ఢిల్లీ తరహా కాలుష్యం.. జర భద్రం!
హైదరాబాద్ పరిస్థితిపై అక్బరుద్దీన్ హెచ్చరిక
- కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్న కేటీఆర్
- 1,545 పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించనున్నామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కాలుష్య ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మేల్కొనకపోతే న్యూఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కాలు ష్యంలో ఆసియా ఖండంలోనే 24వ స్థానంలో ఉందని.. అందువల్ల త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్ కాలుష్యంపై అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో ప్రతిరోజూ కొత్తగా 6వేల వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో వాహనాల సరాసరి వేగం గంటకు 60 కిలోమీటర్ల దాకా ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం కేవలం 20 కిలో మీటర్లే ఉంది. దీంతో కాలుష్యం 2 నుంచి 8 శాతం పెరుగుతోంది.
నగరం మధ్యలో ఉన్న పరిశ్రమలతోనూ కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఆస్తమా కేసుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. వెంటనే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలి..’’ అని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆగ్రా, ఔరంగాబాద్, ఢిల్లీ వంటి నగరాలకన్నా హైదరాబాద్ మెరుగ్గానే ఉన్నా.. కాలుష్యం నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,545 పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలికి తరలించేలా చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు.
డీఎస్సీ నిర్వహించేదెప్పుడు?: అరుణ
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతున్నాయని, డీఎస్సీ ఎప్పుడు నిర్వహి స్తారని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రశ్నిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. ఈఏడాది 4,872 పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా గతేడాదితో పోలిస్తే 12,012 మంది విద్యార్థులు పెరిగారన్నారు.
త్వరలో 100 మినీ ఏసీ బస్సులు
ఇంటి వద్దకే సర్వీసు అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల మధ్య సర్వీసులు నడిపేందుకు 21 సీట్ల సామర్థ్యం గల 100 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోం దని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. వీటిని మొదటగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామాబాద్ రూట్లలో ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు.
పంచాయతీలకు రాష్ట్ర నిధులేవీ?: కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 13, 14వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందిస్తున్న నిధులే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాటికి ఇవ్వడం లేదని బీజేపీపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్ల అధికారాలు, పంచా య తీలకు నిధుల విడుదలపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన నిలదీశారు. ‘సర్పంచ్‌లకు బాధ్యతలే తప్ప నిధుల్లేవు. గ్రామజ్యోతి, మన ఊరు–మన ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టినా వాటి ప్రణాళికే కనబడడం లేదు. ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ల నుంచి బలవంతంగా లాక్కొని విద్యుత్, నీటి బిల్లులు కట్టించుకుంటున్నారు. కేవలం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు..’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఇదే నిజమైతే సభ నుంచి నిష్క్రమిస్తా: ఈటల
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ.. గ్రామాభివృధ్ధి విషయంలో కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను వేరు చేసి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. గతంలో గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తే గొప్పగా ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఇస్తోందని చెప్పారు. అధికార పార్టీ, విపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రజాప్రతినిధులందరినీ సమదృష్టితో చూస్తున్నామన్నారు. అధికార పార్టీ నేతలకే నిధులి చ్చామని నిరూపిస్తే సభ నుంచి నిష్క్రమిస్తానని ఈటల సవాలు చేశారు. ఇక సర్పంచ్ల అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిల్లో 30 శాతమైనా కట్టాలని మాత్రమే కోరామన్నారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని కిషన్‌రెడ్డి నిరసన తెలిపారు.