‘మహా’ ఒప్పందాలపై రేపు తొలి భేటీ | Hyderabad Coming Maharashtra officials | Sakshi
Sakshi News home page

‘మహా’ ఒప్పందాలపై రేపు తొలి భేటీ

Mar 18 2016 1:58 AM | Updated on Sep 3 2017 7:59 PM

తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లే దిశగా

హైదరాబాద్ రానున్న మహారాష్ట్ర అధికారులు
అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు, మేడిగడ్డ ఎత్తుపైనే ప్రధాన చర్చ

 
హైదరాబాద్: తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లే దిశగా అధికారుల స్థాయిలో తొలి సమన్వయ కమిటీ భేటీ శనివారం హైదరాబాద్‌లో జరుగనుంది. ప్రాణహిత ప్రాజెక్టు (తుమ్మిడిహెట్టి బ్యారేజీ), కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజీ)లపై చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో మొదటి దశ చర్చలు జరుగనున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై ఇప్పటికే మహారాష్ట్ర నుంచి సానుకూలత లభించగా, మేడిగడ్డ ఎత్తుపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపైనే ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీ ఎత్తుపైనే చర్చ ఉండనుంది. ప్రభుత్వం మేడిగడ్డ వద్ద 103 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ ఎత్తులో 3వేల ఎకరాల వరకు ముంపు ఉంటుందని తేల్చారు. దీనిపై స్వయంగా సర్వే చేయించిన మహారాష్ట్ర ముంపును నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ సర్వే కొలిక్కి వచ్చినా ముంపు ఎంత తేలిందన్నది ఇంకా తెలియలేదు.

తెలంగాణ చెప్పినట్లుగా 103 మీటర్ల ఎత్తుకే ఒప్పుకుంటారా? లేక 102, 101 మీటర్లకు తగ్గించాలంటారా? తెలియాల్సి ఉంది. అయితే ముంపును దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరం చెబితే దాన్ని ఒకట్రెండు మీటర్లకు తగ్గించేందుకు తెలంగాణ ఇప్పటికే సమ్మతి తెలిపింది. అయితే మేడిగడ్డ ద్వారా మహారాష్ట్రలో సుమారు 50వేల ఎకరాలకు నీరందిస్తున్నందున 103 మీటర్ల ఎత్తును ఒప్పుకోవాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అంతర్రాష్ట్ర బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement