intrusion
-
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?
న్యూఢిల్లీ: ఛాయ్ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు. ‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్‌లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్ నుంచి జంపేరీ రిట్జ్ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు ట్వీట్‌చేశారు. 1. తూర్పు లద్దాఖ్‌లో 2020 జూన్ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ? 2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ? 3. కేబినెట్ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు? -
పారిస్‌లోని ఐఏఎఫ్ ఆఫీస్‌లో చొరబాటు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కార్యాలయంలోకి ఆదివారం కొందరు దుండగులు చొరబడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇది గూఢచారుల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి అటు ఐఏఎఫ్ కానీ, ఇటు రక్షణ మంత్రిత్వ శాఖగానీ ఏ ప్రకటనా చేయలేదు. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలుచేస్తుండటం తెల్సిందే. ఆ విమానాల తయారీని ఈ ఆఫీస్ పర్యవేక్షిస్తోంది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలను దొంగిలించేందుకే దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించారనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారు. -
చొరబాటు కుట్ర భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కేరన్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటి చొచ్చుకొచ్చేందుకు పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాల్ని మంగళవారం భారత సైన్యం తిప్పికొట్టింది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) భారత ఆర్మీ పోస్టుల సమీపానికి రాగా సైన్యం దీటుగా బదులివ్వడంతో వారి చొరబాటు యత్నం విఫలమైంది. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడగా.. భారత ఆర్మీ గట్టిగా సమాధానమిచ్చింది. ‘దాదాపు ఏడెనిమిది మందితో కూడిన సాయుధ చొరబాటుదారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు నుంచి చొరబాటుకు ప్రయత్నించారు. కుప్వారాలోని కేరన్ సెక్టార్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారు దాదాపు భారత పోస్టుల సమీపానికి వచ్చి కాల్పులు జరిపారు. పాక్ కాల్పుల్ని మేం గట్టిగా తిప్పికొట్టాం. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో భారత సైనికుల తలల్ని నరికారంటూ వచ్చిన పుకార్లను ఆయన తోసిపుచ్చారు. ఈ చొరబాట్లు, కాల్పులు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) పనేనని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉండే బీఏటీ.. తరచూ సరిహద్దుల వెంట భారత సైన్యంపై దాడులకు పాల్పడుతుంటుంది. -
లడఖ్‌లో చైనా చొరబాటు యత్నం
లడఖ్: భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చొరబాటు యత్నాల్ని భారత్ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరగడంతో ఇరువైపులా కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. భారత్ వైపు సరస్సు ఒడ్డున ఉన్న ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతాల్లో ఉదయం 6–9 గంటల మధ్య చైనా చొరబాటుకు ప్రయత్నించిందని, అయితే భారత బలగాల అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వారు తెలిపారు. అనంతరం చైనా బలగాలు మానవహారంగా ఏర్పడి రాళ్ల దాడికి పాల్పడ్డాయని భారత సరిహద్దు దళం కూడా దీటుగా బదులిచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. -
సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మృతి
అమృత్‌సర్ః ఇండో-పాక్ సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు చొరబాటుదార్లు సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ ఎఫ్ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో జరగిన కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. అక్రమంగా భారత్ లో చొరబడేందుకు ప్రయత్నించిన వారిని అమృత్ సర్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎదుర్కొంది. దర్యా ముసా గ్రామ సమీపంలో చొరబాట్లకు యత్నించిన ముగ్గురిని సైన్యం ఎన్ కౌంటర్ చేసింది. బీఎస్ఎఫ్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడమే కాక, అగ్నిమాపక సైనికులపై ప్రతీకారంగా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన చొరబాటుదార్లు ఎదురు కాల్పుల్లో మరణించినట్లు బీఎస్ ఎఫ్ వెల్లడించింది. అయితే కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదార్లు మరణించగా, వారివద్దనుంచీ 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, ఒకరు తప్పించుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. తప్పించుకున్న వ్యక్తికోసం గాలింపులు జరుపుతున్నామని, చొరబాటుదార్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని బీఎస్ ఎఫ్ తెలిపింది.