International researchers
-
ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు
పరిపరి శోధన నిండా ముళ్లతో కనిపించే ఎడారి మొక్కలను ఏం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఎడారి మొక్కల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి ఎడారి మొక్కల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయని, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే, మధుమేహం, స్థూలకాయం, గుండెజబ్బులు వంటి చాలారకాల వ్యాధులు దరిచేరవని న్యూయార్క్‌కు చెందిన న్యూట్రిషన్ నిపుణురాలు షాపిరో చెబుతున్నారు. ఎడారి మొక్కల పైభాగంలో కనిపించే ముళ్లతో నిండే తొక్కలను తొలగించి, గుజ్జుతో నిండిన భాగాన్ని జ్యూస్, జామ్, సలాడ్ వంటి వంటకాల తయారీలో భేషుగ్గా ఉపయోగించుకోవచ్చని ఆమె అంటున్నారు. -
మీ గుప్పెట బలమెంతో...మీ గుండె బలమూ అంత!
ఎవరి గుండె సైజు దాదాపు వారి గుప్పెడంత పరిణామంలో అని అందరూ అంటుంటారు. ఇప్పుడు పిడికిలి బిగించే సామర్థ్యానికీ, గుండె సామర్థ్యానికీ కూడా సంబంధం ఉంటుందంటున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. మీకు పిడికిలి బిగించే శక్తి ఎక్కువగా ఉంటే మీ గుండెబలమూ అంతే ఎక్కువట. పిడికిలి బిగింపు సామర్థ్యం తగ్గుతున్న కొద్దీ గుండెజబ్బులు పెరగడం, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు పెరగడం జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా 35 నుంచి 70 ఏళ్ల వయసున్న 1,39,601 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. వారందరి చేత హ్యాండ్‌గ్రిప్ డైనమోమీటర్ ద్వారా పిడికిలి బిగింపు సామర్థ్యాన్ని పరీక్షించి చూశారు. పిడికిలి బిగించే సామర్థ్యం తగ్గుతున్న క్రమంలో ప్రతి ఐదు కిలోల తగ్గుదలతో గుండెజబ్బులు పెరిగే అవకాశం 16 శాతం పెరుగుతుంది. అలాగే గుప్పిట బిగింపు శక్తి సన్నగిల్లే క్రమంలో పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశాలు 9 శాతం పెరుగుతాయి. ఇక గుండెపోటు వచ్చే అవకాశాలు 7 శాతం పెరుగుతాయి. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘ద ల్యాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో చోటు చేసుకున్నాయి.