హైదరాబాద్లో ఇంటెక్స్ ప్లాంట్
• సుమారు 500 కోట్ల పెట్టుబడి
• మొబైల్స్, ఎల్ఈడీల తయారీ
• కంపెనీ డైరెక్టర్ నిధి మార్కండేయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న ఇంటెక్స్ టెక్నాలజీస్ దక్షిణాదిన తొలి ప్లాంటును హైదరాబాద్ వద్ద నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో తొలి విడత చర్చలు జరిపింది. ప్రతిపాదిత ప్లాంటుకు రూ.500 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుందని ఇంటెక్స్ కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ–యాక్సెసరీస్ బిజినెస్ హెడ్ నిధి మార్కండేయ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలుత మొబైళ్లు, ఎల్ఈడీ టీవీలను ఈ ప్లాంటులో తయారు చేస్తారు. ఆ తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర ఉత్పత్తులను దశలవారీగా జోడిస్తారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కంపెనీ 6వ ప్లాంటు సైతం ఉత్తరాదికే పరిమితమైంది. హైదరాబాద్ ప్లాంటు నుంచే దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తారు.
600 మందికిపైగా ఉపాధి..
ప్లాంటు ఏర్పాటైతే 600 మందికిపైగా ఉపాధి లభిస్తుందని నిధి మార్కండేయ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారీ స్థాయిలోనే దీనిని స్థాపిస్తామన్నారు. నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంతో మలి దశ చర్చలకు కాస్త బ్రేక్ పడిందని అన్నారు. దక్షిణాది ప్లాంటు హైదరాబాద్లోనే నెలకొల్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్అండ్డీ విభాగం సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఇంటెక్స్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి 26 శాతం ఆదాయం సమకూరుతోంది. కాగా, నోట్ల రద్దు తర్వాత అమ్మకాలు 45 శాతం దాకా తగ్గాయని ఆమె చెప్పారు. ఎల్ఈడీలకు కొరత ఏర్పడిందని, ఇంటర్నల్ మెమరీ కార్డుల ధర పెరిగినప్పటికీ ధరలు పెంచే పరిస్థితి లేదన్నారు. ఇంటెక్స్ ఆదాయంలో 25 శాతమున్న కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ–యాక్సెసరీస్ వాటాను మూడేళ్లలో 50శాతానికి చేరుస్తామన్నారు.