Insurance industry
-
బీమా... పూర్తిగా డిజిటల్!
వ్యక్తుల మధ్య భౌతిక దూరం.. అత్యవసర పనులకే కాలు బటయటపెట్టడం.. వీలుంటే ఇంటి నుంచే కార్యాలయ పని (వర్క్ ఫ్రమ్ హోమ్).. ఇవన్నీ కరోనా వైరస్ కారణంగా వచ్చిన మార్పులు. బీమా పరిశ్రమ అభివద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ పరిస్థితులను అర్థం చేసుకుంది. అన్ని రకాల టర్మ్ పాలసీలను, ఇందుకు సంబంధించి ఇతర సేవలను డిజిటల్ గా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆఫ్ లైన్ విభాగంలోని టర్మ్ ప్లాన్లు, వాటి డాక్యుమెంట్లను కూడా బీమా సంస్థలు ఇప్పుడిక డిజిటల్ గానే అందించనున్నాయి. ఫలితంగా పాలసీదారులు సౌకర్యంగా, తామున్న చోటు నుంచే పాలసీలను పొందే వీలు కలిగింది. కోవిడ్–19 ్టకాలంలో ఆఫ్ లైన్ బీమాకు సంబంధించి ఇదొక వెసులుబాటు. కరోనా వైరస్ చాలా రంగాల్లో డిజిటైజేషన్ కు దారితీసిందనే చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. బీమా సంస్థలు ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా పాలసీలను విక్రయించేందుకు, అదే విధంగా పాలసీదారులు ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకునేందుకు, బీమా క్లెయిమ్ లు చేసుకునేందుకు వీలుగా ఐఆర్డీఏఐ నిబంధనల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో బీమా పాలసీలను దాదాపు అన్ని సంస్థలు ఇప్పటికే ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఆఫ్ లైన్ లో అందించే టర్మ్ పాలసీలను కూడా డిజిటల్ రూపంలో అందించడం తాజాగా వచ్చిన మార్పుల్లో భాగమని చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ పూర్తిగా డిజిటల్ రూపం సంతరించుకునే దిశగా ఇది తొలి మెట్టుగానే భావించాలి. బీమా పరిశ్రమ మరింత విస్తరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడే వీలుంది. ప్రపోజల్స్‌కు డిజిటల్ ఆమోదం ఆన్ లైన్ ద్వారా టర్మ్ ప్లాన్లను కొనుగోలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ, ఆఫ్ లైన్ లో అంటే బీమా ఏజెంట్లు లేదా బీమా కార్యాలయాల నుంచి పాలసీలను తీసుకోవాలంటే ప్రస్తుతం వెనుకాడాల్సిన పరిస్థితులున్నాయి. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా బీమా పాలసీల పంపిణీ, ప్రచారం అన్నది కరోనా వైరస్ విస్తరణ సమయంలో కష్టసాధ్యమని ఐఆర్డీఏఐ గుర్తించింది. భౌతికంగా పాలసీదారులు ప్రపోజల్ పత్రాలను పూర్తి చేయడం, సంతకాలు చేసిన తర్వాత వాటిని సమర్పించడం వంటి పనులపై కరోనా ప్రభావం ఉన్నట్టు గుర్తించిన ఐఆర్డీఏఐ నిబంధనల పరంగా వెలుసుబాటు కల్పించింది. ‘‘టర్మ్ ప్లాన్లు అర్థం చేసుకునేందుకు ఎంతో సులభంగా ఉంటాయి. ఇప్పుడు టర్మ్ ప్లాన్లను తీసుకునేందుకు భౌతికంగా సంతకాలు అవసరం లేకుండా చేయడం అన్నది మంచి నిర్ణయమే అవుతుంది’’ అని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ పేర్కొన్నారు. ‘‘కరోనా నేపథ్యంలో కస్టమర్లు ఎవరిని కలవాలన్నా వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రపోజల్ పత్రాలను ఫోన్ ద్వారా లేదా వీడియోకాల్ ద్వారా తీసుకుంటున్నాం. అయితే, సంతకం తీసుకోవడం సవాలుగానే ఉంది. దీంతో డిజిటల్ రూపంలో ఓటీపీ ద్వారా ఆమోదం తీసుకోవడం దీనికి పరిష్కారం. ప్రపోజల్ పత్రాలకు సంబంధించి కస్టమర్ల సంతకాలు లేకుండానే వారి ఆమోదం తీసుకునేందుకు బీమా సంస్థలను ఐఆర్డీఏఐ అనుమతించింది’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ న్యాయ, నిబంధనల విభాగం హెడ్ అనిల్ పీఎం తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ల మెయిల్ బాక్స్ కు ఈ మెయిల్ రూపంలో లేదా మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ రూపంలో లింక్ ను బీమా సంస్థలు పంపిస్తాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి వచ్చే పేజీలో ఓటీపీ ఇవ్వడం ద్వారా ప్రపోజల్ పత్రానికి ఆమోదం తెలియజేసినట్టు అవుతుంది. పూర్తిగా నింపిన ప్రపోజల్ పత్రానికి పాలసీదారులు ఆమోదం తెలిపినట్టుగా చట్టపరమైన ఆధారాలను బీమా సంస్థలు కలిగి ఉండాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా అవసరమైన డిజిటల్ సదుపాయాలు కల్పించుకోవాలని ఆదేశించినట్టు అనిల్ తెలిపారు. అదే విధంగా డిజిటల్ విధానంలో కస్టమర్లు ప్రపోజల్ పత్రానికి సంబంధించి ఆమోదం తెలియజేసే వరకు ప్రీమియం ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రయోగాత్మకంగా ఐఆర్డీఏఐ అనుమతించినట్టు చెప్పారు. ‘‘టర్మ్ ప్లాన్ల వ్యాపారం ఎక్కువగా ఆన్ లైన్ విధానంలో కొనసాగుతోంది. కాకపోతే ఐఆర్డీఏఐ తాజా ఆదేశాల వల్ల ఆఫ్ లైన్ విధానంలోనూ టర్మ్ ప్లాన్లను విక్రయించే బీమా సంస్థలకు వెసులుబాటు లభించనుంది. నిజంగా ఇది సులభతరమైన ప్రక్రియే అవుతుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తే ఇతర బీమా ఉత్పత్తులకూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది’’ అని అనిల్ వివరించారు. ఈ–పాలసీలు ఈ సమయంలో బీమా పాలసీ పత్రాలను ప్రచురించడం, వాటిని కస్టమర్లకు అందించడం చాలా కష్టమైన పని అంటూ బీమా కంపెనీలు ఐఆర్డీఏఐకు మొరపెట్టుకున్నాయి. తద్వారా అన్ని రకాల జీవిత బీమా పాలసీలను ఆన్ లైన్ లో డిజిటల్ రూపంలో అందించేందుకు అనుమతి పొందాయి. దీంతో కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి పాలసీ డాక్యుమెంట్లను వారి మెయిల్ ఐడీకి బీమా సంస్థలు పంపిస్తున్నాయి. 2016లో ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన నిబంధనల మేరకు.. బీమా ప్లాన్ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించడంతోపాటు.. హార్డ్ కాపీని కూడా పాలసీదారులకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ సదుపాయాన్ని వినియోగించుకున్న కస్టమర్లకు మాత్రం బీమా ప్లాన్ డిజిటల్ కాపీని పంపిస్తే సరిపోయేది. ఇప్పుడిక ఈ నియంత్రణల్లేవు. పాలసీబాండ్ ను పీడీఎఫ్ రూపంలో కస్టమర్ మెయిల్ బాక్స్ కు పంపించినా సరిపోతుందని, ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ ను పంపించడం తప్పనిసరి కాదని అనిల్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రీలుక్ పీరియడ్ పరంగానూ జాప్యం అవుతోంది. కస్టమర్లు బీమా పాలసీని అందుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు తమకు నచ్చకపోతే వెనక్కి తిప్పి పంపొచ్చు. అప్పుడు కట్టిన ప్రీమియంలో అధిక భాగం వెనక్కి వచ్చేస్తుంది. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీని అందుకుంటున్న కస్టమర్లకు బీమా సంస్థలు 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు తమ పాలసీ డాక్యుమెంట్ ను అర్థం చేసుకునేందుకు మరింత సమయం లభించినట్టు అయింది. పాలసీ వద్దనుకుంటే 30 రోజుల్లోపు వారు ఎలక్ట్రానిక్ రూపంలోనే తిప్పి పంపించేయవచ్చని, కేవలం ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసినా సరిపోతుందని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ తెలిపారు. మొత్తంమీద బీమా రంగం విస్తరణకు కూడా తాజా నిర్ణయాలు దోహదపడతాయని విశ్లేషణ. కస్టమర్ల అభీష్టమే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా డిజిటల్ పాలసీలను పంపిస్తే చాలన్న వెసులుబాటును ఐఆర్డీఏఐ కల్పించింది. కానీ, తమకు ఫిజికల్ గా పాలసీ బాండ్ కావాలంటూ పాలసీదారులు డిమాండ్ చేస్తే బీమా సంస్థలు తప్పకుండా పంపించాల్సి ఉంటుంది. అందుకు ఎటువంటి చార్జీలను కూడా అదనంగా వసూలు చేయకూడదు. డిజిటల్ రూపంలో పాలసీల జారీ ప్రక్రియ వల్ల బీమా కంపెనీలకు నిర్వహణ, ప్రాసెస్ ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఆదా అయిన మొత్తాన్ని కస్టమర్ల సేవల మెరుగుదలపై కంపెనీలు ఖర్చు చేయగలవని గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల సందిగ్ధత తొలగిపోవడంతోపాటు, బీమా కంపెనీలు, కస్టమర్లు నేరుగా అనుసంధానమయ్యేందుకు, పారదర్శకత పెంపునకు దారితీస్తుంది. కొనుగోలు ప్రక్రియ సులభతరం అవడం వల్ల మరింత మంది బీమా పాలసీల కొనుగోలుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని బీమా కంపెనీలు అంటున్నాయి. అన్నింటి మాదిరే బీమా పాలసీ బాండ్ ను కూడా ఫోన్ ద్వారా పొందడం మంచి పరిణామంగా అనిల్ పేర్కొన్నారు. భౌతికంగా పాలసీ పత్రాలను పంపే విషయంలో చిరునామాల్లో తప్పులు దొర్లడం కారణంగా కొన్ని కంపెనీలకు తిరిగి వెళుతుంటాయి. అదే డిజిటల్ పాలసీ విషయంలో ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవడం కూడా కస్టమర్లు, బీమా కంపెనీలకు సౌకర్యంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. -
బీమాకు మరింత ధీమా!
దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్ సంస్థలు కోరుతున్నాయి. టర్మ్ పాలసీలు, పింఛను పథకాల్లాంటి కొన్ని పాలసీలను ప్రత్యేకంగా పరిగణించి, విడిగా పన్ను మినహాయింపునివ్వాలని జీవిత బీమా సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం బీమా సంస్థలు పెన్షన్ పాలసీల విషయంలో ఎన్‌పీఎస్‌తో పోటీపడాల్సి ఉంటోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు లభిస్తున్న పన్నుపరమైన ప్రోత్సాహకాలు, ఆదాయపు పన్నుకు సంబంధించి రూ. 50,000 దాకా మినహాయింపులు వంటి ప్రయోజనాలు మిగతా పెన్షన్ పథకాలకు పెద్దగా లభించడం లేదు. ఇక, టర్మ్ ప్లాన్లకు విడిగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని అయిదేళ్లుగా డిమాండ్ చేస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు తాజాగా మళ్లీ దాన్ని తెరపైకి తెచ్చాయి. తొలిసారి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేవారికి విడిగా రూ. 50,000 డిడక్షన్, ప్రత్యేకంగా టర్మ్ పాలసీ మాత్రమే తీసుకునేవారికి అదనంగా రూ. 50,000 పన్ను మినహాయింపులిస్తే.. ఈ పాలసీలను మరింతగా విస్తృతిలోకి తేవొచ్చని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కమలేష్ రావు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకునే వారికీ ప్రత్యేకంగా పన్నుపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సాధారణ బీమా కంపెనీలు కోరుతున్నాయి. ప్రస్తుతం నాన్–లైఫ్ పాలసీల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌కి తప్ప మిగతావాటికి పన్ను ప్రయోజనాలు ఉండటం లేదు. మహిళలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలి .. ►బీమా, పొదుపువైపు మళ్లేలా మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు వారికి అదనంగా పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి. ►పన్ను మినహాయింపు లభించాలంటే వార్షిక ప్రీమియంకు పది రెట్లు ఇన్సూరెన్స్ ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలి. ►ఒకవేళ వ్యక్తిగత లైఫ్ పాలసీల ప్రీమియంలకు ప్రత్యేకంగా డిడక్షన్ ఇవ్వని పక్షంలో.. సెక్షన్ 80 సీ పరిమితినైనా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలి. ►వ్యక్తిగతంగా తీసుకునే గృహ బీమా పథకాలకు పన్ను మినహాయింపునివ్వాలి. ►వ్యక్తిగత ప్రమాద బీమా, గృహ బీమా పథకాలకు సెక్షన్ 80డీ కింద ప్రత్యేకంగా పన్ను మినహాయింపులివ్వాలి. ►పాలసీలు కొనుగోలు చేసే వేతన జీవులకు మరిన్ని పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే బీమా మరింత ప్రాచుర్యంలోకి రాగలదు. ►జాతీయ విపత్తుల సమయంలో ఎక్కువగా నష్టపోతున్నది సామాన్య ప్రజలే. వారికి చౌక ప్రీమియంలతో గృహ బీమా సదుపాయం కల్పించాలి. దీన్ని ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటే వసూలు చేయొచ్చు. విపత్తు వల్ల నష్టం వాటిల్లిన పక్షంలో క్లెయిమ్ మొత్తాన్ని సదరు పాలసీదారు జన్ ధన్ యోజన ఖాతాలోకి నేరుగా మళ్లించవచ్చు. ►ప్రస్తుతం బీమా పాలసీలపై ఏకంగా 18 శాతం జీఎస్టీ ఉంటోంది. పాలసీల కొనుగోళ్లకు ఇది ప్రతిబంధకంగా మారుతోంది. దీన్ని 12 శాతానికి తగ్గిస్తే పాలసీదారులు, కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. -
టెక్నాలజీతోనే బీమా పరిశ్రమ వృద్ధి
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ వృద్ధికి టెక్నాలజీ అండగా నిలుస్తోంది. కొత్త కస్టమర్లను చేరుకునేందుకు టెక్నాలజీని అవి వినియోగించుకుంటున్నాయి. పూర్తి స్థాయి సంస్కరణలు, సులువుగా అర్థం చేసుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టినప్పటికీ... ఇప్పటికీ తక్కువ బీమా రక్షణే ఉన్న దేశంలో మరింత మంది కస్టమర్లను సొంతం చేసుకునేందుకు కంపెనీలకు టెక్నాలజీ ఉపయోపడుతోంది. హెచ్ఐవీ, మానసిక అనారోగ్యాలనూ బీమా పరిధిలోకి చేర్చడం, దీర్ఘకాలిక థర్డ్ పార్టీ మోటారు ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేయడం గతేడాది సంస్కరణల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాదు, పేదల కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ ఆరోగ్యబీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. 2018లో కూడా ఆన్లైన్ విక్రయాల్లో బలమైన వృద్ధి నమోదైనట్టు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్మాథుర్ తెలిపారు. పెద్ద ఎత్తున డిజిటైజేషన్, వినియోగదారు అనుకూల ఉత్పత్తులను తీసుకురావడం ఈ వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు. పాయింట్ ఆఫ్ సేల్ ఉత్పత్తులు, ఇతర చానళ్లను వినియోగించుకోవడం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జీవిత బీమా ఉత్పత్తుల విస్తరణ పెరిగినట్టు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఆరోగ్య బీమా పరంగా వినూత్నమైన, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యేకమైన పాలసీలు రానున్నాయని మాథుర్ అంచనా వేశారు. పారదర్శకత పెంపు దిశగా ఐఆర్డీఏ తీసుకున్న చర్యలతో రానున్న సంవత్సరాల్లోనూ పరిశ్రమ వృద్ధి కొనసాగిస్తుందని హెచ్డీఎఫ్సీ లైఫ్ ఈడీ సురేష్ బాదామి తెలిపారు. -
రూ.26 లక్షల కోట్లకుబీమా పరిశ్రమ ప్రీమియం వసూళ్లు!
