‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్ ఆరంభపు సీజన్లోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత శ్రీశాంత్ చెంపను భజ్జీ చెల్లుమనిపించాడు. అయితే ఆ తర్వాత వెంటనే శ్రీశాంత్‌కు భజ్జీ క్షమాపణలు చెప్పడం, అదే రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడంతో దానికి ముగింపు పలకాలనుకున్నారు. కాగా, ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరైన క్రమంలో భజ్జీపై ఎటువంటి నిషేధం విధించవద్దని శ్రీశాంత్ వేడుకున్నాడట. (‘టీమిండియా.. పేస్ బౌలింగ్‌తో భయపెడితేనే’)
ఈ విషయాన్ని శ్రీశాంత్ తాజాగా వెల్లడించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై నిషేధాన్ని ముగించుకోనున్న శ్రీశాంత్.. తన రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. తాజాగా క్రికెట్ ఎడిక్టర్‌తో మాట్లాడిన శ్రీశాంత్.. భజ్జీతో వివాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్(సచిన్ పాజీ) ఉన్న జట్టులోనే నేను, భజ్జీ ఉన్నాం. నా చెంపపై భజ్జీ కొట్టిన తర్వాత సచిన్ మా మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు సచిన్‌కు థాంక్స్ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్ చేశాం. కానీ మీడియా మాత్రం మా మధ్య జరిగిన గొడవను పెద్దదిగా చేసి చూపించింది. దాంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. నానావతీ సర్ నన్ను విచారించారు. వీడియో క్లిప్పింగ్ చూపించి ఏమి జరిగిందని అడిగారు. నేను ఏడుస్తూ భజ్జీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నాను. మా మధ్య వివాదం ముగిసిందని చెప్పా. మేమిద్దరం కలిసే ఆడతామని తెలిపా. మా నుంచి భజ్జీని వేరు చేయొద్దని విన్నవించా. అతనొక మ్యాచ్ విన్నర్. భారత్ తరఫున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లలో భజ్జీ ఒకడు. నాకు భజ్జీ సోదర సమానుడు. ఆ వివాదాన్ని పెద్దది చేయొద్దని చెప్పా. అది ముగిసిన అధ్యాయమని విచారణలో తెలిపా. భజ్జీ ఎప్పుడూ ఒక లెజెండ్‌గానే ఉంటాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..)