‘దుమ్ముగూడెం’ ఇక రాష్ట్రానికే పరిమితం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిన ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టుపై మున్ముందు ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి చర్చలు జరపరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రయోజనాలను రాష్ట్రంవరకే పరిమితం చేసేలా డిజైన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో జరిగిన కాల్వల పనులను ఇతర ప్రాజెక్టులతో అనుసంధానించే మార్గాలను అన్వేషించి, సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశం చేసింది.
రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు ఏపీకి వెళ్లడంతో ప్రాజెక్టులోని కీలక హెడ్‌వర్క్ పనులన్నీ ఏపీకి వెళ్లిపోయాయి. కెనాల్ల పనులు మాత్రం తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగాయి. ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయాన్ని రూ.1824 కోట్లుగా నిర్ణయించగా అందులో ఇప్పటికే రూ.1,047 కోట్ల పనులు పూర్తయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణలో జరగాల్సిన పనుల విలువ రూ.1203 కోట్లుగా ఉండగా, ఇప్పటివరకు రూ.696.49 కోట్ల పనులు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
చర్చలు వద్దన్న సీఎం: కాగా ఇటీవల దుమ్ముగూడెం ప్రాజెక్టుపై వరుసగా 2 రోజులు సమీక్ష జరిపిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఇందిరాసాగర్ పనులపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇరు రాష్ట్రాల పరిధిలోని ఆయకట్టు లెక్కన తెలంగాణ రూ. 382 కోట్లు, ఏపీ రూ. 233 కోట్ల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుందని లెక్కలు వేశారు. ఈ పనుల ఖర్చుకు సంబంధించి గతేడాది ఆగస్టు నెలలోనే నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగినా ఇంతవరకూ పనులు చేసే విషయమై ఏపీ ఎలాంటి స్పష్టతనివ్వలేద న్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
ఇందిరాసాగర్ మిగులు పనులను ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పూర్తి చేసుకునేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదని, ఈ దృష్ట్యా చర్చలు, ఒప్పందాల అంశాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు పరిమితం చేసేలా పనులను ఏవిధంగా వాడుకోవచ్చో అంచనాకు రావాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందిరాసాగర్ కింది ఆయకట్టును రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానించడమా? లేక రోళ్లపాడు వద్ద 11 టీఎంసీలు, బయ్యారం వద్ద 6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు అనుసంధానించాలా అనే అంశాలపై సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది.