విలక్షణ కేబినెట్‌ | Typical Cabinet In The Central Government | Sakshi
Sakshi News home page

విలక్షణ కేబినెట్‌

Published Sat, Jun 1 2019 4:21 AM | Last Updated on Sat, Jun 1 2019 4:21 AM

Typical Cabinet In The Central Government - Sakshi

అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌ కూర్పులో మరోసారి తనదైన ముద్ర కనబరుస్తూ రెండో దఫా పాలనకు శ్రీకారం చుట్టారు. ఈసారి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకోవడమేకాక, ఆయనకు అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతల్ని అప్పగించారు. అలాగే విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన జయశంకర్‌ను రప్పించి విదేశాంగ శాఖను కేటాయించారు. ఇంతవరకూ రక్షణమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ ఇచ్చారు. ఆ శాఖను గతంలో నిర్వహించిన అరుణ్‌ జైట్లీ ఆరోగ్య కారణాలరీత్యా బాధ్యతలకు దూరంగా ఉంటానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆర్థిక శాఖను మహిళకు అప్పగించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

ఇంతక్రితం ఇందిరాగాంధీ ఈ శాఖను నిర్వహించిన చరిత్ర ఉన్నా ఆమె ప్రధానిగా ఉంటూ ఆ పని చేశారు. స్వతంత్రంగా ఆ శాఖను మహిళ నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. బీజేపీని సంస్థాగతంగా పటిష్టపరిచి, ఈ అయిదేళ్లూ మోదీకి చేదోడువాదోడుగా ఉంటూ అమిత్‌ షా నంబర్‌–2గా గుర్తింపు పొందారు. మోదీకి, అమిత్‌ షాకూ ఉన్న సాన్నిహిత్యం రీత్యా కేంద్ర కేబినెట్‌లోనూ అదే ప్రాధాన్యతే లభిస్తుందని సులభంగానే చెప్పవచ్చు. అయితే సాంకేతికంగా ఆయనది మూడో స్థానమే. గత కేబినెట్‌లో హోంశాఖ చూసి, ఇప్పుడు రక్షణ శాఖకు బదిలీ అయిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈసారి కూడా రెండో స్థానంలో కొనసాగుతారు. అత్యంత సాధారణ జీవితం గడు పుతూ ‘ఆమ్‌ ఆద్మీ’గా పేరుతెచ్చుకున్న ఒడిశాకు చెందిన ప్రతాప్‌ సారంగిని కేబినెట్‌లోకి తీసుకో వడం మరో చెప్పుకోదగ్గ నిర్ణయం.

తొలి దశ తరహాలోనే ఈసారి కూడా కేబినెట్‌ కూర్పులో మోదీకి పూర్తి స్వేచ్ఛ లభించి ఉంటుం దని దాని స్వరూపం చూస్తే అర్ధమవుతుంది. ఎందుకంటే గత కేబినెట్‌లో ఉన్న 70మందిలో 37మందికి మాత్రమే ఈసారి చోటు దక్కింది. పాత కేబినెట్‌లోని సుష్మాస్వరాజ్‌(విదేశాంగ శాఖ), మేనకా గాంధీ(మహిళ, శిశు సంక్షేమం), ఉమా భారతి(తాగునీరు, పారిశుద్ధ్యం), సురేష్‌ ప్రభు (కేంద్ర పౌర విమానయానం, వాణిజ్యం) తదితరులకు ఈసారి స్థానం లభించలేదు. వీరిలో సుష్మా  జైట్లీ తరహాలోనే స్వచ్ఛందంగా తప్పుకుని ఉండొచ్చు. ఎందుకంటే తాను కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నానని కొన్ని నెలలక్రితం సుష్మా తనంత తానే ప్రకటించారు. తమకొచ్చిన వ్యాధిని దాచుకునే అలవాటున్న నేతల్ని చూడటం అలవాటైనవారికి సహజంగానే ఈ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది.

