ఎత్తిపోతలకు కరెంట్ కట్
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎడమకాలువకు నీటిని విడుదల చేసిన వెంటనే 41 ఎత్తిపోతల పథకాలకు రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు. దీంతో ఎత్తిపోతల పథకాల కింద ఉన్న 79 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిఏటా కూడా ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోయినప్పటికీ సాగర్ జలాశయంలో నీరు పెరుగుతున్నా కొద్ది ఎడమ కాలువ ప్రవాహం ఆధారంగా నీటిని విడుదల చేసేవారు. ఈసారి మాత్రం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయగానే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు.
విద్యుత్ కనెక్షన్ తొలగించాలని లేఖ
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని సాగర్ ఎడమ కాలువ ఎస్‌ఈ ట్రాన్స్‌కో అధికారులకు లేఖ రాశారు. సాగర్ జలాశయంలో తక్కువగా నీరుండడం వల్ల ఖరీఫ్‌లో ఎత్తిపోతల పథకాలకు సాగు నీటిని విడుదల చేయలేమని పేర్కొన్నారు. మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసరావుకు లేఖ అందిన వెంటనే ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించారు.
నీటిని వాడుకోకుండా ముందస్తుగా చర్యలు
సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేరకు నీరు ప్రవహిస్తుంది. కాగా ఎత్తిపోతల పథకాలలోని మోటార్లు నడవాలంటే సుమారుగా 13 అడుగుల మేరకు నీరు ప్రవహించాల్సి ఉంది. మరో వారంరోజుల్లో ఎడమ కాలువకు నీటిని ఎక్కువగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీతో ఎత్తిపోతల పథకాల మోటార్లు నడుపుతారని భావించిన అధికారులు ముందస్తుగానే విద్యుత్ కనెక్షన్లను తొలగించినట్టు తెలుస్తోంది.
12న సమావేశం..
విద్యుత్ కనెక్షన్లు తొలగించడంపై ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు రైతులు, రైతు సంఘాల నాయకులు, ఎత్తిపోతల పథకాల చైర్మన్‌లు ఈ నెల 12న సమావేశం కానున్నారు. మిర్యాలగూడలో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు రూపొందించనున్నారు. ఎత్తిపోతల పథకాలకు కూడా ఖరీఫ్‌లో సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు.
విద్యుత్ తొలగించాలని లేఖ వచ్చింది :
- శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో డీఈ, మిర్యాలగూడ
సాగర్ జలాశయంలో సరిపడా నీళ్లు లేవని, ఎత్తిపోతల పథకాలకు ఖరీఫ్‌లో నీటిని విడుదల చేయలేమని, వాటికివిద్యుత్ కనెక్షన్లు తొలగించాలని సాగర్ ఎడమ కాలువ ఎస్‌ఈ నుంచి రెండు రోజుల క్రితం లేఖ వచ్చింది. అందుకు ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కనెక్షన్లు తొలగించాం.