యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.