పుత్తూరులో ఉగ్రవాదుల దాడి: సీఐ, కానిస్టేబుల్ మృతి
దేవదేవుడు కొలువై ఉన్న చిత్తూరు జిల్లా గజగజ వణికిపోతోంది. ఉగ్రవాదుల దాడిలో సీఐ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకుముందే ఒక కానిస్టేబుల్ కూడా మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదులు ఇక్కడ మకాం వేశారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా యావత్తు బెంబేలెత్తిపోతోంది. పుత్తూరులో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు, స్థానిక పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. తనిఖీలు చేపట్టిన పోలీసులపై దుండగులు కత్తి, రాళ్లతో దాడి చేశారు. కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఉగ్రవాదుల దాడిలో ఓ ఎస్.ఐ, ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అటు దుండగులు ఇంట్లోనే ఉండి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై దాడి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడు ఎస్ఐబీ ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న డీజీపీ బి. ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటు... ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను అల్-ఉమా సంస్థకు చెందిన అబూ బకర్, ఫక్రుద్దీన్ అహ్మద్, బిలాల్‌గా అనుమానిస్తున్నారు. శుక్రవారం చెన్నై పోలీసులు ఫక్రుద్దీన్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి పుత్తూరు చేరుకున్న తమిళనాడు పోలీసులు, స్థానిక సీఐ సాయంతో ఆపేరషన్ చేపట్టినట్లు సమాచారం. ఈ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు.... ఆర్ఎస్ఎస్, బీజేపీ, భజరంగ్‌దళ్ నేతలు లక్ష్యంగా పలుసార్లు హత్యప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత రమేష్‌ను హత్య చేశారు. గత 18 నెలల్లో హిందూ సంస్థలకు చెందిన 16 మందిని అల్-ఉమా ఉగ్రవాదులు హతమార్చినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి.