Irrigation schemes
-
పులివెందులపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతంలో చేసిన శంకుస్థాపనలు, పనుల పురోగతి, బడ్జెట్ కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రబల్లి, గండికోట రిజర్వాయర్ నుంచి 40 రోజుల్లో పార్నపల్లి, పైడిపాలెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్‌కు పరిపాలనా ఆమోదం తెలిపారు. అనంతరం జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ స్కీమ్, అలవలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల పురోగతి గురించి అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. (విద్యార్థుల అభీష్టమే ఫైనల్) చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయడం కోసం రూ. 261.90 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులపై చర్చించారు. 154 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొగమేరు వంకపై ఫ్లడ్‌బ్యాంక్స్ మరియు చెక్‌డ్యామ్‌ల ఆమోదంపైనా మాట్లాడారు. పులివెందులలో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం, వేంపల్లి యుజిడి, సింహాద్రిపురం డ్రైనేజ్ సిస్టమ్, ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్ట్ రోడ్ పనులు, పులివెందుల మోడల్ టౌన్ ప్రపోజల్స్, న్యూ బస్ స్టేషన్, మినీ సెక్రటేరియట్, పులివెందుల మెడికల్ కాలేజి ఏర్పాటు, వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజి, వేంపల్లి ఉర్దూ జూనియర్ కాలేజి, నాడు నేడు స్కూల్స్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఏపీ కార్ల్ భూముల వినియోగం గురించి చర్చలో ప్రస్తావించారు. పులివెందుల క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైనా దృష్టి సారించారు. ఈ భేటీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పడా ప్రత్యేక అధికారి అనీల్ కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. (ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా) -
భారం సర్కారుదే
♦ ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం ♦ కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. నీటి పారుదల శాఖకు ప్రతినెలా రూ.2,100 కోట్లు ♦ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న రైతులను చంద్రబాబు రాచిరంపాన పెట్టారు ♦ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ఎత్తిపోతలు.. శరవేగంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించాలని అధికారులకు సూచన ♦ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరుతామన్నారు. గురువారం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకోవడం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని.. అందులో ప్రతి నెలా రూ.2,100 కోట్ల చొప్పున నీటి పారుదల శాఖకు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం రాచిరంపాన పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారని.. అలాంటి పాలకులను తిరస్కరించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు సాగునీరు అందించడం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, దీనికి జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలి తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఏటా 4,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా.. వెయ్యి టీఎంసీలలోపే నీటిని వాడుకోగలమని, మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్‌కే వెళుతుందని చెప్పారు. సముద్రంలోకి వృథాగా వెళుతున్న నీటిని వినియోగించుకునేలా ఏపీ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుతో 320 మెగావాట్ల విద్యుత్ ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత బ్యారేజీకి 200 మీటర్ల కింద మరింత ఎత్తుగా బ్యారేజీ నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చేలా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. దానివల్ల దాదాపు 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండటంతో పాటు.. దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని, ఎలాంటి ముంపు లేకుండా ఆ నీటిని వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ డిజైన్ వల్ల దాదాపు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో జలాలు లేకున్నా... ఈ ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లా వ్యవసాయానికి ఢోకా ఉండని పరిస్థితి తేవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శరవేగంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనం చేకూరుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు అమర్పాల్సింగ్, రామకృష్ణారావు, రజనీశ్ చౌహాన్‌లతో ఇదే సమీక్షలో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు మేడిగడ్డ నిర్మాణ మెథడాలజీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 నెలల సమయంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను అందులో పేర్కొన్నారు. బ్యారేజీతో పాటు నదికి ఇరువైపులా మట్టికట్ట కట్టే ప్రాంతాలను కూడా ఖరారు చేశారు. బ్యారేజీ పూర్తయ్యే కన్నా ముందే పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయాలని ఈ సందర్భంగా వారికి కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీ్‌శ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కేటాయింపులేవీ!
