అనాదిగా... అవస్థలు
అనాదిగా వారిది అనాగరిక జీవనమే. తరాలు మారుతున్నా... వారి తలరాతలు మారడంలేదు. వారి బతుకులు బండలే అవుతున్నాయి. పక్కా ఇళ్లకు నోచుకోని పల్లెలు... నడవడానికీ వీలుపడని రాళ్లు తేలిన రహదారులు... గుక్కెడు నీటికోసం మైళ్లకొద్దీ ప్రయాణించాల్సిన పరిస్థితులూ... ఇవీ జిల్లాలోని గిరిజనుల స్థితిగతులు. ప్రధానంగా నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధికి దూరంగా... కనీస సౌకర్యాలైన రహదారులు, కాలువలు, విద్య, వైద్యం వంటి వాటికి నోచుకోక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కురుపాం :నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఐటీడీఏ పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా ్ఛ గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం, రోడ్లు, కాలువలు సంగతి సరేసరి. కురుపాం మండలంలోని ఇప్పలగుడ్డి, పోరండంగూడ, జలుబుగూడ, గెడ్డగూడ, ఈతమానుగూడ... గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడబాయి, గేరుజెండ, గేరువాడ, బాలేసు... జియ్యమ్మవలస మండలంలోని చిన్నతోలుమండ, చిలకాం, పెద్దదోర్జ.. కొమరాడ మండలంలోని నయ, కుంతేసు తదితర గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
అనారోగ్యం చేస్తే అంతే..
అత్యవసరవేళ గర్భిణులు, రోగులు, వృద్ధులకు వైద్యంకోసం మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నా గ్రామాల్లోకి వాహనాలు రాలేకపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యసేవల కోసం డోలీ కట్టి తీసుకు వెళ్లాల్సివస్తోంది. తమ సమస్యలు పలుమార్లు ఐటీడీఏ అధికారులు, మండలాధికారులకు వినతి పత్రాల ద్వారా విన్నంచినా ఫలితం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఎన్నికల వేళ తమకోసం ఇంతదూరం వచ్చే నేతలు ఎన్నికలయ్యాక తమ అవసరాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు స్పందించి గిరిశిఖర గ్రామాల అభివృద్ధికి రహదారే ముఖ్యమని గ్రహించి ఉపాధిలో భాగంగా రహదారులను మంజూరు చే యాలని డిమాండ్ చేస్తున్నారు.