'ఇంజక్షన్ సైకోతో ఏ హానీలేదు'
హైదరాబాద్ : ఇంజక్షన్ సైకో విషయంపై మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయే తప్ప ప్రజలకు ఎలాంటి హానీ లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు అన్నారు. గత కొన్ని రోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఇంజక్షన్ సైకో సంచరిస్తున్నాడన్న వార్తలతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇంజక్షన్ సైకో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో సంచరిస్తూ పోలీసులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటివరకూ ఎక్కడా ఇంజక్షన్ సైకో దాడులతో ఏ ఒక్కరూ గాయపడలేదని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఓ విధంగా చెప్పాలంటే అసలు ఇంజక్షన్ సైకో అనే వాడే లేడన్నట్లుగా డీజీపీ మాట్లాడారు.
ఈ వారం మొదట్లో ఇంజక్షన్ సైకో రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా సంచరిస్తున్నాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో కూడా ఓ వ్యక్తిపై సైకో ఇంజక్షన్ గుచ్చి పారిపోయాడని కథనాలు వచ్చిన విషయం విదితమే. కేశవరెడ్డి సంస్థల అధినేత కేశవరెడ్డి కేసును విచారణ చేసిన తర్వాత సీఐడీకి అప్పగించడంపై నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా వరకు తగ్గిందని డీజీపీ రాముడు పేర్కొన్నారు.