భారం సర్కారుదే | Our primary target supply water for crore yards of crops | Sakshi
Sakshi News home page

భారం సర్కారుదే

Published Fri, Jul 22 2016 3:53 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

భారం సర్కారుదే - Sakshi

భారం సర్కారుదే

ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చుపై ముఖ్యమంత్రి కేసీఆర్
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం
కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. నీటి పారుదల శాఖకు ప్రతినెలా రూ.2,100 కోట్లు
ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న రైతులను చంద్రబాబు రాచిరంపాన పెట్టారు
బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ఎత్తిపోతలు.. శరవేగంగా మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించాలని అధికారులకు సూచన
సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన కేసీఆర్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరుతామన్నారు. గురువారం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. రైతులను ఆదుకోవడం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని పేర్కొన్నారు.
 
  ప్రాజెక్టులకు ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని.. అందులో ప్రతి నెలా రూ.2,100 కోట్ల చొప్పున నీటి పారుదల శాఖకు జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం రాచిరంపాన పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారని.. అలాంటి పాలకులను తిరస్కరించారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందివ్వడంతో పాటు సాగునీరు అందించడం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని, దీనికి జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.
 
 ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలి
 తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వినియోగించుకోగలుగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఏటా 4,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ పూర్తయినా.. వెయ్యి టీఎంసీలలోపే నీటిని వాడుకోగలమని, మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్‌కే వెళుతుందని చెప్పారు. సముద్రంలోకి వృథాగా వెళుతున్న నీటిని వినియోగించుకునేలా ఏపీ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.ఇరు రాష్ట్రాల రైతులూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
 
 సీతారామ ప్రాజెక్టుతో 320 మెగావాట్ల విద్యుత్
 ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను సమీకృతం చేసి రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి సీతారామ ప్రాజెక్టును నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత బ్యారేజీకి 200 మీటర్ల కింద మరింత ఎత్తుగా బ్యారేజీ నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చేలా సాగునీటి వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు.
 
 దానివల్ల దాదాపు 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండటంతో పాటు.. దాదాపు 31 కిలోమీటర్ల వరకు నదిలో నీరు నిలుస్తుందని, ఎలాంటి ముంపు లేకుండా ఆ నీటిని వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ డిజైన్ వల్ల దాదాపు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో జలాలు లేకున్నా... ఈ ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లా వ్యవసాయానికి ఢోకా ఉండని పరిస్థితి తేవాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక, అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
 
 శరవేగంగా మేడిగడ్డ
 కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే తెలంగాణ రైతులకు అంత ప్రయోజనం చేకూరుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు అమర్‌పాల్‌సింగ్, రామకృష్ణారావు, రజనీశ్ చౌహాన్‌లతో ఇదే సమీక్షలో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు మేడిగడ్డ నిర్మాణ మెథడాలజీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 నెలల సమయంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను అందులో పేర్కొన్నారు. బ్యారేజీతో పాటు నదికి ఇరువైపులా మట్టికట్ట కట్టే ప్రాంతాలను కూడా ఖరారు చేశారు. బ్యారేజీ పూర్తయ్యే కన్నా ముందే పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయాలని ఈ సందర్భంగా వారికి కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీ్‌శ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement