ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన టక్కర్
- ఐ.వై.ఆర్. సేవలను కొనియాడిన సాధారణ పరిపాలన శాఖ, ఐఏఎస్‌ల సంఘం
- విభజన క్లిష్ట సమయంలో పాలనను సజావుగా నడిపించారని ప్రశంస
- పైలైట్‌గా టక్కర్ సజావుగా టేకాఫ్ చేస్తారని ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ఐ.వై.ఆర్. కృష్ణారావు నుంచి సీఎస్‌గా టక్కర్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో డబుల్ డిజిట్ వృద్ధి సాధించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. 15 శాతం వృద్ధి సాధించడం అంత తేలికైన విషయం కాదని, అయినా అన్ని రంగాలు కష్టపడి పనిచేసేలాగ చర్యలు తీసుకోవడం ద్వారా వృద్ధి సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందిస్తామని, తద్వారా వృద్ధిపై కరువు ప్రభావాన్ని వీలైనంత మేర తగ్గిస్తామన్నారు. ఇటీవల ముగిసిన భాగస్వామ్య సదస్సు ద్వారా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు మిగతా అన్ని విషయాలపై త్వరలో ముఖ్యమంత్రితో సమావేశమై అందుకు అనుగుణంగా చర్యలను తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. టక్కర్ బాధ్యతలు స్వీకరణ అనంతరం పదవీ విరమణ చేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావుకు వీడ్కోలు సభను సచివాలయ సాధారణ పరిపాలన శాఖ నిర్వహించింది. ఈ వీడ్కోలు సభలో టక్కర్‌తో పాటు డీజీపీ రాముడు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు ప్రాణిగ్రహి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషన్ కుమార్, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.గిరిధర్, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు చేసిన సేవలను పలువురు ప్రశంసించారు. రాష్ట్ర విభజనఅనంతరం కిష్ట సమయంలో తొలి సీఎస్‌గా ఐ.వై.ఆర్. బాధ్యతలు చేపట్టినప్పటికీ చాలా సమస్యలను అవలీలగా ఎదుర్కొన్నారని, విభజన అంశాల్లో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారని పేర్కొన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ చాలా వేగంగా చేశారని, ఏ అంశంపైన అయినా సమావేశంలో అనవసర చర్చలతో సమయాన్ని వృధా చేయకుండా అవసరమైన మేరకు చర్చించి అక్కడిక్కడే నిర్ణయం తీసుకోవడంలో ఐ.వై.ఆర్.కు సాటిలేరని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు అన్ని విధాల సహకారం అందిస్తామని లింగరాజు ప్రాణిగ్రహి పేర్కొన్నారు. సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు రాష్ట్రాన్ని టేకాఫ్ స్థితికి తీసుకువచ్చారని, ఇప్పుడు టక్కర్ ఫైలట్‌గా సజావుగా టేకాఫ్ చేయించాలని కోరుకుంటున్నామని ప్రాణిగ్రహి పేర్కొన్నారు. డబుల్ డిజిట్ వృద్ధి సాధించడంలో టక్కర్ కృషిని కొనసాగించాలని, మిగతా సాధారణ పరిపాలన అంశాల కన్నా దానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
పనిచేయడం అలవాటుగా మార్చుకోవాలి-ఐ.వై.ఆర్.
సీఎస్‌గా పనిచేసిన సమయంలో సహకారం అందించిన వారందరికీ ఐ.వై.ఆర్. కృతజ్ఞతలు తెలియజేశారు. ఐఏఎస్‌గా ఏ పదవిలో కొనసాగినా చాలా సంతృప్తిగా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. పనిచేయడం అనేది అలవాటుగా మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల ఎటువంటి పనిచేయకపోవడమేన ని, ఫైళ్లు క్లియరెన్స్ చేయడమే పనిగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. విభజన సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, ఇంకా మిగిలిన సమస్యలను కొత్త సీఎస్ టక్కర్ పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు.