ఈకల కోకలు
రాతియుగం సెకండాఫ్‌లో బట్టలు చుట్టుకోవడం నేర్చిన మానవులు.. అంచెలంచెలుగా ఆధునికతను అందిపుచ్చుకున్నారు. చెట్ల ఆకులు కట్టుకున్న చేతులతోనే.. పట్టుపీతాంబరాలు చుట్టుకున్నారు. జంతు చర్మాలను ధరించిన వాళ్లే.. లెదర్‌తో నయా డిజైన్లను ప్రపంచానికి పరిచయం చేశారు. విప్లవాత్మకమైన మార్పులతో కొత్తపుంతలు తొక్కిస్తున్న ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు మూలాల్లోకి వెళ్లి ఆనాటి ట్రెండ్స్‌ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఆదివాసీలు అలంకరించుకునే పక్షుల ఈకలతో ఇన్నోవేటివ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి మార్కెట్లో మార్కులు కొట్టేస్తున్నారు.
ఫాస్ట్‌గా మూవ్ అవుతున్న ప్రపంచం కోసం ఫ్యాషన్ రంగం సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. ఈతరం అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తోంది. కాటన్ శారీస్, సిల్క్ స్కర్ట్స్.. వందల రకాల ఫ్యాబ్రిక్స్‌తో వేల రకాల కాస్ట్యూమ్స్ మగువల మనసులు దోచేశాయి. ఇప్పుడదే కోవలోకి ఫెదర్స్ ట్రెండ్‌ను చేరుస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
నెమలీకలు.. కోడీకలు..
ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్‌తో కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అని రుజువు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నెమలి, కోడి, పావురాల ఈకలతో సరికొత్త వస్త్రాలు తయారు చేస్తున్నారు. నెమలీకలతో వెడ్డింగ్ డ్రెస్, ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్స్, మినీ డ్రెస్, స్కర్ట్స్ రూపొందిస్తున్నారు. చీరల కొంగులకు ఈకలతో ముడివేసి.. అతివల అందానికి మరింత వన్నె తెస్తున్నారు. కోడి ఈకలు, పావురాల ఈకలు కూడా ఫెదర్ ట్రెండ్‌లో సత్తా చాటుతున్నాయి. రంగురంగుల ఈకలు అల్లుకున్న డ్రెస్‌లు మగువల మనసును దోచేస్తున్నాయి.
అదనపు సొబగులు..
పట్టుపోగులతో సవరాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈకలతో రూపుదిద్దుకున్న హెయిర్ యాక్ససరీస్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. రంగురంగుల ఫెదర్ హెయిర్ యాక్ససరీస్ కురుల అందాన్ని మరింత పెంచుతున్నాయి. ఇవేకాకుండా ఫెదర్ హెయిర్ హ్యాట్, ఫెదర్ హెయిర్ క్లిప్స్, ఇయర్ హ్యాంగింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈకలతో రూపొందించిన పౌచెస్ కూడా అందర్నీఆకట్టుకుంటున్నాయి. ఈ తరం కాలేజ్ స్టూడెంట్స్, మోడల్స్, హీరోయిన్లు సైతం నైట్ పార్టీలకు ఇలాంటి ఇన్నోవేటివ్ కలెక్షన్స్ వేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.
సిరి