యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది.