టీ పోలీసులపై నేడు కేంద్రానికి ఏపీ ఫిర్యాదు
- కేంద్ర కేబినెట్, హోంశాఖ కార్యదర్శులను కలవనున్న సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పోలీసుల వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో, సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఆయన సమావేశమవుతారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులు ఏపీ అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర అధికారులకు సీఎస్ ఫిర్యాదు చేసి, నిరసన తెలపనున్నారు.
కార్మిక సంక్షేమ నిధి నుంచి డబ్బులను డ్రా చేయడంపై ఆ శాఖ కమిషనర్ రామాంజనేయులు, మరో అధికారి పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్రానికి వివరించనున్నారు.హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఒక దశలో రామాంజనేయులును అరెస్టు చేస్తామన్నారు. దీనిపై సీఎస్ ఐ.వై.ఆర్. ఘాటుగా స్పందించారు. తానిచ్చిన ఆదేశాలను రామాంజనేయులు అమలు చేశారని, అరెస్టు చేస్తే తనను చేయాలన్నారు. దీంతో మహేందర్‌రెడ్డి వెనక్కు తగ్గారు.
ఈ విషయాన్ని కూడా సీఎస్ కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే న్యాక్ ఏపీ డెరైక్టర్ జనరల్ శ్యాంబాబు, నిథిమ్‌లో సీనియర్ ఐఏఎస్ చందనాఖన్ విధులకు హాజరు కాకుండా పోలీసులు అడ్డు తగలడంపై ఫిర్యాదు చేయనున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, పోలీసు వ్యవహారాలు గవర్నర్ అధీనంలో ఉండాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వివరించనున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ ప్రభుత్వ పరిపాలనకు హైదరాబాద్‌లో తీవ్ర విఘాతం కలుగుతుందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.
ఉద్యోగుల పీఆర్సీపై నేడు సీఎస్ సమీక్ష
ఉద్యోగుల పదో వేతన సవరణ సంఘం సిఫార్సులపై తీసుకొనే చర్యలపై చర్చించేందుకు సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం అధికారులతో లేదా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.