injection syco
-
మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇంజక్షన్ సైకో కలకలం సృష్టిస్తున్నాడు. భీమవరంలో ముగ్గురు వ్యక్తులు బ్లాక్ పల్సర్ పై సంచరిస్తుండగా గ్రామస్తులు వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజక్షన్ సైకో అనే అనుమానంతో వీరిని గ్రామస్తులు వెంబడించి, ఇద్దరిని పట్టుకోగా, ఒకరు పరారైనట్లు సమాచారం. గ్రామస్తులు వెంబడిస్తున్న సమయంలో వారు పల్సర్ బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఓ అధికారి తెలిపారు. జిల్లాలోని పెంటపాడు మండలం కొండేపాడు గ్రామంలో అల్లూరి పాపారావు అనే వ్యక్తిపై గురువారం సిరంజీ సైకో దాడి చేసిన విషయం విదితమే. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆయన తొడపై సిరంజీతో గుచ్చి పారిపోయిన ఘటన మరువకముందే భీమవరం మండలంలో ఇంజక్షన్ సైకో సంచారం కలకలం సృష్టిస్తోంది. -
'ఇంజక్షన్ సైకోతో ఏ హానీలేదు'
హైదరాబాద్ : ఇంజక్షన్ సైకో విషయంపై మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయే తప్ప ప్రజలకు ఎలాంటి హానీ లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు అన్నారు. గత కొన్ని రోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఇంజక్షన్ సైకో సంచరిస్తున్నాడన్న వార్తలతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇంజక్షన్ సైకో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో సంచరిస్తూ పోలీసులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటివరకూ ఎక్కడా ఇంజక్షన్ సైకో దాడులతో ఏ ఒక్కరూ గాయపడలేదని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఓ విధంగా చెప్పాలంటే అసలు ఇంజక్షన్ సైకో అనే వాడే లేడన్నట్లుగా డీజీపీ మాట్లాడారు. ఈ వారం మొదట్లో ఇంజక్షన్ సైకో రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా సంచరిస్తున్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో కూడా ఓ వ్యక్తిపై సైకో ఇంజక్షన్ గుచ్చి పారిపోయాడని కథనాలు వచ్చిన విషయం విదితమే. కేశవరెడ్డి సంస్థల అధినేత కేశవరెడ్డి కేసును విచారణ చేసిన తర్వాత సీఐడీకి అప్పగించడంపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా వరకు తగ్గిందని డీజీపీ రాముడు పేర్కొన్నారు. -
వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో
ఏలూరు : ఇంజక్షన్ సైకో దాడుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకూ ఇంజక్షన్ సైకో దాడులు పెరిగిపోతున్నాయి. మరోపక్క సైకో దాడులు గోదావరి జిల్లాల ప్రజలకే కాదు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిన్న కూడా రఘునాథ్ అనే వ్యక్తిపై సైకో దాడి చేశాడన్న విషయం విదితమే. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని రఘు ఆరోపిస్తున్నాడు. మోటార్ సైకిల్‌పై వీళ్లిద్దరూ తిరుగుతూ ఈ దాడులు చేస్తున్నారని చెప్పాడు. పెనుగొండ ఎస్సై మాత్రం ఆ వ్యక్తి చెప్పిన విషయాలు అవాస్తవాలని కొట్టిపారేయడం గమనార్హం. ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో సైకోను పట్టించిన వారికి రూ.50 వేలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతంలో ప్రకటించిన విషయం విదితమే.