![Defence minister Rajnath Singh on Saturday praised the Indian Army - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/18/R-1_0.jpg.webp?itok=b3wRFsqm)
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి.
సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు.
‘ గాల్వాన్, తవాంగ్‌లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్‌టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి.
1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment