర్ ఫుట్‌బాల్ మాత్రమే టీవీ కొనడానికి నాకు ముఖ్య కారణం. భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడం కంటే ఎక్కువ ఎవరూ ఆశించరు. క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంత ప్రమాదాన్ని ఆహ్వానించాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. క్రీడ అంటే స్త్రీపురుషులు తమ అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించి, మహోత్కృష్ట మనోహర కళా కౌశలాన్ని ప్రదర్శించే రంగస్థలి. క్రీడ అంటేనే పోటీ పడటం ఉంటుంది. నాటకీయతను అత్యున్నత స్థాయికి చేర్చేది అదే.
అయితే వివేకవంతులైన క్రీడాకారులెవరూ పోటీని శత్రుత్వమనే రొచ్చుగుంటలోకి దిగజారిపోని వ్వరు. క్రీడల మౌలిక సూత్రాలకే అది విరుద్ధం. చూస్తు న్నదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామంటే, అది ఆటే కాదు. ఈ చలికాలంలో భారత్, పాక్‌తో ఆడాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి.