గీతలో అర్థం చేసుకున్నది ఆచరణలో...
శ్రీ కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడా? లేక యుద్ధం చేయలేనని గాండీవాన్ని దించేసిన అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేశాడా? లేక నీ వెనుక నేనున్నాను... ధైర్యంగా యుద్ధం చేయమని ప్రోత్సహించాడా? ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రశ్నలకు అరటిపండు వలిచినంత సులువుగా సమాధానాలు చెబుతారు అరవిందరావు. ఒకప్పుడు రాష్ర్ట్రంలోని అరాచక శక్తుల ఆటకట్టించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారికి ఇప్పుడు ఇటువంటి ధర్మసూక్ష్మాలను బోధించగలగడం ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం...
నేను అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ దేవుడిని పూజించలేదు. అయితే అప్పట్లో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏమున్నదనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్న కాలంలో కొందరిని ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఒక తీవ్రవాది... ‘మాకు మీలాగ వందలాది దేవుళ్లుండరు, పిచ్చి బొమ్మలేవీ ఉండవు. ఒకే దైవం...’ అంటూ హేళనగా మాట్లాడాడు. అలాంటివే ఇంకొన్ని సంఘటనలు జరిగాక ఇంతకీ ఏ మతం ఏం చెబుతోందనే జిజ్ఞాస కొద్దీ బైబిల్, ఖురాన్, భగవద్గీత చదివాను. బైబిల్, ఖురాన్లు అర్థమైనంత సరళంగా భగవద్గీత అర్థం కాలేదు.
దాంతో మహా మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడిని ఆశ్రయించి సందేహాలు తీర్చుకున్నాను. ఏతావాతా నాకు తెలిసిందేమిటంటే... గీతలో కృష్ణుడు ఉపనిషత్తులు, వేదాంతాల సారాన్ని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయే తప్ప మూఢవిశ్వాసాలవైపు మళ్లించేలా ఉండవు. అందుకే నేను భగవద్గీతను మరింత బాగా చదివి, ఆకళింపు చేసుకున్నాను. నేను తెలుసుకున్నదానిని పదిమందికీ అర్థమయేలా నా మాటల ద్వారా... రాతల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పటి విధులకు - అనంతరం విశ్రాంత జీవనంలో ఇప్పుడు నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలకు ఎక్కడా పొంతన కనిపించినట్లు అనిపించదు. కానీ భగవద్గీత సారాన్ని గ్రహించడం వల్లనే విధ్యుక్తధర్మాన్ని ఆచరించడం సులువైందని నేను నమ్ముతాను.
ప్రణాళిక ఏమీ లేదు... అంతా ఆచరణలోనే!
నిజానికి విశ్రాంత జీవితాన్ని ఆధ్యాత్మికపథంలో గడపాలనే ఆలోచన కానీ, అందుకు ఓ ప్రణాళిక కానీ అప్పట్లో ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎప్పుడు కలిగిన ఆలోచనలను అప్పుడు ఆచరణలో పెట్టడం వల్లనే నా ప్రయాణం ఇప్పుడిలాంటి ప్రణాళికాబద్ధమైన దారిలోకి మళ్లింది.
అమెరికాలో అయోమయాన్ని చూశాక!
మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వారి దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులలో నెలకొన్న అయోమయమే ఇలా పుస్తకాలు రాయించింది. అక్కడ స్కూళ్లలో పిల్లలకు అన్ని మతాల గురించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. అలా చెప్పేటప్పుడు హిందూమతం గురించి చెట్లను, పుట్టలను, విగ్రహాలను పూజిస్తారంటూ కొంత హేళనగా చెప్పడాన్ని గమనించాను. అది విన్న పిల్లలు పలు సందేహాలతో ఇంటికొచ్చి తల్లితండ్రులను అడుగుతుంటారు. వాటికి సమాధానం చెప్పలేక చాలామంది తల్లితండ్రులు నీళ్లు నములుతుంటారు. అప్పుడు హిందూమతం ఏమి చెప్తోందని విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాశాను.
భగవద్గీతను ఎంతోమంది రాశారు. వాటిలో ఐదారు వెర్షన్లు చదివాను. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాల్సిన అవసరం ఉందనిపించి నేనూ రాశాను. నలభైలలో మొదలైన జిజ్ఞాస నన్ను సంస్కృతం చదివేలా చేసింది. ఎం.ఎ, పిహెచ్డి చేశాను. రిటైరైన తర్వాత నా పిహెచ్డి గ్రంథం ‘ఉపనిషత్తుల్లోని జ్ఞానం గురించి వివేచన’ను పుస్తకరూపంలో తెచ్చాను. ఇప్పటివరకూ నేను మొత్తం ఏడు పుస్తకాలు రాస్తే, వాటిలో ఐదు విడుదలయ్యాయి. మరో రెండు ప్రచురణ దశలో ఉన్నాయి. అలాగే ఉపనిషత్తుల సారంపై నేను చెబుతున్న పాఠాలు అద్వైత అకాడమీ వెబ్సైట్లో ప్రసారమవుతున్నాయి.
ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయ్యే రెండవ జీవితాన్ని చాలామంది నిరర్థకంగా గడుతుపుంటారు. అయితే ఈ దశను ప్రయోజనకరంగా మార్చుకోవడానికి నలభైలలోనే నాందిపడితే మంచిది. సమాజానికి ఏం చేయగలమనే వివేచనతో ఒక ఆలోచన మొదలైతే ఉద్యోగవిరమణ తర్వాత జీవితం నిరర్థకంగా మారకుండా సార్థకమవుతుంది’’ అంటున్న ఈ అరవిందుడి సూచన రేపో మాపో రిటైరవబోయే వారే కాదు... ఇప్పుడిప్పుడే ఉద్యోగజీవనంలోకి ప్రవేశిస్తున్న వారు కూడా ఆలోచించదగ్గది... ఆచరించ వలసినదీ!
ఆయన మార్గమే నన్నూ నడిపిస్తోంది
ఇప్పటి పిల్లల పాఠ్యగ్రంథాల్లో నీతికథలు ఉండడం లేదు. కనీసం తల్లితండ్రులైనా పిల్లలకు ఇంట్లో సుమతీశతకం, వేమన శతకం వంటివి నేర్పించడం లేదు. ఇది సరైన ధోరణి కాదని ఆయన వాపోతుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ మార్గాన్ని తీసుకోవడం వల్ల నాకు కూడా సౌకర్యంగానే ఉంది. ఉదయం వ్యాయామం నుంచి రాత్రి వరకు మా దైనందిన జీవితం ఓ క్రమపద్ధతిలో నడుస్తోంది.
- రమ, అరవిందరావు సతీమణి
గీతను అర్థం చేసుకుంటే పరిస్థితిని చక్కదిద్దే మెలకువ, స్వీయనియంత్రణ వస్తుంది. ఉద్యోగి, రాజకీయవేత్త, పరిపాలనాధికారి... ఎవరైనా సరే తమ రంగంలో రాణించడానికి దోహదం చేస్తుంది. భగవద్గీత చదువుతూ కాల్పులు, ఎన్కౌంటర్లు ఎలా చేస్తారని కొందరు సిద్ధాంతకర్తలు నన్ను విమర్శించారు. గీత చదవడం అంటే... ఆ వ్యక్తి అన్నీ వదులుకుని ఎవరు తమ మీద దాడి చేసినా చేయించుకోవాలని కాదు. తన కర్తవ్యాన్ని మరింత కచ్చితంగా నిర్వహించగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడని అర్థం.
- కె. అరవిందరావు, విశ్రాంత పోలీసు డెరైక్టర్ జనరల్
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి