I.Y.R. Krishna rao
-
పీఆర్సీ అమలుపై ఏపీ సీఎస్ ప్రాథమిక సమీక్ష
త్వరలో మంత్రుల కమిటీ ఏర్పాటు ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు అదనపు భారం నెలకు రూ. 8.96 కోట్లు సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) అమలు దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ అధికారులతో ప్రాథమికంగా సమీక్షించారు. ఒక శాతం ఫిట్‌మెంట్‌కు నెలకు 8.96 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తున్నారని, 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫార్సు చేసిందని తెలిపారు. వాస్తవానికి 2013 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉన్నా.. ప్రభుత్వానికి నివేదిక అందడంలో జాప్యం జరిగిందని, రాష్ట్ర విభజన, పాలనాపరమైన కారణాల వల్ల అమల్లో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చారని, కనీసం 35 శాతం ఫిట్మెంట్ ఇచ్చే యోచనలో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజధానికి తరలివెళ్లాల్సి ఉంటుందని, హెల్త్‌కార్డుల వ్యయంలో 40 శాతం భరించాల్సి ఉంటుందని, నిత్యావసర వస్తువుల ధరలూ మండిపోతున్నాయని.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిట్మెంట్ నిర్ణయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలతో ఫైల్‌ను తనకు పంపించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. త్వరలో ఏర్పాటయ్యే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు. -
టీ పోలీసులపై నేడు కేంద్రానికి ఏపీ ఫిర్యాదు
కేంద్ర కేబినెట్, హోంశాఖ కార్యదర్శులను కలవనున్న సీఎస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పోలీసుల వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో, సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఆయన సమావేశమవుతారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు ఏపీ అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర అధికారులకు సీఎస్ ఫిర్యాదు చేసి, నిరసన తెలపనున్నారు. కార్మిక సంక్షేమ నిధి నుంచి డబ్బులను డ్రా చేయడంపై ఆ శాఖ కమిషనర్ రామాంజనేయులు, మరో అధికారి పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్రానికి వివరించనున్నారు.హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఒక దశలో రామాంజనేయులును అరెస్టు చేస్తామన్నారు. దీనిపై సీఎస్ ఐ.వై.ఆర్. ఘాటుగా స్పందించారు. తానిచ్చిన ఆదేశాలను రామాంజనేయులు అమలు చేశారని, అరెస్టు చేస్తే తనను చేయాలన్నారు. దీంతో మహేందర్‌రెడ్డి వెనక్కు తగ్గారు. ఈ విషయాన్ని కూడా సీఎస్ కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే న్యాక్ ఏపీ డెరైక్టర్ జనరల్ శ్యాంబాబు, నిథిమ్‌లో సీనియర్ ఐఏఎస్ చందనాఖన్ విధులకు హాజరు కాకుండా పోలీసులు అడ్డు తగలడంపై ఫిర్యాదు చేయనున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పోలీసు వ్యవహారాలు గవర్నర్ అధీనంలో ఉండాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వివరించనున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రభుత్వ పరిపాలనకు హైదరాబాద్‌లో తీవ్ర విఘాతం కలుగుతుందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. ఉద్యోగుల పీఆర్సీపై నేడు సీఎస్ సమీక్ష ఉద్యోగుల పదో వేతన సవరణ సంఘం సిఫార్సులపై తీసుకొనే చర్యలపై చర్చించేందుకు సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం అధికారులతో లేదా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా జె.వి.రాముడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాముడు ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాముడు వాస్తవానికి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయాలి. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదవీ విరమణతో సం బంధం లేకుండా డీజీపీగా నియమించిన వ్యక్తిని రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాముడు మరో 22 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. డీజీపీ ఎంపిక ప్రక్రియపై ఈ నెల 21న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం డీజీపీ కేడర్‌లోని పది పేర్లను సమర్పించారు. అందులో నుంచి ముగ్గురు పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మంగళవారం లేఖ రాసింది. అందులో నుంచి రాముడిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆయన బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.