విదేశాంగ శాఖపై సుష్మా తనదైన ముద్ర వేశారు. సాధారణంగా ఆ శాఖ చూసేవారు విదేశీ పర్యటనలు చేసినప్పుడో...వేరే దేశాల అధినేతలు, మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడో తప్ప వార్తల్లో పెద్దగా కనబడరు. కానీ సుష్మా అందుకు భిన్నం. వేరే దేశాల్లో చిక్కుబడిపోయిన తమవారి గురించి లేదా వీసా, పాస్‌పోర్టు సంబంధిత సమస్యల గురించి సామాన్యులు చేసే ట్వీట్‌లకు సైతం వెనువెంటనే స్పందించడం, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటం ఆమె ప్రత్యేకత. ఆ స్పందనలో మానవీయతా స్పర్శ అందరికీ ప్రస్ఫుటంగా కనబడేది. విదేశాంగ శాఖను మున్ముందు సైతం సుష్మా చూస్తేనే బాగుణ్ణని అందరూ కోరుకునేవిధంగా ఆమె పనిచేశారు. సుదీర్ఘకాలం విదేశాంగ శాఖలో వివిధ హోదాల్లో సీనియర్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించి అనుభవంలో పండిపోయిన జయశంకర్‌ ఆమె మాదిరి పనిచేస్తారా అన్నది చూడాలి. 

ఆర్థిక శాఖ బాధ్యతల్ని గతంలో వలే పీయూష్‌ గోయెల్‌కూ లేదా తాజాగా మంత్రి అయిన అమిత్‌ షాకు అప్పగిస్తారని అందరూ అంచనా వేశారు. కానీ నిర్మలా సీతారామన్‌ను ఎంచుకుని మోదీ అందరినీ ఆశ్చర్యపరిచారు. అత్యంత కీలకమైన ఈ శాఖను నిర్వహించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెను సవాలే. ఆర్థిక శాఖను ఆమెకు అప్పగించిన కొన్ని గంటలకే వెల్లడైన ఆర్థిక గణాంకాలు చూస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. ఆ వివరాల ప్రకారం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 5.8 శాతానికి పరిమితమైంది. 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు మొత్తంగా 6.8శాతం. కీలకమైన 8 మౌలిక  రంగాల వృద్ధి మందగించిందని, 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతం నమోదైందని కూడా ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి.

నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో ఉండటం 45 ఏళ్లలో ఇదే తొలి సారని అంటున్నారు. మన పొరుగునున్న చైనా నాలుగో త్రైమాసికంలో 6.4 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకున్నదని గుర్తుంచుకుంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంతటి విపత్కర స్థితిలో ఉన్నదో అర్ధమవుతుంది. కార్పొరేట్‌ సంస్థల నాలుగో త్రైమాసికం ఫలితాలు కూడా అంతంతమాత్రమే. మన ఆర్థిక వ్యవస్థ పోకడ సరిగాలేదని, అది మందగమనంలో పడిందని ఆర్థిక నిపుణులు చాన్నాళ్లనుంచి చెబుతున్నారు. దాన్ని ఉరకలెత్తించడానికి అవసరమైన కఠినమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని కూడా వార్తలొస్తున్నాయి. కనుక నిర్మలా సీతారామన్‌ నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యతలు, వాటిల్లో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు అసాధారణమైనవి.

ఆమె ఎంపిక ఊహించని నిర్ణయం కాబట్టే మార్కెట్లు తొట్రుపాటుకు లోన య్యాయి. అయితే ఆర్థిక శాఖలో సహాయమంత్రిగా ఉన్నప్పుడైనా, వాణిజ్య శాఖ చూసినప్పుడైనా, ఆ తర్వాత రక్షణ శాఖకు వచ్చాకైనా ఆమె తన సమర్థతను చాటుకున్నారు. అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించడం ప్రస్తుత తరుణంలో కీలక నిర్ణయమని చెప్పాలి. జమ్మూ–కశ్మీర్‌లో మిలిటెన్సీ, మధ్య భారతంలో నక్సల్‌ సమస్య, ఈశాన్యంలోజాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) వ్యవహారాలతో ఈ దఫాలో అమీ తుమీ తేల్చుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షాకు హోంశాఖ అప్పగించారనుకోవాలి. మొత్తానికి సవాళ్లను మోదీ ఎలా అధిగమిస్తారో మున్ముందు చూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement