చర్యలు తీసుకుంటేనే చర్చలు
* ఇప్పుడు బంతి మీ కోర్టులోనే ఉంది: పాకిస్తాన్‌కు స్పష్టం చేసిన భారత్
* భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీపై అనిశ్చితి
* ఏం చేస్తారో చెప్పండి.. ఆ తర్వాతే మాట్లాడుకుందాం: వికాస్ స్వరూప్
* జైషే పాత్రపై పాక్‌కు స్పష్టమైన ఆధారాలిచ్చిన అజిత్ దోవల్
న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య చర్చల ప్రక్రియ ముందడుగేయాలంటే.. ముందుగా పఠాన్‌కోట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. ‘ఇప్పుడు బంతి పాక్ కోర్టులో ఉంది’ అని తెలిపింది.
దాడికి వ్యూహరచన పాక్‌లో జరిగినట్లు ఆధారాలున్నందున.. తర్వాత ఏం చేయాలో నిర్ణయించాల్సింది పాకిస్తానేనని తేల్చిచెప్పింది. షెడ్యూల్ ప్రకారం 15న ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా.. పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. అయితే, ఈ చర్చలను నిలిపేసి ఇరుదేశాల భద్రతా సలహాదారులు మరోసారి కలుస్తారని వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం.
పఠాన్‌కోట్‌పై పాక్ ఎలాంటి డెడ్‌లైన్ ఇవ్వకుండా.. చర్చలు కష్టం’ అన్నారు. పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణలో.. ఉగ్రవాదంపై కఠిన చర్యలపైనే మోదీ పట్టుబట్టారని వెల్లడించారు. పాక్ నుంచి భారత్‌లో విధ్వంసానికి జరుగుతున్న ప్రణాళికలపై చర్యలు తీసుకోవాలని గట్టిగానే చెప్పారని.. దీనికి పాక్ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశం
భారత్-పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చితి నెలకొన్న సమయంలో.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసి.. పఠాన్‌కోట్ దాడిపై చర్చించారు. ఆర్థిక, హోం శాఖ మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు, ఎన్ఎస్ఏ చీఫ్, ఇంటెలిజెన్స్చీఫ్లతో మాట్లాడారు. దాడి ఘటనపై భారత్ అందజేసిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించాలని.. కేవలం టెలిఫోన్ నంబర్లే ఉన్నందున మరింత సమాచారాన్ని భారత్‌నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. విచారణ పూర్తయిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.
జైషే పాత్ర స్పష్టమే!: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో జైషే మొహమ్మద్ సంస్థ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను భారత ఇంటలిజెన్స్ సంపాదించింది. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ (1999 కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి)తో పాటు మరో ఇద్దరు ఈ దాడికి వ్యూహరచన జరిపినట్లు గుర్తించింది. లాహోర్ సమీపంలో కుట్ర జరిగినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. భారత ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్.. పాక్ ఎన్ఎస్ఏ చీఫ్‌తో మాట్లాడి.. స్పష్టమైన,చర్యలు తీసుకునేందుకు అనువైన సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. ఈ వివరాలను పాకిస్తాన్‌కు అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చర్చలు కొనసాగించండి: చైనా
ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్-పాక్ సంబంధాలను దెబ్బతీసేందుకే కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని స్నేహబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు చర్చల ప్రక్రియ కొనసాగించాలని ఆకాంక్షించింది.
చివరి దశలో కూంబింగ్
పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూంబింగ్ చివరి దశకు చేరుకుందని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎన్ఎస్జీ, గరుడ్, ఐఏఎఫ్ కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారా? ఎక్కడైనా బాంబులు పెట్టారా? అని వెతికేందుకే ఈ కూంబింగ్ జరుగుతోందని ఎయిర్ కమాండర్ జేఎస్ దమూన్ తెలిపారు. ఎన్ఎస్జీ బలగాల తక్షణ స్పందన, గరుడ్ విభాగం చాకచక్యంగా వ్యవహరించటంతో ఉగ్రవాదులను ఒక ప్రాంతానికే పరిమితం చేశామని చెప్పారు.
బీఎస్ఎఫ్ నిజనిర్ధారణ కమిటీ
ఉగ్రవాదులు భారత్-పాక్ సరిహద్దుగుండా ప్రవేశించి దాడికి పాల్పడ్డారనే విమర్శల నేపథ్యంలో.. అక్రమ చొరబాట్లు, నదులు, దట్టమైన అడవులున్న చోటనిఘా కొరవడటంపై విచారించేందుకు బీఎస్ఎఫ్ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. పదిహేను రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది.
సల్వీందర్ వాంగ్మూలం నమోదు: విచారణలో భాగంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఈయన మిత్రుడు రాజేశ్ వర్మను విచారించారు. సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన ఎన్ఐఏ అధికారులు.. బీఎస్ఎఫ్ సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు.
మరో ఇద్దరు ఉగ్రవాదులు?
సరిహద్దు గ్రామమైన టిబ్రీలో మిలటరీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగాడుతుండగా చూశామని గ్రామస్తులు చెప్పటంతో సైనికులు, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.