ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు
మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూ పోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. ప్రపంచంలో జీవవైవిధ్యం సజావుగా ఉంటేనే భూమ్మీద మనుషుల మనుగడ సజావుగా ఉంటుంది. జీవవైవిధ్యాన్ని కాపాడే వన్యప్రాణులు ఒక్కొక్కటే కనుమరుగైపోతుంటే, చివరకు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మన భారతదేశంలోనూ వన్యప్రాణుల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వన్యప్రాణుల వర్తమాన పరిస్థితులపై ఒక సింహావలోకనం....
మిగిలిన ప్రపంచం సంగతలా ఉంచితే, మన భారతదేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవ వైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్ పార్కులు ఉన్నాయి. వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. స్థూలంగా చూసుకుంటే దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని– 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. మన దేశంలోని పడమటి కనుమలు, తూర్పు హిమాలయ ప్రాంతం, భారత్–బర్మా సరిహద్దు ప్రాంతాలు మూడూ ప్రపంచంలోనే గొప్ప జీవవైవిధ్యానికి ఆలవాలయంగా నిలుస్తున్న ముప్పయి నాలుగు ప్రాంతాల్లో కీలకమైనవి.
ప్రపంచంలోని దాదాపు 60 శాతానికి పైగా జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తున్న పదిహేడు దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలోని స్తన్యజీవుల్లో 7.6 శాతం, ఉభయచరాల్లో 14.7 శాతం, 6 శాతం పక్షి జాతులు, 6.2 శాతం సరీసృపాలు, 6 శాతం పూలు పూసే వృక్షజాతులు భారత భూభాగంలో ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నా, ప్రపంచంలో చాలా చోట్ల మాదిరిగానే మన దేశంలోనూ వన్యప్రాణుల మనుగడకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులేమీ లేవు. మనుషులు అడవులను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం, ఎన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడటం, ఖనిజ తైల ఇంధనాలను, రసాయనిక ఎరువులు, పురుగుమందులను యథేచ్ఛగా వాడటం వంటి చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది.
మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని, వీటిలో 49 వృక్షజాతులు కూడా ఉన్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్) గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పెద్దపులి మొదలుకొని పలు చిన్నా చితకా జంతువులు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మన దేశంలో దాదాపు 40 వేల పెద్దపులులు ఉండేవి. 2008 నాటికి వీటి సంఖ్య 1,411కు పడిపోయినా, నవసహస్రాబ్ది ప్రారంభంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా 2019 నాటికి 2,967కు చేరుకుంది. మన దేశంలోని మిగిలిన వన్యప్రాణులదీ దాదాపు ఇదే పరిస్థితి.
ముప్పులో పదిలక్షల జీవజాతులు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని గత ఏడాది మే నెలలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 లక్షల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, వీటిలో పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ‘గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్’ హెచ్చిరిస్తోంది. ప్రపంచంలోని 50 ప్రధాన దేశాల ప్రభుత్వాలు, శాస్త్ర పరిశోధన సంస్థల నుంచి సేకరించిన వివరాలతో 145 మంది శాస్త్ర నిపుణులు 1500 పేజీలతో ఈ నివేదికను రూపొందించారు. పారిస్‌లో గత ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో ఈ నివేదిక సారాంశాన్ని 40 పేజీలతో ‘సమ్మరీ ఫర్ పాలసీ మేకర్స్’ పేరిట విడుదల చేశారు. మన పర్యావరణ ఆరోగ్యం శరవేగంగా క్షీణిస్తోందనేందుకు ఈ నివేదికే నిదర్శనమని పారిస్ సదస్సులో ‘ఇంటర్‌గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయో డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ (ఐపీబీఈఎస్) అధ్యక్షుడు రాబర్ట్ వాట్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘మన ఆర్థిక వ్యవస్థలు, మన జీవనోపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, జీవన నాణ్యతలకు సంబంధించిన పునాదులకు మనమే హాని చేసుకుంటున్నాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మితిమీరిన చేపల వేట, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆమ్లీకరణ వంటి వాటితో చివరకు సముద్రాలను కూడా దారుణంగా నాశనం చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. నవ సహస్రాబ్దిలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని పారిస్ సదస్సులో పాల్గొన్న ‘నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ’ ఉపాధ్యక్షుడు జొనాథన్ బెయిలీ పిలుపునిచ్చారు.
మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవులు...
మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతులు మొత్తం 132 ఉన్నట్లు ఇటీవల అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలు వెల్లడించిన వాటిలో కొన్ని ప్రధానమైన జీవజాతులు కూడా ఉన్నాయి. మన జాతీయ జంతువుగా గర్వంగా చెప్పుకునే బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), గంగా నదీ డాల్ఫిన్, ‘ఘరియాల్’ జాతికి చెందిన మొసలి, కొంగ జాతికి చెందిన ‘ఇండియన్ బస్టర్డ్’, ఖడ్గమృగం, కృష్ణజింక, అడవి గాడిద, నీటి బర్రె, ఏనుగు, నీలగిరి కోతి, రేచు కుక్క, రెడ్ పాండా వంటివి కూడా ఉన్నాయి.
పక్షులలో గద్దలు, రాబందులు, పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. అడవుల్లోనే కాదు, ఒకప్పుడు పట్టణాల పరిసరాల్లో కూడా కనిపించే ఈ పక్షిజాతులు బొత్తిగా అరుదుగా మారాయి. వీటితో పాటు కొంగ జాతికి చెందిన ‘వైట్ బెల్లీడ్ హెరాన్’, బాతు జాతికి చెందిన బేయర్స్ పోచార్డ్, పిచుకను పోలి ఉండే స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్, హిమాలయ క్రౌంచ పక్షి, మణిపురి క్రౌంచపక్షి, అడవి గుడ్లగూబ, నెమలి జాతికి చెందిన ‘గ్రీన్ పీఫౌల్’, నీలగిరి పక్షి, డాల్మేషియన్ కొంగ, సారస్ కొంగ వంటి పక్షిజాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి.
జంతుజాతుల్లో పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వాటితో పాటు హిమాలయన్ తోడేలు, చైనీస్ పంగోలిన్, కశ్మీర్ జింక, రెడ్ పాండా, కస్తూరి మృగం, అడవి దున్న, నీటి బర్రె, జడల బర్రె, నీలగిరి తహర్, వానరాల జాతికి చెందిన లయన్ టెయిల్డ్ మకాక్, జంగుపిల్లి, మంచు చిరుత, నీలగిరి మార్టెన్, ఎలుగు జాతికి చెందిన సన్ బేర్ వంటి జంతువులు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. జలచరాల్లో గంగా డాల్ఫిన్, ఘరియాల్ మొసలి వంటి వాటితో పాటు ఆలివ్ రిడ్లే తాబేలు, అస్సాం తాబేలు, కీలెడ్ బాక్స్ తాబేలుతో పాటు ఫిన్ వేల్, బ్లూ వేల్, నైఫ్ టూత్ సా ఫిష్, రెడ్‌లైన్ టార్పెడో బార్బ్, గోల్డోన్ మహాసీర్ మత్స్యజాతులు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా, గోవా తొండ, వాయనాడ్ తొండ, పడమటి కనుమల్లో కనిపించే ‘బ్రాంజ్‌బ్యాక్’ పాము, పూనా బల్లి, కొండ బల్లి, ట్రావెన్కోర్ పాము వంటి సరీసృపాలు దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించిన ప్రకారం 1750 నాటి నుంచి ఇప్పటి వరకు భారత భూభాగంపై కనిపించే వన్యప్రాణి జాతుల్లో నాలుగు, వృక్షజాతుల్లో 18 పూర్తిగా అంతరించిపోయాయి. అంతరించిపోయిన వృక్షజాతుల్లో నాలుగు జాతులు పూలు పూయని జాతులకు చెందినవైతే, 14 పూలు పూసే జాతులకు చెందినవని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) డైరెక్టర్ ఏఏ మావో ఒక నివేదికలో వెల్లడించారు. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను గత ఏడాది జూలైలో లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టింది. ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు, వేట వంటి మానవ తప్పిదాలు వంటి కారణాల వల్ల ఈ జీవజాతులు అంతరించిపోయాయని అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వన్యప్రాణులకు చేటు తెస్తున్న కారణాలు
వన్యప్రాణులకు చేటు తెచ్చి పెడుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల మితిమీరి పెరుగుతున్న కాలుష్యం, దాని ఫలితంగా పెరుగుతున్న భూతాపం, యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత, విశృంఖలమైన వేట, వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల వల్ల పెరిగిన పురుగు మందులు, రసాయనిక ఎరువుల వినియోగం వంటివి వన్యప్రాణుల మనుగడకు తీవ్రస్థాయిలో ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాలు. వీటిని నియంత్రించకుంటే మన కళ్ల ముందే చాలా జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు కూడా వన్యప్రాణులు అంతరించిపోవడానికి కారణమవుతుంటాయి. గ్రహశకలాలు భూమిని తాకడం, భూకంపాలు, కార్చిచ్చులు వంటి ఉత్పాతాలు జీవరాశికి చేటు తెచ్చిపెడుతుంటాయి.
దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట గ్రహశకలాలు భూమిని తాకిన ఫలితంగా అప్పటి వరకు భూమ్మీద మనుగడ సాగించిన భారీ జీవులైన డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అడవుల నరికివేత, కార్చిచ్చుల కారణంగా వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి అంతరించిపోయే పరిస్థితులకు చేరుకుంటున్నాయి. జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగా కొన్ని ప్రాణులు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటున్నాయి. ఆఫ్రికన్ చిరుతలు జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగానే త్వరగా అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరవడటం వల్ల మరికొన్ని జీవజాతులు నశిస్తున్నాయి. దోమలను ఆహారంగా తీసుకుంటూ మనుగడ సాగించే కొన్ని రకాల కప్పలు, గబ్బిలాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గముఖం పడుతోంది. ప్లాస్టిక్, ప్రమాదకరమైన రసాయనాలు సముద్రాల్లో కలుస్తుండటంతో పలు జాతులకు చెందిన సముద్రజీవులు, పగడపు దీవులు వేగంగా నశిస్తున్నాయి.
వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు
వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మన ప్రభుత్వం కూడా ఈ దిశగా పలు చర్యలు చేపడుతోంది. కేవలం శతాబ్ది వ్యవధిలోనే మన దేశంలో పులుల సంఖ్య 95 శాతానికి పైగా కనుమరుగవడంతో ప్రభుత్వం 1972లో పులులను కాపాడుకోవడానికి ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించింది. అదే ఏడాది వన్యప్రాణి పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ‘ప్రాజెక్ట్ టైగర్’ ఇప్పుడిప్పుడే కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుండటం కొంత ఆశాజనకమైన పరిణామం. దంతాల కోసం ఏనుగుల వేట విచ్చలవిడిగా సాగడంతో ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో 1992లో ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది. అదే రీతిలో మొసళ్లు, తాబేళ్ల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్టులను ప్రారంభించింది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం రాబందుల పరిరక్షణ కోసం, ఖడ్గమృగాల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రభుత్వాలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఎన్ని కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, అమలులోకి తెచ్చినా, ఖనిజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించకుండా జీవవైవిధ్యాన్ని దీర్ఘకాలంలో కాపాడుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖనిజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, విరివిగా అడవుల పెంపకం, రసాయన వ్యర్థాలను నదులు, సముద్రాల్లో కలపకుండా జాగ్రత్త పడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను చిత్తశుద్ధితో చేపడితే తప్ప జీవజాతులను కాపాడుకోలేమని వారు చెబుతున్నారు.