Italy Prime Minister
-
G7 Summit 2024: మోదీకి మెలోనీ సాదర స్వాగతం
భేటీకి వస్తున్న మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎదురెళ్లిమరీ సాదర స్వాగతం పలికారు. మోదీ ఆమెకు నమస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ7 భేటీకి వచి్చన అగ్రనేతలనూ మోదీ కలిశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తోనూ మోదీ మాట్లాడారు. -
Meloni: డీప్‌ఫేక్ వీడియోలపై దావా వేసిన ఇటలీ ప్రధాని
రోమ్: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని డీప్‌ఫేక్ కంటెంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. స్వయంగా తానే బాధితురాలినంటూ మీడియా ముందుకు వచ్చారామె. అంతేకాదు.. ఆ వీడియోలను అప్లోడ్ చేసిన వ్యక్తులపై లక్ష యూరోలకు పరువు నష్టం దావా వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేరిట వీడియోలు అశ్లీల సైట్లలో అప్లోడ్ అయ్యాయి. ఓ పోర్న్‌స్టార్ ముఖానికి మెలోనీ ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేశారు ఇద్దరు. ఆ వీడియోలను అమెరికాలో గత కొన్ని నెలలుగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆమె సత్వరమే స్పందించారు. ఆ ఇద్దరిపై లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయల దాకా) పరువు నష్టం దావా వేశారామె. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జులై 2వ తేదీన ఆమె కోర్టుకు హాజరు కానున్నారు. ఇక.. ప్రధాని లాంటి ఉన్నత పదవిలో ఉన్న తానే డీప్‌ఫేక్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చానని, బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి తీసుకునే పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు విరాళంగా మెలోనీ ఇస్తారని ప్రధాని లీగల్ టీం ప్రకటించింది. నిందితులను తండ్రీ కొడుకులుగా(40, 72 ఏళ్లు) గుర్తించిన దర్యాప్తు అధికారులు.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ వీడియోలను అప్లోడ్ చేసినట్లు నిర్ధారించారు. అయితే.. మెలోనీ ప్రధాని కాకముందే 2022లో ఆ వీడియోలు అప్లోడ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇటలీ చట్టాల ప్రకారం ఇలాంటి పరువు నష్టం దావాలు తీవ్రంగా నేరాలుగా పరిగణించబడ్తాయి. బాధితులకు పరిహారం ఇప్పించడంతో పాటు నిందితులకు జైలు శిక్ష విధిస్తారు కూడా. సంబంధిత వార్త: ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలు! -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
చరిత్రలో తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మహిళ
రోమ్: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్ వింగ్‌కు చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటీలీ పార్టీ అధ్యక్షురాలు జియార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు. ప్రధాని అయ్యాక మెలోని ఫైర్ బ్రాండ్‌గా ముందుకుసాగుతారని అంతా భావిస్తున్నారు. ఇటలీ అంతర్జాతీయ సంబంధాలు, వలసదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అలాగే దేశ అప్పులను తగ్గించేందుకు స్థిరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడాతరని అనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెలోని సారథ్యంలోని బ్రథర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ మొత్తం 400 స్థానాలకు 118 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇతరుల మద్దతుతో 237 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెలోని ఇప్పటికే కేబినెట్‌ను కూడా ప్రకటించారు. చదవండి: ‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’ -
షాకింగ్ న్యూస్.. ఇద్దరు ప్రధానులు రాజీనామా
వెల్లింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా, ఇదే రోజు ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ కూడా రాజీనామా చేశారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్ కీ 2008లో ప్రధాని అయ్యారు. న్యూజిలాండ్ ప్రధాని స్వచ్ఛందంగా రాజీనామా చేయగా, ఇటలీ ప్రధాని రెంజీ.. రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. రాజ్యాంగ సవరణ కోసం ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితం వెలువడిన కొన్ని గంటలకే రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖ అందజేశారు. తన పరిపాలన అనుభవం ఇంతటితో ముగిసిందని రెంజీ వ్యాఖ్యానించారు.