IPS training
-
ఐపీఎస్ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్పీఏ) ఐపీఎస్ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ ఆర్) బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్ కావడంతో ‘అమృత్కాల్ బ్యాచ్’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్ డైరెక్టర్ ఎన్.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ... ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సైబర్ క్రైమ్ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్ ట్రైనింగ్ మొదలు కానుంది. మాక్ కోర్టులు సైతం నిర్వహిస్తూ... సాధారణంగా ఐపీఎస్ అధికారులకు ఎఫ్ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో మాక్ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు. ఐఆర్ఎస్ నుంచి ఐపీఎస్‌కు.. అల్వాల్ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్ కావడం సంతోషంగా ఉంది. – ఎస్.చిత్తరంజన్, ఐపీఎస్ ట్రైనీ తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్–కానిస్టేబుల్. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం. – చేతన్ పందేరి, ఐపీఎస్ ట్రైనీ -
అట్టహాసంగా ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్.. పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: హైదబాద్‌లోని వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమిత్ షా ఆ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. "ట్రైనీ ఐపీఎస్‌లకు అభినందనలు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాదు టెక్నీలజీతో కూడిన పోలీస్ మేనేజ్మెంట్ మరింతగా అందుబాటులోకి వస్తుంది కూడా. అలాగే 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టాం. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నా. ఐతే శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడుకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల వరకు ఆ అధికారం ఉంటుంది. రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తించుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమాస్యలు ఉండేవి. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశాం. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు." అని అమిత్ షా నొక్కి చెప్పారు. కాగా, ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్ ఔట్‌డోర్ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్, మెడికల్, సీఏ స్టూడెంట్స్ అధికంగా ఉండటం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన ప్రోబేషనరీ ఐపీఎస్‌లకు ట్రోఫీలు అందజేస్తారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల సమయంలో అధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. (చదవండి: ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!) -
ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొననున్నారు. కాగా ఈనెల 11న నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. ఈ పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శెహన్‌షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల శిక్షణ పందిన శెహన్‌షా.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన సీఐఎస్ఎఫ్, ఐఆర్పీఎఫ్లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా తర్వాత ఇదే కాగా కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో ఎన్పీఏ 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 74వ బ్యాచ్‌లో 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారన్నారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీ శిక్షణార్థులున్నారు. 37 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా 46 వారాలపాటు కఠోర శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్ట్‌లు కలిపి 17 అంశాలపై ట్రైనింగ్ పొందారు. ఈనెల 11న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌తో 46 వారాల శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ మరికొన్ని వారాల శిక్షణ పొందిన తర్వాత వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడినుండి వాళ్ళను నియమించిన జిల్లాలలోకి వెళ్తారు. విధి నిర్వహణలో ఐపీఎస్‌లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు మెంటర్స్ ఉంటారు.’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు నూతన ఐపీఎస్‌లు తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు నూతన ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు కేటాయించిన అయిదుగురిలో అవినాష్ కుమార్, శేషాద్రిని రెడ్డి, మహేష్ బాబా సాహేబ్, అంకిత్ శంకేశ్వర్, శివం ఉపాధ్యాయ ఉన్నారు. ఏపీకి కేటాయించిన ఇద్దరిలో పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్లు ఉన్నారు. -
చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు
సాక్షి, హైదరాబాద్: నిజమైన ప్రజాస్వామ్యం అంటే న్యాయపరమైన సంయమనం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధపాలన ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఈ విధంగా జరిగినప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థ నిజమైన మనుగడ సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ‘ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వ్యక్తి పాలనకు, చట్టబద్ధ పాలనకు తేడా ఉంటుందని, చట్టపాలనకు కచ్చితంగా ప్రభుత్వ విధానాలతో పెనవేసుకుని ఉండనవసరం లేదని, ఈ తేడాను విధి నిర్వహణలో గుర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందన్నారు. చట్టబద్ధ పాలనకు న్యాయసమీక్ష మూలాధారం అవుతుందన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని, ఇలాంటి సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటినీ అధిగమించినప్పుడే సమర్ధత బయటపడుతుందని యువ ఐపీఎస్ అధికారులకు సూచించారు. మాతృభూమికి సేవలు అందించేందుకు కదనరంగంలోకి దిగే సమయంలో ఎదురయ్యే సవాళ్లను చట్టబద్ధంగానే అధిరోహించాలన్నారు. మీకున్న అధికారాలను నీతి, నిజాయితీతో సహేతుకంగా వినియోగించుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంకోసం సరిహద్దుల్లోనూ, ఇతర చోట్ల ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికుల సేవలకూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసులకు పెద్దగా తేడా లేదని, రెండు త్యాగాలూ వెలకట్టలేనివే అని జస్టిస్ రంజన్ గొగోయ్ కొనియాడారు. పోలీస్ అకాడమీ 1983లో ఏర్పాటైందని, ఆ తర్వాత ఏడాది ఆనాటి జమ్మూకాశ్మీర్ గవర్నర్ బీకే నెహ్రూ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఇదే వేదిక నుంచి ప్రసంగించారని అకాడమీ డైరెక్ట్టర్ డాక్టర్ అభయ్ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన తొలి దశ శిక్షణలో ఉన్న 156 మంది ఐపీఎస్‌లు హాజరయ్యారు. -
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : శిక్షణ పూర్తి చేసుకున్న 141 మంది ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ పరేడ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ధోవల్ హాజరయ్యారు. ఈ 67వ బ్యాచ్‌లో మొత్తం 152 మంది శిక్షణ తీసుకోగా, వీరిలో 141 మంది భారతీయులు, మరో 15మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన వారు. ఈసారి బ్యాచ్‌లో ఏకంగా 28మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. విద్యార్హత పరంగా చూస్తే.. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న 80 మంది, 19మంది ఎంబీబీఎస్‌లు ఈసారి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. ట్రైనింగ్ అయిన వారిలో ఏపీ, తెలంగాణలలో ఆరుగురు బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అపూర్వ.. సొంత రాష్ట్రం తెలంగాణలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఐపీఎస్ ట్రైనీల కొత్త కోర్సు ప్రారంభించిన కేంద్రమంత్రి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల శిక్షణలో భాగంగా 3వ కౌంటర్ టైజం కోర్సును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ భద్రతతో పాటు అంతర్గత రక్షణ కూడా అత్యంత ఆవశ్యకరమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్‌లో కౌంటర్ టైజం అత్యంత ప్రాధాన్యమున్న అంశమని వివరించారు. అంతర్గత భద్రత విషయంలో ఐపీఎస్‌ల బాధ్యత ఎంతో ఉందని చెప్పారు. కాగా, కొత్తగా నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్‌ను ఆయన ప్రారంభించారు.