'15న ఉగ్ర దాడులు జరిగే అవకాశం'
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 15 (శనివారం) న ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏడంచెల భద్రత కల్పించారు. ఐబీ హెచ్చరికతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు పటిష్ట నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు.
మరోవైపు దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు. 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు.
కాగా యాకూబ్ మెమెన్ ఉరితీత నేపధ్యంలో ఆగస్టు 15 ఉత్సవాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కాగా శంషాబాద్ విమానాశ్రయంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.