Intermediate student died
-
బాపూ.. నాకీ చదువులొద్దంటే విన్నావా!
జైపూర్: ఇంటర్ పరీక్షలు ఇంకా మొదలవ్వలేదు. కానీ, అప్పుడే ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి రాజేశంకు కుమారుడు, కూతురు హాసిని (18) ఉన్నారు. భార్య గతంలోనే మృతిచెందింది. కుమారుడికి పెళ్లి కాగా సీసీసీలో నివాసం ఉంటున్నాడు.రాజేశం కూలీ పనులు చేస్తూ కూతురిని చదివిస్తున్నాడు. చెన్నూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హాసినిని ఇంటర్లో చేర్పించాడు. అయితే.. చదవడం ఇష్టం లేక బాలిక మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంది. ఆ విద్యాసంవత్సరం వృథా కావడంతో కూతురుని ఒప్పించి మళ్లీ ఈ విద్యాసంవత్సరం మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిలవుతాననే భయంతో హాసిని సోమవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బాలయ్య తెలిపారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అయ్యో.. నాగలక్ష్మి.. ఇలా చేశావేంటి?
కరీంనగర్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బాగా రాయలేకపోయాననే మనస్తాపంతో కాల్ల నాగలక్ష్మి(16) బుధవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాల్ల రామయ్య – నర్సవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు నాగలక్ష్మి. మల్యాల మండలం నూకపెల్లి మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. సోమవారం మల్యాలలో బోటనీ పరీక్ష రాసింది. అయితే, పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైంది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పింది. పరీక్ష మంచిగారాసి ఉగాది పండుగకు ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలో మంగళవారం బాలిక ఇంటికి చేరుకుంది. వచ్చినప్పటి నుంచి నాగలక్ష్మి ముదావహంగా ఉంటోంది. భోజనం కూడా సరిగా చేయడంలేదు. తల్లిదండ్రులు ఆరా తీయగా, తాను పరీక్ష బాగా రాయలేకపోయానని రోదిస్తూ తెలిపింది. ఏం ఫర్వాలేదని, ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు బాలికకు సూచించారు. ఈక్రమంలో బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటి ఎదుట వాకిట్లో ముగ్గులు వేసిన నాగలక్ష్మి.. ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఆమె కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. బంధువులకు సమాచారం అందించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. గోదావరినది వైపు నాగలక్ష్మి వెళ్లిందని స్థానికులు వారికి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లి చూడగా, గోదావరి ఒడ్డున నాగలక్ష్మి చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందనే అనుమానంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాలర్లసాయంతో నీటిలో గాలించగా నాగలక్ష్మి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజు తెలిపారు. కొడుకులు లేకున్నా.. ఇద్దరు కూతుళ్లే సర్వస్వం అనుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నకూతురు మృతితో విషాదంలో మునిగారు. -
తేజశ్విని బంధువుల రాస్తారోకో
♦ ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ ♦ నలుగురు నిందితులను అరెస్ట్ చేయాలని పట్టు రేపల్లె : ఇంటర్ విద్యార్థిని బొమ్మిడి తేజశ్విని (16) మృతిపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తేజశ్విని మృతదేహానికి ప్రత్యేక వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, హత్య చేసిన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్లో బైటాయించి జోరున వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. తేజశ్వినికి జరిగిన అన్యాయం వేరొకరికి జరగకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్య చేసిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంట పాటు సాగిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్థంభించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎం.ఆనందరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక వైద్యులను మధ్యాహ్నానికల్లా రప్పించి తేజశ్విని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందిస్తామని, నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యులు సాయంత్రం వరకు రాకపోవటంతో తేజశ్విని కుటుంబ సభ్యులు, బంధువులు మరోమారు ఆందోళణకు సిద్ధమవుతుండటంతో పోలీసులు వారితో చర్చించారు. ఆదివారం ఉదయం వైద్యులు వస్తున్నారని, 9 గంటలకు మృతదేహాన్ని బంధువులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీంతో బంధువులు శాంతించి ఆందోళనను విరమించారు.