super power country
-
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
రణక్షేత్రంలో రష్యా.. ఉరిమి చూస్తున్న అమెరికా.. మరి ఇండియా ఏం చేయాలి?
సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా భారత్ సూపర్ పవర్ దేశంగా మారాలని లేదంటూ పొరుగున్న ఉన్న దేశాలతో ఏనాటికైనా ముప్పే అంటూ హెచ్చరిస్తున్నాడు జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వేంబు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు ట్విటర్ వేదికగా చేశారు. ప్రస్తుతం కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. నాటో దళాలు తమ పక్కన చేరుతున్నాయంటూ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సోవియట్ చర్యను తప్పు పడుతూ ఆర్థిక ఆంక్షలు విధించాయి అమెరికా , ఈయూ కూటమి దేశాలు. మన పొరుగు దేశాలపైన చైనా, పాకిస్తాన్‌లు రష్యాకు మద్దతుగా నిలిచాయి. ఇండియా తటస్థ వైఖరి తీసుకుంది. అయితే ఈ తటస్థ వైఖరి ఎంతో కాలం మేలు చేయదంటున్నారు శ్రీధర్వేంబు. టెక్నాలజీ, ఆర్థికం, మిలిటరీ పరంగా ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యాలు వరుసగా మూడు సూపర్ పవర్ దేశాలు ఉన్నాయన్నారు. ఏలాంటి పరిస్థితుల్లోనూ ఈ సూపర్ పవర్ దేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవన్నారు. అదే జరిగితే ఊహించని నష్టం జరగుతుందన్నారు. అందుకే సూపర్ పవర్ దేశాలు పరస్పరం దాడి చేసుకోవని తెలిపారు. మూడు సూపర్ పవర్ దేశాల్లో ఒకటైన చైనా తైవాన్ ఆక్రమణకు ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. రేపటి రోజున చైనా అనున్నంత పని చేసినా ఆ దేశాన్ని ఏ శక్తి అడ్డుకోదన్నారు. చైనాకు పొరుగున్న ఉన్నందున ఎప్పటికైనా భారత్‌కు చైనా ముప్పే అన్నారు. చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ధీటుగా ఎదుర్కొవాలంటే మిలిటరీ, ఫైనాన్స్, టెక్నాలజీ సెకార్లలో ఇండియా సూపర్ పవర్‌గా మారాల్సిందే అని సూచించారు. చైనాతో ముప్పు తలెత్తితే రష్యా, అమెరికాల నుంచి సాయం అందుతుందన్న నమ్మకం లేదన్నారు. సూపర్ పవర్ దేశాలు ఎప్పుడూ మరో దేశం వెనుక ఉండాలని కోరుకోవన్నారు. ఉక్రెయిన్, తైవాన్ లాంటి దుస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే భారత్ తన శక్తిని తాను నమ్ముకోవాలన్నారు. పరిస్తితులకు తగ్గట్టుగా శక్తివంతగా మారాలని దానికి కచ్చితమైన ప్రణాళిక అవసరమన్నారు. -
సూపర్ పవర్ కంట్రీగా భారత్
అద్దంకి : సూర్యుని వెలుగులు పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా విరజిమ్మే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీగా నిలుస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకుడు డాక్టర్ ఎల్ గిరిబాబు అన్నారు. స్థానిక కట్టారామకోటేశ్వరావు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘రీసెంట్ టెక్నాలజీస్ ఆఫ్ కెమిస్ట్రీ’ అనే అంశంపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన తను ఆవిష్కరించిన ‘గ్రీన్ సోలార్ పవర్ ప్రాజెక్టు’ ఉపయోగాల గురించి వీడియో చిత్రాల ద్వారా తెలియజేశారు. ఈ సదస్సులో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ నుంచి వచ్చిన 200 మంది తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తక్కువ ధరలో నాణ్యమైన విద్యుత్‌ను తయారు చేసుకునే వాటిల్లో ‘ఆర్గానిక్ సోలార్ సెల్’ పద్ధతి ఒకటన్నారు. ఈ పద్ధతిలో సిలికాన్ ప్యానల్స్‌కు బదులు తక్కువ ధరలో లభించే పదార్థాలతో నాణ్యమైన పరికరాలను తయారు చేయడం, అదీ నానో టెక్నాలజీలో తయారు చేయడం విశేషమని చెప్పారు. ఈ సోలార్ ప్యానెల్ ట్యూబ్‌లైట్ వెలుగు నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. అనంతరం కాలుష్యరహిత ఉత్ప్రేరకాల తయారీపై డాక్టర్ ఎన్ లింగయ్య, చక్కెరల కర్బన లోహశక్తి గురించి రాజీవ్ త్రివేది, పైరబోలిక్ ఉత్పన్నాల తయారీ గురించి ఐఐసీటీ హైదరాబాదుకు చెందిన డాక్టర్ రవి, గ్రీన్ సాల్వెంట్స్ గురించి ఐఐటీ చెన్నైకి చెందిన డాక్టర్ రమేష్, నానో పెస్టిసైడ్స్ గురించి గీతం యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్వీఎస్ వేణుగోపాల్ సవివరంగా విశదీకరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. పాల్గొన్న వారికి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు కళాశాల ప్రిన్సిపాల్ విల్సన్ రాజు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జీ రాజేశ్వరి, కళాశాల పీడీ ధనుంజయ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.