ముంబై: బీమా పరిశ్రమ (ఇన్సూరెన్స ఇండస్ట్రీ) మొత్తం ప్రీమియం వసూళ్లు (లైఫ్, నాన్‌లైఫ్) 2020 నాటికి రూ.26 లక్షల కోట్లకు చేరవచ్చని సీఐఐ-కేపీఎంజీ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలోని అధిక సంఖ్యాక ప్రజానీకాన్ని బీమా పరిశ్రమలో భాగస్వాములను చేయడానికి ఇన్సూరెన్స కంపెనీలు వాటి వ్యూహాలను సమీక్షించుకోవడం, కస్టమర్లలో ఆర్థిక అవగాహన పెంచడం, భాగస్వామ్యం వంటి పలు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని వివరించింది. కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లలోని అపార వృద్ధి అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఐఐ సూచించింది. దేశీ జీడీపీలో లైఫ్ ఇన్సూరెన్స ప్రీమియం వసూళ్ల వాటా 2.6 శాతంగా, నాన్‌లైఫ్ ఇన్సూరెన్స ప్రీమియం వసూళ్ల వాటా 0.7 శాతంగా ఉందని తెలిపింది. ఇక మ్యూచువల్ ఫండ్స విషయానికి వస్తే.. గడచిన కొన్ని సంవత్సరాల్లో ఫండ్స నేతృత్వంలోని నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) మంచి వృద్ధి నమోదరుు్యందని వివరించింది. వచ్చే నాలుగైదు ఏళ్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని పేర్కొంది. అరుుతే ఎంత వృద్ధి నమోదవుతోన్న దేశ జీడీపీలో మ్యూచువల్ ఫండ్స ఏయూఎం వాటా 7 శాతంగా మాత్రమే ఉందని తెలిపింది. ఇది అమెరికాలో 83 శాతంగా ఉందని పేర్కొంది. -
క్లెయిమ్‌ల పరిష్కారంలో ఎల్ఐసీ భేష్: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: ప్రైవేటు బీమా కంపెనీలతో పోల్చితే ‘డెత్ క్లెయిమ్’ల విషయంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పనితీరు అత్యుత్తమంగా ఉందని ఈ రంగ నియంత్రణ సంస్థ- ఐఆర్డీఏ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు... గతేడాది (2012-13)లో ఎల్ఐసీ క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తి 97.73%. 2011-12లో ఈ నిష్పత్తి 97.42%. అయితే ప్రైవేటు బీమా సంస్థల విషయంలో ఈ రేట్లు వరుసగా 88.65%, 89.34%గా ఉన్నాయి. ఏడాది ముగింపునాటికి ప్రైవేటు బీమా కంపెనీల వద్ద పెండింగులో ఉన్న (పరిష్కరించాల్సిన) క్లెయిమ్‌లు 3.47శాతం. ఎల్ఐసీ విషయంలో ఈ రేటు 1.04 శాతం. 2012-13లో జీవిత బీమా పరిశ్రమల ప్రీమియం ఆదాయం రూ.2.87 లక్షల కోట్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 0.05% అధికం. ప్రీమియం వసూళ్ల విషయంలో ప్రైవేటు రంగంలో 2012-13లో (2011-12తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 6.87% క్షీణత నమోదయ్యింది. అయితే ఈ విషయంలో ఎల్ఐసీ 2.92% వృద్ధిని సాధించింది.