అవయవ దాతల పిల్లలకు ఉచిత విద్య
ఎంపీగా నాపై ఎలాంటి మచ్చలేదు
సినీ నటుడు మోహన్‌బాబు
సిటీబ్యూరో: ‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేయాలనిపిస్తుంది. కానీ ఇంట్లో వారు, బంధువులు ఎవరికీ లేని బాధ మీకెందుకు? అంటూ నాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక ఓ పిరికిపందలా ఒంటరిగా జీవిస్తున్నా’ అని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దాతల పిల్లలకు తన విద్యా సంస్థలో ఉచిత విద్యనందిస్తానని ప్రకటించారు. వ ందేళ్లు కూడా బతుకుతామో లేదో తెలియదు. కానీ కొంతమంది వెయ్యేళ్లకు సరిపడినంత సంపాదిస్తున్నారు. దీని కోసం అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ప్రపంచ అవయవ దానం దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతల కుటుంబ సభ్యులను గురువారం కిమ్స్‌లో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు, అన్యాయాలపై ఎప్పటికప్పుడు నిలదీయాలని ఉన్నా.. కొంతమంది ఒత్తిడితో వాటికి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన కాలంలో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. భూతద్దం పెట్టి వెతికినా లోపాలు కన్పించవన్నారు. ఎంపీగా క్లీన్చిట్ పొందినట్లు చెప్పారు. జీవితంలో ఇప్పటి వరకు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడలేదని, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేయాలని భావనతోనే విద్యాలయాలు స్థాపించి... 25 శాతం మంది ప్రతిభగల పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అవ యవ దాతల పిల్లలకు తన విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని ప్రకటించారు. అవయవ దానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత, కిమ్స్ వైద్యులు డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ సహారియా, తదితరులు పాల్గొన్నారు.