విశాఖలోనూ ఐటీఐఆర్ తరహా ప్రాజెక్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఐటీ రంగాన్ని ఆదుకునేందుకు హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ తరహాలో తక్షణం ఇక్కడ కూడా ప్రత్యేక ప్రాజెక్టు ప్రకటించాలని విశాఖ అభివృద్ధి మండలి, రుషికొండ ఐటీ పార్క్స్‌అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోషియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ విశాఖకు రెండో ఐటీ రాజధాని అనే పేరు మాత్రమే మిగిలిందన్నారు. తాజాగా హైదరాబాద్‌లో 2.19 లక్షల కోట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ప్రకటించడం విద్యార్థులను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు.
ఇప్పటికే రాజధానికి సమాంతరంగా సీమాంధ్రలో విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి రెండో దశ నగరాల్లో ఈ రంగాన్ని అసలు ప్రోత్సహించకుండా మళ్లీ రాజధానినే భారీగా అభివృద్ధిచేసే ప్రయత్నాలు చేయడం ప్రాంతీయ అసమానతలను పెంచడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం విశాఖలో ఐటీ కుప్పకూలే దశలో ఉందని, ప్రభుత్వ నిర్వాకం వలన సెజ్‌ల్లో 70 శాతానికిపైగా సంస్థలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పారు. ఐటీ రంగాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్ చుట్టూ కోట్లు ఖర్చుచేయడం అన్యాయమన్నారు.
‘ఐటీఐఆర్’ రెచ్చగొట్టేదిగా ఉంది: జేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన అనంతరం.. ఇరుప్రాంత ప్రజల్ని సమన్వయం చేయకపోవడమేగాక ఒకే ప్రాంతానికి లక్షల కోట్లు వెచ్చిస్తూ.. మరో ప్రాంతానికి అన్యాయం చేయడం సరికాదని కూకట్పల్లి ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం మిన్నంటుతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఐటీఐఆర్)ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడానికిది సరైన సమయం కాదన్నారు. ఇది సమైక్యాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక.. ఇరుప్రాంత ప్రజల్ని సమన్వయం చేసిన తరువాతే ఐటీ పెట్టుబడులు ఇరుప్రాంత ప్రజలకు సమానంగా ఉండేలా చూస్తే బాగుండేదన్నారు.