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. విద్యుత్, వ్యవసాయం, పారిశ్రామిక, విద్యా, వైద్య, రహదారులకు ప్రయోజనం కలిగించే ప్రత్యేక ప్రయత్నం జరగకపోగా, మెడికల్ కళాశాలకు మళ్లీ మెండిచెయ్యే చూపారు. విద్యుత్, వ్యవసాయం, సాగు నీటి పథకాలకు భారీగా కేటాయింపులు జరుగుతాయని భావించినా, చివరకు నిరాశే మిగిలింది. ముఖ్యమైన ప్రాజెక్టులకూ మేలు చేకూరలేదు. ⇒ ఇందూరుకు అంతగా దక్కని ప్రాధాన్యం ⇒ ‘ప్రాణహిత-చేవెళ్ల’కు రూ.1,515 కోట్లు ⇒ నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.89.50 కోట్లు ⇒ శ్రీరాంసాగర్ వరదకాల్వకు రూ.747 కోట్లు ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు తగ్గిన వాటా ⇒ విద్యుత్, వ్యవసాయంపై చిన్న చూపని విమర్శలు ⇒ రెండు పడక గదుల పక్కా ఇళ్లకు ఈసారి గ్రహణమే! ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలకూ మొండిచేయే! ⇒ ‘ఈటెల’ బడ్జెట్‌పై రాజకీయ పక్షాల అసంతృప్తి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రముఖ ప్రాజెక్టులకు కూడా నిధులు రాకపోవడం నిరాశను కలిగించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలకూ సరిగా నిధులు సమకూర్చలేదు. వ్యవసాయ రంగాని కి ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల ఆధునీకరణకు ఆశించిన నిధులు కేటాయించలేదు. 15 ఎత్తిపోతల పథకాలకు ఈసారి బడ్జెటే లేదు. నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.200 కోట్ల మేరకు అవసరం కాగా, రూ.89.50 కోట్లను కేటాయించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనా లు పెంచి ఊరట కల్పించారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్ర ణాళికేతర వ్యయంలో రూ.28.29 కోట్లు మాత్రమే కేటారుుం చారు.ఈ ఏడాది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి గ్రహ ణం పట్టినట్లే. ఈ నిధులు ఏ మూలకు ‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు ఈ సారి బడ్జెట్లో రూ.1515 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే రూ.305 కోట్లు తక్కువ. ఇక్కడ నడుస్తున్న ప్యాకేజీ 20, 21, 22 కోసం రూ.800 కోట్లు అవసరం ఉండగా, కేవలం రూ.200 కోట్లు కూడ కేటాయించలేని పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ-1, ఎస్ఆర్ఎస్పీ నిర్వహణ కోసం గతేడాది రూ.85 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.110 కోట్లు ఇచ్చిం ది. లెండి ప్రాజెక్టుకు గతంలో రూ.3 కోట్లు కేటాయించి నిధు లు ఇవ్వకపోగా వాటిని కలుపుకొని రూ.5 కోట్లకు పెంచారు. నిజాంసాగర్ ఆధునీకరణ పనుల కోసం రూ.180 కోట్ల అవసరం ఉంటే ఈసారికి రూ.89.50 కోట్లకు తగ్గిం ది. జిల్లా నుంచి కరీంనగర్‌కు విస్తరించిన ఇందిరమ్మ వరద కాల్వ నిర్మాణం కోసం గతంలో రూ.400 కోట్లు కేటాయించి రూ. 140 కోట్లే ఖర్చు చేయగా, ఈ సారి ఆ బడ్జెట్‌ను రూ. 747 కోట్లుగా ప్రకటిం చారు. రూ.10 కోట్లున్న చౌటపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలకు గతేడాది రూ. కోటి ఇచ్చిన సర్కారు ఈ సారి రూ. రెండు కోట్లు ఇచ్చింది. అలీసాగర్, గుత్పలకు రూ. రెండు కోట్లు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సింగూరు ప్రాజెక్టుకు రూ.40 కోట్ల నుంచి రూ. ఏడు కోట్లకు కుదించారు. సాగునీటి పథకాలకు అంతంతమాత్రంగానే నిధులు కేటాయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 654 చెరువుల మరమ్మతులకు మొదటి విడతగా రూ.300 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని అధికారపార్టీ నేతలు భావించగా,ఆ మేరకు నిధుల వాటా రా లే దు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు కేటాయిం చిన బడ్జెట్ ను చూస్తే జిల్లాకు అరకొ రగానే నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇందిర జలప్రభ, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం తదితర పథకాలపై పాత కేటాయింపులను ప్రభుత్వం బడ్జెట్లో వల్లె వేసి, ప్రధాన అంశాలను పక్కన బెట్టిందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రయోజనం ఏమిటో? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దులో జిల్లాకు ప్రత్యక్షంగా చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల కు కేటాయింపులు ప్రత్యక్షంగా జరగలేదంటున్నారు. లక్షల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంగా బడ్జెట్లో నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి ప్రకటించినా, జిల్లాలో సాగునీటి విధానం అభివృద్ధి చెం దాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతలు, ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల ద్వారా పంటపొలాలకు నీరందించేందుకు కాల్వలను ఆధునీకరించా ల్సి ఉంది. ఎర్రజొన్న రైతులకు చెల్లించిన రూ. 13.5 కోట్లను ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. మెడికల్ కళాశాలకు రూ. 200 కోట్లు అవసరం ఉండగా వీటి ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. 125 గజాల స్థ లంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో పేదలకు పక్కాఇళ్లు నిర్మిస్తామన్న హామీ ఉండగా, బడ్జెట్ కేటాయింపుల ప్రకారం నియోజకవర్గానికి 250 ఇండ్లకు మించి వచ్చే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పసుపు పరిశోధన కేంద్రం, చక్కె ర కర్మాగారం పునరుద్ధరణ, గల్ఫ్ బాధితుల ప్రత్యేక విభాగం, వంగడాల పరిశోధన కేంద్రాలు తదితర హామీలు నెరవేర్చే అంశాలు కనిపించలేదు. మొత్తానికి ‘ఈటెల’ బడ్జెట్‌పై రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. అంకెలగారడీగా అభివర్ణిస్తున్నారుు. జిల్లా ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. -
నిధులిస్తేనే నీళ్లు
గద్వాల : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశంపై జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మూడు భారీ ఎత్తిపోతల పథకాలతో పాటు కొత్తగా నీరందించనున్నవి, కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులకు మొత్తం 1650కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను నివేదించారు. ఈ నిధులను 2015-16 బడ్జెట్లో కేటాయించాలని కోరారు. గత బడ్జెట్లో ఐదు నెలల్లో పనులను చేపట్టేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి రూ.79 కోట్లు కేటాయించారు. భీమా ప్రాజెక్టు కు 83.50 కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 119 కోట్లు, జూరాల ప్రాజెక్టుకు 42.50 కోట్లు, ఆర్డీఎస్కు 02.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు 25 కోట్లు కేటాయించారు. ఇలా ఆరు ప్రాజెక్టులకు 351.70 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో చే పట్టిన పనులు కొనసాగుతుండగా, వచ్చే జూై లెలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నుంచి ఖరీఫ్ నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వేసవిలో యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టేందుకు రానున్న బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులను కేటాయించాలని కోరారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.... 33 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ. 1568 కోట్లు ఖర్చు చేశారు. 2013-14లో రూ. 337 కోట్లు కావాలని కోరగా రూ. 65 కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 318 కోట్లు కావాలని కోరగా కేవలం రూ. 49 కోట్లు కేటాయించారు. 2014-15లో పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.45కోట్లు కావాలని నివేదిస్తే రూ.42.50 కోట్లు కేటాయించారు. మిగిలిఉన్న పనులను చేపట్టేందుకు 2015-16 బడ్జెట్లో రూ. 222 కోట్లు, పనుల నిర్వహణకు 26 కోట్లు కేటాయించాలని నివేదించారు. రాజీవ్ భీమా ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 2158.40 కోట్లు ఖర్చవుతాయని మొదటగా అంచనా వేశారు. ఇప్పటివరకు దీనికి రూ.2230 కోట్లు ఖర్చు చేశారు. అయితే, అంచనా వేసిన ప్రకారం కాకుండా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు 2013-14 బడ్జెట్లో రూ. 355 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు మాతమే కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 335 కోట్లు కావాలని కోరగా రూ.125 కోట్లను కేటాయించారు. 2014-15 పూర్తిస్థాయి బడ్జెట్లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్లో 250 కోట్లు కేటాయింపు చేయాలని కోరారు. కల్వకుర్తి(మహాత్మాగాంధీ) ఎత్తిపోతల కేఎల్ఐ ప్రాజెక్టు పూర్తికి రూ. 2990.16 కోట్లు ఖర్చవుతుందని మొదట నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 2750 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 బడ్జెట్లో అధికారులు రూ.500 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.623 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 122 కోట్లు కేటాయించారు.2014-15 పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 119 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్లో రూ. 539 కోట్లు కేటాయించాలని నివేదిక పంపారు. కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు.. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా రూ. 16000కోట్ల అంచనాతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015-16 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని, అదే విధంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జూరాల-పాకాల ప్రాజెక్టుకు 2015-16 బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 1428 కోట్లు ఖర్చవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు అంచనాకు మించి రూ. 1728 కోట్లు ఖర్చు చేశారు. అయితే, మెటీరియల్ ఖర్చులు ఏడాదికేడాదికి పెరుగుతుండడంతో అంచనాకు మించి ఖర్చు చేసినా ఇంకా పూర్తి చేయాల్సిన పనులు భారీగానే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి ఇంకా నిధులు కావాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తికి అధికారులు 2013-14లో 437 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 100కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 452 కోట్లు కేటాయించాలని కోరితే కేవలం రూ. 88 కోట్లు మాత్రమే కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించాలని కొత్త ప్రభుత్వానికి నివేదిస్తే రూ. 79కోట్లు కేటాయించింది. ఇంకా ప్రాజెక్టు పనులకు రూ. 425 కోట్లు అవసరమని.. వాటిని 2015-16 బడ్జెట్లో కేటాయించాలని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల రూ. 360 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అప్పట్లో అధికారులు లెక్కలు వేశారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రూ. 340 కోట్లు ఖర్చు చేశారు. అయినా, ఇంకా పనులు పూర్తికాలేదు. ఆ పనుల పూర్తికి కావాల్సిన నిధుల వివరాలను తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 2013-14 బడ్జెట్లో ప్రాజెక్టు పనులకు రూ. 80కోట్లు కావాలని కోరితే రూ. 40కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.31 కోట్లు కేటాయించాలని కోరితే రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. గత పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 25కోట్లు కేటాయించాలని కోరగా పూర్తిస్థాయిలో నిధులను కేటాయించారు. ఇంకా ప్రాజెక్టు అవసరాలకు కావాల్సిన రూ. 60కోట్లను 2015-16 బడ్జెట్లో కేటాయించాలని తాజాగా అధికారులు నివేదించారు. అధికారుల నివేదిక ఇలా.. పాజెక్టు కోరింది (కోట్లలో) నెట్టెంపాడు 425 భీమా 250 కల్వకుర్తి 539 జూరాల (పనులకు) 222 జూరాల (నిర్వహణకు) 26 ఆర్డీఎస్ 03 కోయిల్‌సాగర్ 60 పాలమూరు లిఫ్ట్ 100 జూరాల-పాకాల 25 -
ఎత్తిపోతలకు కరెంట్ కట్
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎడమకాలువకు నీటిని విడుదల చేసిన వెంటనే 41 ఎత్తిపోతల పథకాలకు రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. దీంతో ఎత్తిపోతల పథకాల కింద ఉన్న 79 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిఏటా కూడా ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోయినప్పటికీ సాగర్ జలాశయంలో నీరు పెరుగుతున్నా కొద్ది ఎడమ కాలువ ప్రవాహం ఆధారంగా నీటిని విడుదల చేసేవారు. ఈసారి మాత్రం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయగానే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించాలని లేఖ నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని సాగర్ ఎడమ కాలువ ఎస్ఈ ట్రాన్స్‌కో అధికారులకు లేఖ రాశారు. సాగర్ జలాశయంలో తక్కువగా నీరుండడం వల్ల ఖరీఫ్‌లో ఎత్తిపోతల పథకాలకు సాగు నీటిని విడుదల చేయలేమని పేర్కొన్నారు. మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసరావుకు లేఖ అందిన వెంటనే ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. నీటిని వాడుకోకుండా ముందస్తుగా చర్యలు సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేరకు నీరు ప్రవహిస్తుంది. కాగా ఎత్తిపోతల పథకాలలోని మోటార్లు నడవాలంటే సుమారుగా 13 అడుగుల మేరకు నీరు ప్రవహించాల్సి ఉంది. మరో వారంరోజుల్లో ఎడమ కాలువకు నీటిని ఎక్కువగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీతో ఎత్తిపోతల పథకాల మోటార్లు నడుపుతారని భావించిన అధికారులు ముందస్తుగానే విద్యుత్ కనెక్షన్లను తొలగించినట్టు తెలుస్తోంది. 12న సమావేశం.. విద్యుత్ కనెక్షన్లు తొలగించడంపై ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు రైతులు, రైతు సంఘాల నాయకులు, ఎత్తిపోతల పథకాల చైర్మన్లు ఈ నెల 12న సమావేశం కానున్నారు. మిర్యాలగూడలో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు రూపొందించనున్నారు. ఎత్తిపోతల పథకాలకు కూడా ఖరీఫ్‌లో సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. విద్యుత్ తొలగించాలని లేఖ వచ్చింది : - శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డీఈ, మిర్యాలగూడ సాగర్ జలాశయంలో సరిపడా నీళ్లు లేవని, ఎత్తిపోతల పథకాలకు ఖరీఫ్‌లో నీటిని విడుదల చేయలేమని, వాటికివిద్యుత్ కనెక్షన్లు తొలగించాలని సాగర్ ఎడమ కాలువ ఎస్ఈ నుంచి రెండు రోజుల క్రితం లేఖ వచ్చింది. అందుకు ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాం. -
సాగునీటి పథకాల అమల్లో నిర్లక్ష్యం తగదు
హొస్పేట : చెరుకు రైతులకు మద్దతు ధర కల్పించాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, ఉత్తర కర్ణాటకలోని రైతులకు నీటిపారుదల పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ హించిందని రాష్ట్ర రైతు సంఘం హసిరు సేన సంయుక్త ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు శనివారం జాతీయ రహదారిపై బైఠాయించారు. కొప్పళ తాలూకాలోని హిట్నాళ్-హొసళ్లి క్రాస్ వద్ద వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో రైతులు తీవ్ర కష్టాలకు గురవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ భాగంలో బృహత్ నీటి పథకాలు ఎత్తిపోతల నీటి పథకాలతోపాటు చెరువుల అభివృద్ధి కూడా ఏ మాత్రం జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసుకుని సొంతంగా పొలాల్లో బోర్లు వేసుకున్నారన్నారు. నిరంతరం విద్యుత్ కోత విధించడం వల్ల బోరువెల్ పంప్‌సెట్లపై ఆధారపడిన రైతుల పంటలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గంటల పాటు విద్యుత్ అందిస్తే రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర టన్నుకు రూ.2650 నిర్ణయించి ఆదేశాలు జారీ చేసినా చక్కెర కర్మాగార యజమానులు ఇంత వరకు మద్దతు ధర కల్పించలేదన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి బృహత్ కర్మాగారాలకు సరఫరా చేస్తున్న నీటిని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సింగటలూరు, చిమ్మలగి, ములువాడ, హులిగుడ్డ, నందవాడగితోపాటు ఇతర ఎత్తిపోతల నీటి పథకాల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొప్పళ జిల్లాధికారి కేబీ.మోహన్‌రాజ్‌కు వినతి పత్రం అందజేశారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు రస్తారోకో చేయడంతో వాహనాలు స్తంభించి పోయాయి. ఈ కార్యక్రమంలో రైతు నేతలు గంగాధర, నాగేంద్ర, కళ్యాణ్‌రావు, బీసీపాటిల్, చుక్కినంజుండస్వామి, రామస్వామి, వీరసంగయ్య, రాము, పుట్టుస్వామి, శ్యాంతస్వామి మఠ, గోవిందరాజ, రామకృష్ణప్ప, మంజునాథగౌడ, ముద్దానయ్యహిరేమఠ్ తదితరులు పాల్గొన్నారు.